Maithili Thakur: బీహార్ రాజకీయాల్లో యువ సంచలనం – మైథిలీ ఠాకూర్!
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో (Bihar Assembly Elections) ఓ యువ గాయని సంచలన విజయం సాధించింది. భారతీయ జనతా పార్టీ (BJP) అభ్యర్థిగా దర్భంగా జిల్లాలోని అలీనగర్ (Alinagar) నియోజకవర్గం నుంచి జానపద గాయని మైథిలి ఠాకూర్ (Maithili Thakur) ఘన విజయం సాధించారు. యువతకు, రాజకీయాల పట్ల ఆసక్తి ఉన్నవారికి ఆమె విజయం ఒక స్ఫూర్తిదాయకంగా నిలిచింది. కేవలం 25 ఏళ్ల వయసులోనే ఎమ్మెల్యేగా గెలిచి, బీహార్ అసెంబ్లీలో అతి పిన్న వయస్కురాలిగా రికార్డు సృష్టించారు.
మైథిలి ఠాకూర్ జూలై 25, 2000న బీహార్లోని మధుబని జిల్లా, బెనిపట్టిలో సంగీతకారుల కుటుంబంలో జన్మించారు. ఆమె తండ్రి రమేష్ ఠాకూర్, తల్లి భారతి ఠాకూర్. చిన్నతనం నుంచే మైథిలికి సంగీతంపై మక్కువ పెరిగింది. ఆమె తండ్రి వద్దే శాస్త్రీయ, జానపద సంగీతంలో శిక్షణ పొందారు. తన ఇద్దరు తమ్ముళ్లు రిషవ్ ఠాకూర్, అయచి ఠాకూర్లతో కలిసి హిందీ, మైథిలి, భోజ్పురి, బెంగాలీ తదితర భాషల్లో జానపద గీతాలు, భక్తి పాటలు పాడుతూ సోషల్ మీడియాలో సూపర్ పాపులర్ అయ్యారు. యూట్యూబ్లో ఆమెకు లక్షలాది మంది ఫాలోవర్లు ఉన్నారు. ఆమె సంగీతానికి భారత ప్రభుత్వం నుంచి ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కారం లభించింది. బీహార్ రాష్ట్ర ఖాదీ, గ్రామ పరిశ్రమల బోర్డుకు మైథిలి బ్రాండ్ అంబాసిడర్గా కూడా పనిచేశారు. తన కళాత్మక సేవలతో మైథిలి భారతీయ సంస్కృతిని, ముఖ్యంగా మధుబని కళను దేశ విదేశాలకు పరిచయం చేయడంలో కీలక పాత్ర పోషించారు. ఆమె నికర ఆస్తి దాదాపు 3 కోట్ల 80 లక్షలు ఉంటుందని ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నారు.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల ముందు మైథిలి ఠాకూర్ భారతీయ జనతా పార్టీలో చేరడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. పార్టీ ఆమెను దర్భంగా జిల్లాలోని సంప్రదాయ మహాఘట్బంధన్ (MGB) కంచుకోటగా ఉన్న అలినగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలోకి దింపింది. గతంలో ఈ స్థానం నుంచి ఆర్జేడీ అభ్యర్థి అబ్దుల్ బారి సిద్ధిఖీ రెండుసార్లు గెలుపొందారు. ఈ నియోజకవర్గంలో బ్రాహ్మణులతో పాటు ముస్లిం, యాదవ్ ఓటర్లు గణనీయంగా ఉన్నారు. మైథిలి తన ప్రచారంలో రాజకీయాల కంటే సంస్కృతి, యువత సమస్యలు, సామాజిక అంశాలపై ఎక్కువ దృష్టి సారించారు. ఆమెకున్న అపారమైన అభిమానం, యువతలో ఉన్న క్రేజ్, సాంప్రదాయేతర అభ్యర్థిగా ఆమె నిలబడడం వంటి అంశాలు విజయంలో కీలక పాత్ర పోషించాయి. బీజేపీ అగ్ర నాయకులు, కేంద్ర హోం మంత్రి అమిత్ షా వంటివారు సైతం ఆమె తరపున ప్రచారం నిర్వహించారు. కేవలం 25 సంవత్సరాల వయసులో, మైథిలి ఠాకూర్ తన సమీప ప్రత్యర్థి, ఆర్జేడీ సీనియర్ నాయకుడు బినోద్ మిశ్రాపై 11వేల 730 ఓట్ల తేడాతో అద్భుత విజయం సాధించారు. ఈ స్థానంలో బీజేపీ గెలవడం ఇదే తొలిసారి.
మైథిలి ఠాకూర్ విజయం కేవలం ఒక ఎన్నికల గెలుపు మాత్రమే కాదు. జానపద కళాకారిణిగా అపారమైన ప్రజాదరణ పొందిన ఒక యువతి రాజకీయాల్లోకి అడుగుపెట్టి, అతి చిన్న వయసులోనే శాసనసభ్యురాలిగా గెలిచి, బీహార్ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చడంలో భాగస్వామి అయ్యారు.






