Russia: భారత్, చైనాపై అమెరికా ఆంక్షలు విఫలం.. ట్రంప్ కు ఇప్పుడిప్పుడే అర్థమవుతోందన్న రష్యా..!

ఆంక్షలు, టారిఫ్ లతో భారత్, చైనాలను తమ దారికి తేవాలనుకున్న అగ్రరాజ్యానికి ఇప్పుడిప్పుడే వాస్తవం అర్థమవుతోందని సంచలన కామెంట్ చేసింది రష్యా. అధ్యక్షుడు ట్రంప్ కు ఇప్పుడిప్పుడే వాస్తవం బోధపడుతోందన్నారు రష్యన్ విదేశాంగమంత్రి లావ్రోవ్. భారత్, చైనా విషయంలో అమెరికా సుంకాల బెదిరింపులు (US Tariffs Threats) విఫలమవుతున్నాయని రష్యా విదేశాంగశాఖ మంత్రి సెర్గెయ్ లావ్రోవ్ వ్యాఖ్యానించారు. ప్రాచీన నాగరికత కలిగిన ఆ రెండు దేశాలతో అటువంటి ధోరణిలో వ్యవహరించడం వ్యర్థమని అమెరికాకూ బోధపడుతోందన్నారు.
‘‘భారత్, చైనా (China)లు ప్రాచీన నాగరికత కలిగిన దేశాలు. ‘నాకు నచ్చనిది చేయకండి. లేకపోతే.. సుంకాలు విధిస్తాను’ అనే ధోరణిలో మాట్లాడటం ఆ దేశాల విషయంలో పనిచేయదు. అమెరికా (USA)కూ ఈ విషయం అర్థమవుతోంది. సుంకాల వంటి చర్యలు ఆ దేశాలను మార్కెట్, ఇంధనం వంటి రంగాల్లో ప్రత్యామ్నాయాల వైపు మళ్లిస్తాయి’’ అని ఓ ఇంటర్వ్యూలో లావ్రోవ్ వెల్లడించారు.
రష్యా (Russia)పై కొత్త ఆంక్షల విషయంలో ఎటువంటి సమస్య కనిపించడం లేదన్నారు రష్యా విదేశాంగమంత్రి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మొదటి హయాంలో ఎన్నడూ లేని విధంగా పెద్దఎత్తున ఆంక్షలు విధించినట్లు గుర్తుచేశారు. బైడెన్ పదవీకాలంలో.. ఆయా వ్యవహారాల్లో దౌత్య ప్రయత్నాలకు బదులుగా ఆంక్షలు ప్రయోగించారని, రాజీ కోసం ఎటువంటి ప్రయత్నాలు చేయలేదని పేర్కొన్నారు.