Israel: గాజా పూర్తిస్థాయి ఆక్రమణ దిశగా ఇజ్రాయెల్.. హమాస్ ఇక చరిత్రేనా..?

ఇజ్రాయెల్ పై నరమేధం సాగించిన హమాస్ పై కొన్నేళ్లుగా టెల్ అవీవ్ అరివీర భయంకరంగా సమరం సాగిస్తోంది. హమాస్(Hamas) నేతలను వెతికి వెంటాడి వేటాడి హతమారుస్తోంది. ఈక్రమంలో గాజాలో వారి సొరంగాలు ఉండడంతో ఇళ్లను కూల్చి వేసి మరీ వారిని వేటాడుతోంది. వారికి అండగా నిలిచే వారిని తుదముట్టిస్తోంది. ఈ క్రమంలో గాజా (Gaza) పై బాంబుల వర్షం కురిపిస్తోంది. ఫలితంగా ఇప్పటికే వేలాది మంది ప్రాణాలు కోల్పోగా.. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. అయినా ఇప్పటికీ హమాస్ నీడలు కనిపిస్తున్నాయి.
దీంతో హమాస్ ను కాలగర్భంలో కలిపేందుకు ఇజ్రాయెల్ మాస్టర్ ప్లాన్ రూపొందించింది. ఇప్పటివరకూ సరిహద్దు ప్రాంతాలను మాత్రమే ఆక్రమించిన ఐడీఎఫ్…. ఇక గాజా పట్టీ మొత్తాన్ని ఆక్రమించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు ఇజ్రాయెల్ భద్రతా క్యాబినెట్ కొత్త ప్రణాళికకు ఆమోదం తెలిపింది.ఇజ్రాయెల్ సైన్యాధ్యక్షుడు లెఫ్టినెంట్ జనరల్ ఎయెల్ జమీర్ చేసిన ప్రతిపాదనకు సోమవారం ఉదయం సమావేశంలో పాల్గొన్న మంత్రులంతా అంగీకారం తెలిపారు.
గాజాలో సైనిక కార్యకలాపాలను ఇక భారీస్థాయిలో టెల్ అవీవ్ విస్తరించనుంది. ఇందుకోసం 30 వేల మంది రిజర్వు సైన్యాన్ని రంగంలోకి దింపనుంది. హమాస్‌పై పూర్తిస్థాయి విజయం సాధించడం.. బందీలను విడిపించడమే ఈ కొత్త ప్రణాళిక లక్ష్యమని ఇజ్రాయెల్ అధికార వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ నెలలో ట్రంప్ జరపనున్న పశ్చిమాసియా పర్యటన ముగిసేవరకు ఈ ప్రణాళిక అమల్లోకి రాదని తెలుస్తోంది. గాజాను ఆక్రమించడమే కాదు, మానవతా సాయంపైనా పట్టు సాధించాలని ఇజ్రాయెల్ నిశ్చయించింది. ఐక్యరాజ్యసమితి, ఇతర స్వచ్ఛంద సంస్థల ఆధీనంలో ఉన్న సేవలను తమ చేతుల్లోకి తీసుకోవాలన్న లక్ష్యంగా పావులు కదుపుతోంది. అయితే ఇది ప్రాథమిక మానవతా సూత్రాలకు విరుద్ధమని ఐరాస సంస్థలు ఆందోళన చెందుతున్నాయి.