మెడిసిన్ లో నోబెల్ అవార్డ్ -2024 గ్రహీతలు
మెడిసన్లో 2024 సంవత్సరానికి నోబెల్ ప్రైజ్ ప్రకటించారు. అమెరికా శాస్త్రవేత్తలు విక్టర్ అంబ్రోస్, గేరీ రువ్కున్కు సంయుక్తంగా ఈ అవార్డు దక్కింది.మైక్రో ఆర్ఎన్ఏను కనుక్కోవడంతో పాటు పోస్ట్ ట్రాన్స్కిప్షనల్ జన్యు నియంత్రణలో దాని పాత్ర నిర్వచించినందుకు గాను వారిద్దరూ ఈ అవార్డుకు ఎంపికయ్యారు.నోబెల్ బహుమతి విజేతలకు 1.1కోట్ల స్వీడిష్ క్రోనర్లు లభిస్తాయి. అంటే భారత కరెన్సీలో సుమారు 8 కోట్ల 90 లక్షల రూపాయలు దక్కుతాయన్నమాట.
జన్యు కార్యకలాపాలను ఎలా నియంత్రించవచ్చనే ప్రాథమిక సూత్రాన్ని కనుగొన్నందుకు ఈ ఇద్దరు శాస్త్రవేత్తలకు నోబెల్ బహుమతి దక్కింది.భూమిపై వివిధ రకాల జీవులు ఎలా ఆవిర్భవించాయో, మనిషి శరీరం అనేక రకాల కణాలతో ఎలా తయారయిందో వివరించేందుకు వారి ఆవిష్కరణలు సాయపడుతున్నాయి.జన్యువులను మైక్రో ఆర్ఎన్ఏలు ఎలా ప్రభావితం చేస్తాయి, జీవనానికి ఎలా సూచనలు అందిస్తాయి, మనుషులతో సహా జీవులన్నింటిని ఎలా నియంత్రిస్తాయనేది వారి పరిశోధనల్లో వెల్లడైంది.
జన్యునియంత్రణపై సరికొత్త సిద్ధాంతం
మన క్రోమోజోముల్లో దాగిఉన్న ఈ సమాచారం మన శరీరంలోని అన్ని కణాలకు ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ వంటిది. అన్ని కణాల్లో అవే క్రోమోజోములుంటాయి. అంటే ప్రతి కణం సరిగ్గా అలాంటి జన్యువులను, అలాంటి సూచనలనే కలిగి ఉంటాయి.అయినప్పటికీ కండరాలు, నరాల వంటి రకరకాల కణాలు చాలా ప్రత్యేక లక్షణాలతో ఉంటాయి. ఈ తేడా ఎలా వస్తుంది…? దీనికి సమాధానం జన్యు నియంత్రణపై ఆధారపడిఉంటుంది.
ప్రతి కణం దానికి సంబంధించిన ఒకే ఒక సూచనను మాత్రమే ఎంచుకునేలా జన్యునియంత్రణ చేస్తుంది.దీనివల్ల ఒక్కో రకానికి చెందిన కణంలో సరైన జన్యువుల గ్రూప్ మాత్రమే యాక్టివ్గా ఉంటుంది విభిన్న రకాల కణాలు ఎలా అభివృద్ధి చెందుతాయనేదానిపై విక్టర్ అంబ్రోస్, గేరీ రువ్కున్ ఆసక్తి చూపారు.అత్యంత సంచలనమైన ఈ ఆవిష్కరణ జన్యునియంత్రణ గురించి పూర్తిగా కొత్త సిద్ధాంతాన్ని తెలియజేస్తోంది. వెయ్యికిపైగా మైక్రో ఆర్ఎన్ఏలకు జన్యు సంకేతాలున్నాయి. వారి ఆవిష్కరణ జన్యువుల నియంత్రణకు పూర్తిగా సరికొత్త కోణాన్ని బయటపెట్టింది.జీవులు అభివృద్ధి చెందడానికి, కార్యకలాపాలు నిర్వహించడానికి మైక్రో ఆర్ఎన్ఏలు ప్రాథమికంగా చాలా ముఖ్యమని నిరూపితమైంది.
జన్యువు కార్యకలాపాలను నియంత్రించడానికి వీలుగా కణాల్లో ఉపయోగించే కీలక నియంత్రణ వ్యవస్థ ఆవిష్కరణపై ఈ ఏడాది నోబెల్ ప్రైజ్ దృష్టిపెట్టింది. జన్యువుల సమాచారం డీఎన్ఏ నుంచి మెసెంజర్ RNAకు వెళ్తుంది. ఈ విధానాన్ని ట్రాన్స్క్రిప్షన్ అని పిలుస్తాం. కణాల వ్యవస్థలో ప్రొటీన్ ఉత్పత్తి జరుగుతుంది. అక్కడ mRNAలు పరివర్తన చెందుతాయి. ప్రొటీన్లు డీఎన్ఏలో నిల్వఉంటాయి.నరాల కణాలు, గుండె కణాలతో పోలిస్తే భిన్నమైనవి. కాలేయ కణాలు, కిడ్నీ కణాలతో పోలిస్తే భిన్నమైనవి. రెటీనాలో దృష్టిని గ్రహించగలిగే కణాలు, తెల్ల రక్తకణాలతో పోలిస్తే భిన్నమైనవి.ప్రారంభంలో అంతా ఒకేలా ఉన్నప్పటికీ అనేక రకాలు ఏర్పడతాయి. జన్యు వ్యక్తీకరణ వల్ల ఇది జరుగుతుంది.






