BMC: మరాఠా రాజకీయాల్లో కమలం సరికొత్త చరిత్ర..!
మహారాష్ట్ర రాజకీయాల్లో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి ప్రభుత్వం ప్రభంజనం సృష్టించింది. ఆసియాలోనే అత్యంత సంపన్నమైన బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ)పై .. మహాయుతి సర్కార్ జెండా పాతింది. దాదాపు మూడు దశాబ్దాలుగా కొనసాగుతున్న థాక్రేల పట్టు సడలింది. దీంతో థాక్రేల వైభవం కొడిగడుతున్నట్లు అర్థమవుతోంది. ఈ విజయం అభివృద్ధికి మహారాష్ట్ర ప్రజలు పట్టం కట్టినట్లు అర్థవుతోందన్నారు సీఎం ఫడ్నవీస్.
మరాఠీ ఓట్లను ఏకీకృతం చేయాలనే లక్ష్యంతో జతకట్టిన ఉద్ధవ్ థాక్రే, రాజ్ థాకరేల కూటమి ఈ ఎన్నికల్లో ఘోరంగా విఫలమైంది. మొత్తం 227 వార్డులున్న బీఎంసీలో మెజారిటీకి 114 స్థానాలు అవసరం కాగా, మహాయుతి కూటమి 118 సీట్లు గెలుచుకుంది. ఇందులో బీజేపీ 89 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించగా, ఏక్నాథ్ షిండే వర్గం శివసేన 29 సీట్లు సాధించింది. మరోవైపు, ఉద్ధవ్ థాకరే శివసేన (యూబీటీ) 65 స్థానాలు గెలుచుకోగా, రాజ్ థాకరేకు చెందిన మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) కేవలం 6 స్థానాలకే పరిమితమైంది. వీరి కూటమి మొత్తం 71 సీట్లతో ఓటమి చవిచూసింది.
ఈ ఓటమికి రాజ్ థాకరే అనుసరించిన దూకుడు వైఖరి, వివాదాస్పద వ్యాఖ్యలే ప్రధాన కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. ‘ఇండియా టుడే’ కథనం ప్రకారం ప్రచారంలో భాగంగా ఆయన “ఉఠావో లుంగీ, బజావో పుంగీ” వంటి పాత నినాదాలను మళ్లీ తెరపైకి తేవడం మరాఠీయేతర ఓటర్లను దూరం చేసింది. మారుతున్న ముంబై జనాభా పరిస్థితుల్లో కేవలం మరాఠీ వాదంపై ఆధారపడటం వ్యూహాత్మక తప్పిదమని, ఇది ఉద్ధవ్ థాకరే సేనకు కూడా తీవ్ర నష్టం కలిగించిందని స్పష్టమవుతోంది. కాంగ్రెస్, ఎన్సీపీ విడిగా పోటీ చేయడం వల్ల ప్రతిపక్ష ఓట్లు చీలిపోవడం కూడా బీజేపీ కూటమికి కలిసివచ్చింది.






