కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోకు ఎదురుదెబ్బ…
మరో ఏడాదిలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న తరుణంలో ప్రధాని జస్టిన్ ట్రూడోకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.ఆ పార్టీకి గత మూడు దశాబ్దాలుగా కంచుకోటగా నిలిచిన ‘టొరంటో-సెయింట్ పాల్స్’ పార్లమెంటు స్థానంలో ఓటమి ఎదురైంది. ఆ స్థానానికి ఇటీవల జరిగిన ఉప ఎన్నికలో విపక్ష కన్జర్వేటివ్ పార్టీ అభ్యర్థి డాన్ స్టీవార్ట్ గెలుపొందారు. అధికార లిబరల్ పార్టీ 1993 తర్వాత మొట్టమొదటి సారిగా ఈ స్థానంలో ఓటమి చవిచూసింది. లిబరల్ పార్టీ అభ్యర్థి లెస్లీ చర్చి ఓడిపోయారు. న్యూ డెమోక్రటిక్ పార్టీ తరఫున పోటీ చేసిన భారతీయ సంతతికి చెందిన అమృత్ పర్హార్ మూడో స్థానంలో నిలిచారు.
మరోవైపు…ప్రజలు ఇచ్చిన ఈ తీర్పు అధికార పార్టీకి షాక్ ట్రీట్మెంట్ వంటిదేనని కెనడా మీడియా సంస్థలు వ్యాఖ్యానించాయి. ఉప ఎన్నికలో అధికార పార్టీ అభ్యర్థి ఓడిపోవడంతో తక్షణమే పార్లమెంటుకు మధ్యంతర ఎన్నికలు నిర్వహించాలని విపక్ష కన్జర్వేటివ్ పార్టీ అధినేత పియర్ పొయిలీవ్రా డిమాండ్ చేశారు. జస్టిన్ ట్రూడో నేతృత్వంలోని లిబరల్ పార్టీ పనితీరుపై ప్రజలు విసిగిపోయినట్లు ఈ ఫలితం చూపిస్తోంది. ముఖ్యంగా ట్రూడో తీసుకుంటున్న అంసబద్ద నిర్ణయాలపై ప్రజల నుంచి నిరసన వ్యక్తమవుతోందని కెనడా మీడియా సంస్థలు చెబుతున్నాయి. ఖలిస్తాన్ ఓటు బ్యాంకు కోసం.. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యదేశమైన భారత్ తో గొడవపెట్టుకోవడం.. కెనడియన్లకు ఇష్టం లేదని కూడా కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.
ఓ వ్యక్తి కోసం విదేశాంగ విధానం మార్చుకోవడమేంటన్న ప్రశ్నలు కూడా ట్రూడోను ఇబ్బంది పెడుతున్నాయి. మరోవైపు కెనడా ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉండడం కూడా ఓ కారణంగా చెబుతున్నారు. దీనికి తోడు ఇటీవలే నిజ్జర్ కు కెనడా పార్లమెంటు నివాళి తెలపడం, అంతకు ముందు నాజీ సైనిక యూనిట్ తరపున సేవలందించిన వ్యక్తిని ప్రశంసించడం లాంటి పరిణామాలు.. ఆదేశంలోని రాజకీయ నిపుణులను సైతం షాక్ కు గురిచేశాయి. దీనికి తోడు కెనడాలో పెరిగిపోతున్న నేరమయ రాజకీయాలు. మరీ ముఖ్యంగా పెరిగిపోతున్న గ్యాంగుల సంస్కృతి అక్కడి ప్రజల్ని అసంతృప్తికి గురి చేస్తోంది. ముఖ్యంగా భారత సంతతి ప్రజలు తీవ్ర అభద్రత మధ్య జీవితం గడుపుతున్నారు. ఎవరో ఓ వ్యక్తి గురించి ఇంత చర్చ అవసరమా అన్నది కెనడా ప్రజల్లో చర్చకు దారితీస్తోంది.






