YS Jagan: అసెంబ్లీకి వెళ్లండి జగన్ గారూ..!!

అసెంబ్లీకి (AP Assembly) వెళ్లే విషయంలో జగన్ (YS Jagan) తన పట్టు వీడటం లేదు. ప్రతిపక్ష హోదా (Opposition Status) ఇస్తేనే అసెంబ్లీకి వెళ్తానని, అప్పుడే తనకు ఎక్కువసేపు మాట్లాడే అవకాశం దక్కుతుందని జగన్ వాదిస్తున్నారు. అయితే జగన్ వాదనపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పైగా ఒకప్పుడు శాసన మండలిని రద్దు చేయాలంటూ తీర్మానం చేసిన జగన్, ఇప్పుడు అదే మండలిలో పార్టీ వాయిస్ ను గట్టిగా వినిపించాలని ఎమ్మెల్సీలకు సూచించడం కూడా విమర్శలకు తావిస్తోంది. 40శాతం మంది వైసీపీకి (YCP) ఓటేశారని, వాళ్లకు ప్రాతినిధ్యం వహించేలా చట్టసభల్లో గళం వినిపించాల్సిన బాధ్యత వైసీపీపై ఉందని గుర్తు చేస్తున్నారు.
గత ఎన్నికల్లో వైసీపీకి 11 స్థానాలు మాత్రమే దక్కాయి. దీంతో ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా దక్కలేదు. కనీసం 18 సీట్లు వస్తేనే ప్రతిపక్షహోదా ఇచ్చేందుకు వీలవుతుందని స్పీకర్ చెప్తున్నారు. అయితే అలాంటి రూల్ ఏమీ లేదని వాదిస్తోంది వైసీపీ. ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీకి చెందిన ఐదాగురుగురు ఎమ్మెల్యేలను లాగేస్తే చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోతుందని జగన్ హెచ్చరించారు. ఇప్పుడు టీడీపీ వాళ్లు అదే గుర్తు చేస్తున్నారు. నాడు 18 సీట్లకంటే తక్కువ ఉంటే ప్రతిపక్ష హోదా లేకుండా పోతుందని చెప్పిన జగన్, ఇప్పుడు 11 సీట్లకు ఆ హోదా ఎలా ఆశిస్తారని ప్రశ్నిస్తున్నారు. హోదా లేకపోయినా ఎమ్మెల్యేగా ఆయనకు తగిన గౌరవం ఇస్తామని, అసెంబ్లీకి రావాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు కూడా వైఎస్ జగన్ అసెంబ్లీకి రావాలని ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు. ప్రజాసమస్యలపై మాట్లాడేందుకు తగిన సమయం ఇస్తామని చెప్పారు. ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన వారంతా సభకు రావాలని, వాళ్ల సమస్యలను ప్రస్తావించాలని సూచించారు. అయితే జగన్ మాత్రం వీటిని పట్టించుకోవట్లేదు. తనకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే సభకు వస్తానని, అప్పుడే తనకు మాట్లాడేందుకు తగిన సమయం దక్కుతుందని స్పష్టం చేస్తున్నారు. అసెంబ్లీకి వెళ్లే పరిస్థితి లేదు కాబట్టి శాసన మండలిలో పార్టీ వాయిస్ గట్టిగా వినిపించాలని జగన్ ఎమ్మెల్సీలకు సూచించారు.
అయితే దీనిపైన కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జగన్ అధికారంలోకి రాగానే మండలిని (Legislative Council) రద్దు చేసేందుకు ప్రయత్నించారు. మండలిలో టీడీపీకి మెజారిటీ ఉండడంతో, అక్కడ జగన్ ప్రభుత్వానికి ఇబ్బందులు ఎదురయ్యాయి. దీంతో మండలి రద్దు చేసేందుకు తీర్మానం కూడా చేశారు. అయితే సాంకేతిక కారణాల రీత్యా అది సాకారం కాలేదు. దీంతో మండలి రద్దు కాకుండా ఉండిపోయింది. కానీ ఇప్పుడు అదే మండలి ఇప్పుడు జగన్ కు పెద్ద దిక్కుగా మారింది. మండలిలో ఇప్పటికీ వైసీపీదే ఆధిపత్యం. ఆ పార్టీ సభ్యులు ఐదుగురు పదవులకు రాజీనామా చేసినా మండలి ఛైర్మన్ వాటిని ఆమోదించకుండా వైసీపీకి మేలు చేస్తున్నారు. అక్కడ బొత్స సత్యనారాయణకు ప్రతిపక్ష హోదా దక్కింది. దీంతో అక్కడ వైసీపీ సత్తా చాటగలుగుతోంది. ఒకప్పుడు కాదనుకున్న మండలే ఇప్పుడు జగన్ కు ప్లస్ అయింది.
అయితే పార్టీ తరపున ఒకరు గెలిచినా, పది మంది గెలిచినా అసెంబ్లీకి వెళ్తేనే బాగుంటుందనే సూచన బలంగా వినిపిస్తోంది. ఒకవేళ జగన్ కు వెళ్లడం ఇష్టం లేకపోతే మిగిలిన ఎమ్మెల్యేలను సభకు పంపించాలని సూచిస్తున్నరు. ఇలాగే సభను బాయ్‌కాట్ చేసుకుంటూ వెళ్తే ఏదో ఒకరోజు అనర్హత వేటు పడుతుందని, అప్పుడు మొదటికే మోసం వస్తుందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. అసెంబ్లీకి వెళ్లే విషయంలో జగన్ ఇప్పటికైనా సానుకూల నిర్ణయం తీసుకుంటే మంచిదని సలహా ఇస్తున్నారు.