ఇజ్రాయెల్ పై హమాస్ దాడికి ఏడాది పూర్తి.. భీకర రణానికి పునాది..
ఇజ్రాయెల్ ఊహించని ఘటన.. హాలీవుడ్ సినిమా తరహాలో ఇజ్రాయెల్ రక్షణకంచెలు దాటి వచ్చి… వందలమందిని చంపి.. మరికొంతమంది ఇజ్రాయెలీలను హమాస్ బంధీలుగా పట్టుకున్న క్షణమది. ఈ వ్యవహారంలో హమాస్ వ్యవహారశైలిని ప్రపంచదేశాలు తప్పుపట్టాయి. ఇదే క్షణంలో ఇజ్రాయెల్ ప్రధాని ఆగ్రహంతో మండిపోయిన క్షణాలవి. అంతే ఆయన భీకర ప్రతిజ్ఞ చేశారు. అన్నట్లుగానే హమాస్ పై భీకర దాడులకు దిగారు. ఇప్పటికి దాడులు జరిగి ఏడాది పూర్తయింది. మరి ఈ ఏడాదిలో ఇజ్రాయెల్ ఏం సాధించింది…?
ఇజ్రాయెల్ పై హమాస్ దాడి చేసి ఏడాది పూర్తయిన సందర్భంగా ఐడీఎఫ్ కీలక డేటాను వెల్లడించింది. గాజా పట్టీలో 17,000 మంది హమాస్ ఆపరేటివ్‌లను, ఇజ్రాయెల్‌లో 1,000 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు ప్రకటించింది. ఆ గ్రూప్‌ను పూర్తిగా ధ్వంసం చేసినట్లు తెలిపింది. వీరిలో 30 మంది హమాస్ బెటాలియన్, 165 మంది కంపెనీ కమాండర్లను మట్టుబెట్టినట్లు తెలిపింది.
ఏడాదిలో ఇజ్రాయెల్ దాడుల రిజల్ట్స్..
గాజాపట్టీలో 40,300 లక్ష్యాలపై దాడులు చేశామని.. మొత్తం 4,700 సొరంగ ప్రవేశమార్గాలను ధ్వంసం చేసినట్లు ఇజ్రాయెల్ తెలిపింది. అక్టోబర్ 8 నుంచి లెబనాన్‌లోని హెజ్బొల్లా కూడా తమపై దాడులు మొదలుపెట్టిందని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది.. దీంతో తాము ఎదురుదాడుల్లో ఆ సంస్థకు చెందిన మొత్తం 800 మందిని మట్టుబెట్టగా వీరిలో 90 మంది టాప్ కమాండర్లు ఉన్నట్లు పేర్కొంది. అదే సమయంలో 11,000 హెజ్బొల్లా స్థావరాలను పేల్చేశామంది.
ఏడాది వ్యవధిలో ఇజ్రాయెల్ పై 26,000 రాకెట్ దాడులు జరిగాయని.. వీటిల్లో గాజా నుంచి 13,200, లెబనాన్ నుంచి 12,400 దూసుకురాగా.. మిగిలినవి యెమన్, సిరియా, ఇరాన్‌ల నుంచి ప్రయోగించారంది. వీటిల్లో వందల సంఖ్యలో రాకెట్లు ఆయా ప్రాంతాల్లోనే కూలిపోయినట్లు వెల్లడించింది. ఇక మొత్తం 728 మంది తమ సైనికులు, రిజర్విస్టులు ప్రాణాలు కోల్పోయినట్లు చెప్పింది. ఇజ్రాయెల్‌లోని మూడో అతిపెద్ద నగరం, పోర్ట్ సిటీ అయిన హైఫాపై తెల్లవారుజామున.. హెజ్బొల్లా ‘ఫాది 1’ క్షిపణులు ప్రయోగించింది. ఐడీఎఫ్ సైనిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని ఈ దాడి చేసింది. ఐదు రాకెట్లు తమ భూభాగాన్ని తాకాయని ఇజ్రాయెల్ ఆర్మీ ధ్రువీకరించింది. వీటి కారణంగా ఓ మెయిన్ రోడ్డు, రెస్టారంట్, ఇల్లు ధ్వంసమయ్యాయని వెల్లడించింది. ఈ ఘటనలో పది మంది గాయపడినట్లు సమాచారం.






