ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు.. నిక్ నేమ్ కమాండో బీబీ నెతన్యాహు..
ఈ పేరు నచ్చినవారికి దేశభక్తుడు. అత్యంత ధైర్య, సాహసాలతో ఉగ్రమూకలను అణచివేసి, దేశానికి రక్షణ, భద్రత కల్పించిన ధీరుడు.ముఖ్యంగా పొరుగున ఉన్న ముస్లిందేశాలు… టెల్ అవీవ్ గురించి తలచుకోవాలంటే భయపడేలా చేసిన ధీశాలి . ఇక శత్రువులు, ప్రత్యర్థులకు .. నిరంకుశుడు. దేశాన్ని మరింతప్రమాదంలోకి నెట్టేస్తున్న దురభిమాని. శత్రువుల సంఖ్యను పెంచుకుంటూ.. ప్రపంచవ్యాప్తంగా యూదులకు రక్షణ లేకుండా చేస్తున్న ఓ రాజకీయ మాంత్రికుడు.
74 ఏళ్ల నెతన్యాహు ఇజ్రాయెల్‌లో అత్యంత సుదీర్ఘకాలం అధికారంలో ఉన్న నేత. పరాజయాల తర్వాత బౌన్స్ బ్యాక్ అయిన రాజకీయ కెరటం.అభిమానులు, మద్దతుదారులు ఆయనను కింగ్ బీబీగా పిలుచుకుంటారు. నెతన్యాహు టెల్-అవీవ్‌లో జన్మించారు. ఆ తర్వాత ఆయన చాలా ఏళ్లపాటు అమెరికాలో గడిపారు. యువకుడిగా అక్కడే తన చదువు పూర్తి చేశారు. ఒక కమాండో యూనిట్లో సేవలు కూడా అందించారు. ఆయన సోదరుడు జొనాథన్‌ను నేషనల్ హీరోగా భావిస్తారు.
1976లో యుగాండాలోని ఎంతెబేలో హైజాక్ అయిన ఒక విమానం నుంచి ఇజ్రాయెల్ బందీల రెస్క్యూ ఆపరేషన్ సమయంలో ఆయన చనిపోయారు. దీంతో ఒక్కసారిగా నెతన్యాహు కుటుంబం …. హీరోయిజం, ధైర్యసాహసాలకు ప్రతిరూపంగా మారిపోయింది. అది తర్వాతి కాలంలో బీబీకి కలసివచ్చింది. నెతన్యాహు ఇంగ్లిష్ ధారాళంగా మాట్లాడగలరు. ఆయన ఉచ్ఛారణలో అమెరికన్ ఇంగ్లిష్ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. ఆ ప్రత్యేకతతోనే ఇజ్రాయెల్-అమెరికా అంశాలను ఆయన మెరుగ్గా అమెరికా టీవీ చానళ్లలో చూపించగలుగుతున్నారు.1984లో ఐక్యరాజ్యసమితిలో ఇజ్రాయెల్ రాయబారిగా నెతన్యాహు పని చేశారు. అంతకు ముందు వాషింగ్టన్లో ఇజ్రాయెల్ రాయబార కార్యాలయంలో మిషన్ డిప్యూటీ చీఫ్‌గా బాధ్యతలు నిర్వహించారు.
1988లో రైట్ వింగ్ లికుడ్ పార్టీ సభ్యుడుగా ఇజ్రాయెల్ పార్లమెంట్‌లోకి అడుగుపెట్టారు. లికుడ్ పార్టీ అధ్యక్షుడు కావడానికి ముందు డిప్యూటీ విదేశాంగ మంత్రిగా ఉన్నారు. 1993లో పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్‌తో ఓస్లో ఒప్పందం జరిగినప్పుడు ఆయన విపక్షానికి నేతృత్వం వహించారు. నెతన్యాహు ఈ ఒప్పందాన్ని తీవ్రంగా విమర్శించారు. ఆ తర్వాత ఆయనపై కూడా ఆరోపణలు వచ్చాయి. ఇజ్రాయెల్‌లో ఆయన హింసను రెచ్చగొట్టారని ఆయన ప్రత్యర్థులు విమర్శించారు.ఆ ఒప్పందాన్ని వ్యతిరేకించిన ఒక యూదు తీవ్రవాది 1995లో ప్రధాన మంత్రి ఇత్జాక్ రాబిన్‌ను హత్య చేశాడు. రాబిన్ హత్య తర్వాత 1996లో జరిగిన ఎన్నికల్లో నెతన్యాహు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి అయ్యారు. ఓస్లో ఒప్పందంలోని కొన్ని పాయింట్ల గురించి మళ్లీ చర్చించిన నెతన్యాహు ఒక ఒప్పందం చేసుకున్నారు. దాని ప్రకారం వెస్ట్ నగరం హబ్రోన్లో 80 శాతం భాగాన్ని పాలస్తీనా పాలకులకు అప్పగించారు. దానితోపాటూ ఆ ప్రాంతం నుంచి వెనక్కు వెళ్లడానికి అంగీకరించారు. దీనిపై చాలా విమర్శలు వచ్చాయి.
1999లో జరిగిన ఎన్నికలో నెతన్యాహు ఓడిపోయారు. ఆయనను ఓడించిన లేబర్ పార్టీ నేత ఎహూద్ బరాక్ ఐఈడీఎఫ్లో మాజీ కమాండర్‌గా పని చేశారు. ఈ ఓటమి తర్వాత నెతన్యాహు లికుడ్ పార్టీ నేతగా రాజీనామా చేశారు. 2001లో ప్రధానిగా ఎన్నికైన ఎరియల్ షరాన్‌కు వారసుడిగా నిలిచారు.షరాన్ ప్రభుత్వ హయాంలో నెతన్యాహు విదేశాంగ మంత్రిగా ఉన్నారు. ఆర్థికమంత్రిగా కూడా పనిచేశారు. కానీ తర్వాత గాజా స్ట్రిప్ నుంచి సైనికులు, అక్కడ ఉంటున్న ఇజ్రాయెలీలను తిరిగి రప్పించడాన్ని వ్యతిరేకించిన ఆయన తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత ఆయన మళ్లీ లికుడ్ పార్టీ వైపు వెళ్లారు. పార్టీని చేతుల్లోకి తీసుకున్నారు. 2009లో రెండోసారి ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు.
2009లో ఆయన పాలస్తీనియన్లతో శాంతి చర్చలను ముందుకు తీసుకెళ్లడానికి వెస్ట్ బ్యాంక్‌లో ఇజ్రాయెల్ స్థావరాల నిర్మాణంపై పది నెలల తాత్కాలిక నిషేధం విధించడానికి కూడా అంగీకరించారు.ఇజ్రాయెల్తోపాటూ పాలస్తీనా దేశానికి షరతులతో కూడిన అంగీకారాన్ని బహిరంగంగా తెలియజేశారు. అయితే 2010లో అవన్నీ విఫలమయ్యాయి. ఆ తర్వాత 2015లో సరిగ్గా ఎన్నికలకు ముందు పాలస్తీనా దేశానికి కట్టుబడి ఉంటాననే తన మాటను పక్కన పెట్టిన ఆయన, తను ప్రధానిగా ఎన్నికైతే పాలస్తీనా దేశ ఆవిర్భావం ఉండదని ప్రకటించారు. పాలస్తీనా అంశంపై అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో నెతన్యాహుకు సంబంధాలు బెడిసికొట్టాయి. వారి మధ్య ఇరాన్ గురించి కూడా అభిప్రాయబేధాలు ఉండేవి.2015లో ఆయన కాంగ్రెస్‌ను ఉద్దేశించి ప్రసంగించినపుడు ఇరాన్‌తో అమెరికా అణు ఒప్పందాన్ని విమర్శించారు. దానిని చాలా చెత్త డీల్‌గా వర్ణించారు. ఇది ఇరాన్ అణ్వాయుధాలు పొందడానికి వీలు కల్పిస్తుందని అన్నారు.
కానీ ఆ తర్వాత అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్‌తో ఆయన సంబంధాలు మెరుగ్గా నిలిచాయి. డోనల్డ్ ట్రంప్ విధానాల వల్ల నెతన్యాహు, ఆయన మధ్య సాన్నిహిత్యం పెరిగింది. ఆ సమయంలో ఆయనకు రాజకీయ, దౌత్య ప్రయోజనాలు కూడా లభించాయి.వారి విధానాలు, సాన్నిహిత్యం వల్ల జెరూసలెంను ఇజ్రాయెల్ రాజధానిగా, ఆక్రమిత గోలన్ హైట్స్ మీద ఇజ్రాయెల్ సౌర్వభౌమాధికారానికి గుర్తింపు లభించింది. దానితోపాటూ ఎన్నో రాజకీయ ప్రయోజనాలు లభించాయి.ఈ సాన్నిహిత్యం వల్లే 2020లో ఇజ్రాయెల్, పాలస్తీనియన్ల మధ్య శాంతి కోసం ట్రంప్ చేసిన ప్రతిపాదనను నెతన్యాహు స్వాగతించారు. ఇరాన్‌తో చేసుకున్న అణు ఒప్పందం నుంచి తప్పుకోవాలని, ఇరాన్ మీద ఆర్థిక ఆంక్షలు విధించాలనే ట్రంప్ ప్రభుత్వం నిర్ణయాలపై నెతన్యాహు ప్రశంసలు కురిపించారు.
నెతన్యాహుపై సుదీర్ఘకాలంగా అవినీతి ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. ఒక సుదీర్ఘ దర్యాప్తు ప్రక్రియ తర్వాత 2019 నవంబర్‌లో ఆయనపై లంచం తీసుకోవడం, మోసం, రిగ్గింగ్‌కు సంబంధించి మూడు వేరు వేరు కేసుల్లో అభియోగాలు మోపారు.ఖరీదైన బహుమతులు తీసుకున్నారని, తనకు అనుకూలంగా కవరేజీ ఇచ్చిన మీడియాకు ఫేవర్ చేశారనే ఆరోపణలు కూడా ఉన్నాయి.అయితే నెతన్యాహు తనపై వచ్చిన ప్రతి ఆరోపణనూ తోసిపుచ్చూతూ వచ్చారు. తనపై మోపిన అభియోగాలు రాజకీయ ప్రేరేపితమని అన్నారు. తనను గద్దె దించాలనే ప్రత్యర్థులు అలాంటి ఆరోపణలు చేస్తున్నారన్నారు. 2020 మేలో ఆయనకు వ్యతిరేకంగా వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు మొదలైంది. అధికారంలో ఉన్నప్పుడే అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న మొట్టమొదటి ఇజ్రాయెల్ ప్రధానమంత్రిగా ఆయన నిలిచారు.






