Bandla Ganesh: ఎంత పని చేస్తివి బండ్లన్నా..?

లిటిల్ హార్ట్స్ (Little Hearts) సినిమా సక్సెస్ మీట్‌లో నిర్మాత, నటుడు బండ్ల గణేశ్ (Bandla Ganesh), తెలుగు సినిమా ఇండస్ట్రీలోని కొన్ని చీకటి కోణాలను బయట పెట్టారు. ఆ సినిమా హీరో మౌళికి (Mouli) హితవు చెబుతూ, ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారాయి. కేవలం సలహా ఇస్తున్నానని చెప్తూనే బండ్ల గణేశ్ ఇండస్ట్రీలోని మాఫియా గురించి బయట పెట్టేశారు. “సక్సెస్ వచ్చినప్పుడు అందరూ నీ చుట్టూ తిరిగి జైకొడతారు. కానీ, ఆ తర్వాత నిన్ను ఎవరూ పట్టించుకోరు. ఊహల్లో విహరించకు, మంచి నటుడిగా నీ స్థానం సుస్థిరం చేసుకో. ఈ ఇండస్ట్రీ పెద్ద మాఫియా, ఎవరినీ నమ్మొద్దు!” అని బండ్ల గణేశ్ హెచ్చరించారు. ఈ మాటలు సోషల్ మీడియాలో ఒక్కసారిగా వైరల్‌గా మారి, సినీ పరిశ్రమలో చర్చనీయాంశంగా నిలిచాయి.
బండ్ల గణేశ్ తన మాటలను హీరో మౌళికి సలహాగా మాత్రమే పరిమితం చేయలేదు. ఇదే వేదికపై ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌పై (Allu Aravind) సెటైర్లు వేసి అందరినీ షాక్‌కు గురిచేశారు. “అల్లు అరవింద్ చివర్లో వచ్చి కేవలం పేరు మాత్రం వేసుకుంటాడు. ఆయన చేసేది ఏమీ ఉండదు!” అని బండ్ల గణేశ్ విసిరిన కామెంట్ వేదికపై ఉన్నవారిని అవాక్కయ్యేలా చేసింది. ఈ వ్యాఖ్యలు అక్కడున్న వారిని కంగుతినిపించాయి. బన్నీవాసు వెంటనే జోక్యం చేసుకుని, అల్లు అరవింద్‌కు నమస్కారం పెట్టి, బండ్ల మాటలను తప్పుగా అర్థం చేసుకోవద్దని కోరారు. అయినప్పటికీ, ఈ సంఘటన సినీ ఇండస్ట్రీలో బండ్ల గణేశ్ ముఖసూటితనానికి మరో నిదర్శనంగా నిలిచింది.
బండ్ల గణేశ్ ఈ సందర్భంగా సినిమా ఇండస్ట్రీని “పెద్ద మాఫియా”గా పేర్కొనడం ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది. ఆయన చెప్పింది నిజమే కదా అనే టాక్ వినిపిస్తోంది. ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో చర్చనీయాంశంగా ఉన్న నెపోటిజం, అవకాశాల అసమానతలు, కొందరు పెద్దల ఆధిపత్యం వంటి అంశాలనే ఇప్పుడు బండ్ల గణేశ్ చెప్పారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. సోషల్ మీడియాలో బండ్ల వ్యాఖ్యలపై ప్రశంసల వర్షం కురుస్తోంది. “ఇండస్ట్రీలో నిజాలు బహిర్గతం చేయడానికి ధైర్యం కావాలి. బండ్ల గణేశ్ మాట్లాడినవన్నీ నిజం!” అని ఒక నెటిజన్ పేర్కొనారు. “సినిమా రంగంలో నెపోటిజం, మాఫియా గురించి అందరికీ తెలుసు, కానీ బహిరంగంగా చెప్పడం బండ్ల స్పెషాలిటీ” అని మరొకరు కామెంట్ చేశారు.
సినిమా ఇండస్ట్రీలో కొందరు కథానాయకులు, టాలెంటెడ్ కళాకారులు అనూహ్యంగా తెరమరుగైన సందర్భాలు గతంలో ఎన్నో ఉన్నాయి. కింది స్థాయి నుంచి ఎదిగిన హీరోలు, కొన్ని హిట్ సినిమాల తర్వాత ఆశ్చర్యకరంగా అవకాశాలు కోల్పోయి, ఇండస్ట్రీ నుంచి దూరమైన ఉదాహరణలు అనేకం. ఈ విషయాన్ని బండ్ల గణేశ్ తన వ్యాఖ్యల ద్వారా పరోక్షంగా సూచించారని అభిమానులు భావిస్తున్నారు. “ఇండస్ట్రీలో కొంతమంది పెద్దలు కొత్త వాళ్లను పైకి రాకుండా అడ్డుకుంటారు. బండ్ల గణేశ్ ఈ నిజాన్ని బయటపెట్టారు” అని సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి.
బండ్ల గణేశ్‌కు ముక్కుసూటిగా మాట్లాడే పేరు ఎప్పటి నుంచో ఉంది. ఆయన ఎక్కడ మాట్లాడినా, ఏదో ఒక సంచలనం సృష్టించడం ఆయన స్టైల్‌గా మారింది. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు కేవలం ఒక సినిమా ఈవెంట్‌లో జరిగిన సంఘటనగా మిగిలిపోకుండా, ఇండస్ట్రీలోని పెద్ద సమస్యలపై చర్చకు దారితీసాయి. ఆయన మాటలు కొంతమంది పెద్దలను ఇబ్బందిపెట్టినా, సామాన్య ప్రేక్షకులు, నెటిజన్లు మాత్రం బండ్ల ధైర్యాన్ని, నిజాయితీని మెచ్చుకుంటున్నారు.