Kondapalli Srinivas: జనసేన ఎమ్మెల్యేకి హామీ ఇచ్చిన టీడీపీ మంత్రి

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు రెండవ రోజు కూడా కొనసాగాయి. ఈ సమావేశాల్లో మంత్రులు.. ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. కోనసీమలో కొబ్బరి పరిశోధనా కేంద్రం, ప్రాసెసింగ్ యూనిట్ గురించి జనసేన రాజోలు ఎమ్మెల్యే వర ప్రసాద్ అడిగిన ప్రశ్నకు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సమాధానం ఇచ్చారు. రాజోలు నియోజకవర్గంలో కొబ్బరి సాగు స్థితి కొబ్బరి సాగు విస్తీర్ణం: 25,000 ఎకరాలు ఉందని, వార్షిక ఉత్పత్తి, 30-40 కోట్ల కొబ్బరికాయలు అవుతున్నాయని మంత్రి వివరించారు.
ప్రస్తుతం రైతులు కొబ్బరికాయల తొక్కలు తీసి, ఎండు కొబ్బరికాయలును తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల మార్కెట్లకు పంపుతున్నారన్న ఆయన అక్కడే ప్రాసెసింగ్ చేసి విలువ ఆధారిత ఉత్పత్తులు తయారు చేస్తున్నారని తెలిపారు. దీనికి కారణం డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లాలో సమగ్ర కొబ్బరి ప్రాసెసింగ్ పరిశ్రమలు లేకపోవడమేనని.. అందుకోసం చర్యలు చేపట్టామన్నారు. జిల్లా యంత్రాంగం 3 పరిశ్రమల క్లస్టర్లు ప్రతిపాదించిందని, వీటిలో కొబ్బరి సంపూర్ణంగా భాగాలను వినియోగిస్తూ విలువ ఆధారిత ఉత్పత్తులు తయారు చేయడానికి ప్రతిపాదించడం జరిగిందని పేర్కొన్నారు.
కొబ్బరి డొక్కు (Husk) నుంచి కాయిర్ ఉత్పత్తులు, కాయిర్ పిత్ బ్లాకులు, జియో టెక్స్టైల్స్, కాయిర్ హస్తకళలు, కోకో లాన్, సోడియం లిగనో సల్ఫోనేట్ చేసేందుకు పరిశ్రమ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. కొబ్బరి టెంకె నుంచి (shell): హస్తకళలు, బొగ్గు, యాక్టివేటెడ్ కార్సన్ తయారు చేసే విధంగా పరిశ్రమను తీసుకోస్తామన్నారు. కొబ్బరి నీరు (Coconut Water) నుంచి ప్యాకేజ్ వాటర్, నాటా-డే-కోకో, కొబ్బరి నీటి పొడి తయారు చేస్తామని హామీ ఇచ్చారు. ఎండు కొబ్బరి కాయ (Kernel) నుంచి వర్జిన్ ఆయిల్, లారిక్ యాసిడ్, ఎమ్.సి.టి. పొడి, చిప్స్, కొబ్బరి పాలు & పాల పొడి, డిసికేటెడ్ పొడి వంటి ఉత్పత్తులను తయారు చేసే పరిశ్రమలను ఏర్పాటు చేస్తామన్నారు.
ప్రస్తుతం, నియోజకవర్గంలో 4 కొబ్బరి పీచు తయారీ యూనిట్లు, 18 కొబ్బరి చాప తాయారీ యూనిట్లు, 30 తాళ్ల తయారీ యూనిట్లు మరియు 120 కొబ్బరి తయారీ యూనిట్లు వంటి అనేక చిన్న మరియు మధ్య తరహా కొబ్బరి ఆధారిత పరిశ్రమలు ఉన్నాయని, పెద్ద ఎత్తున ప్రాసెసింగ్ సౌకర్యాలు లేకపోవడం వల్ల, ఎక్కువ శాతం కొబ్బరి కాయలను స్థానికంగా పీచు తీసి తమిళనాడు, కేరళ మరియు కర్ణాటక వంటి పొరుగు రాష్ట్రాలకు తదుపరి ప్రాసెసింగ్ కోసం పంపుతున్నారని వివరించారు. మంత్రి ప్రసంగం చివర్లో జోక్యం చేసుకున్న రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి.. కడియం మండలంలో కొబ్బరి పరిశ్రమ ఏర్పాటుకు, కొబ్బరి పరిశోధనా కేంద్రానికి 10 ఎకరాల భూమి ఇవ్వడానికి సిద్దంగా ఉన్నామని పేర్కొనగా దానికి మంత్రి సానుకూలంగా స్పందించారు.