హెజ్ బొల్లాను నామరూపాల్లేకుండా చేస్తున్న ఇజ్రాయెల్..
తమపై దీర్ఘకాలంగా దాడులు చేస్తున్న ఉగ్రసంస్థలను ఇజ్రాయెల్ టార్గెట్ చేసినట్లు కనిపిస్తోంది. హమాస్ పై ఓ వైపు దాడులు చేస్తూ.. కీలక నేతలను ఏరివేస్తున్న ఇజ్రాయెల్… ఇప్పుడు హెజ్ బొల్లాను టార్గెట్ చేసింది. లెబనాన్ లో ఉంటూ తమపై దాడులు చేస్తున్న హెజ్ బొల్లా ఉగ్రసంస్థను నిర్వీర్యం చేసేదిశగా అడుగులు వేస్తోంది. దీనిలో భాగంగా భీకరదాడులకు దిగింది. ఇజ్రాయెల్ జరిపిన భీకర వైమానిక దాడుల్లో లెబనాన్‌కు చెందిన 100 మంది మరణించారు. 400 మందికిపైగా గాయపడ్డారు. మరణించిన వారిలో మహిళలు, పిల్లలు కూడా ఉన్నారని చెప్పింది. దక్షిణ, ఈశాన్య లెబనాన్ ప్రాంతాల్లో ఇజ్రాయెల్ దాడులకు పాల్పడిందని పేర్కొంది. అంతకుముందు, లెబనాన్‌లోని 300 హెజ్బొల్లా లక్ష్యాలపై దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది.
ఆదివారం హెజ్బొల్లా తమ దేశంలో జరిపిన దాడులకు ప్రతీకారంగా ఇజ్రాయెల్ దళాలు రాకెట్ల వర్షం కురిపిస్తున్నాయి. దక్షిణ లెబనాన్‌లోని పలు ప్రాంతాల్లో ఇజ్రాయెల్ సైన్యం భీకర దాడి చేసింది. ఈ దాడులతో సరిహద్దు ప్రాంతాల్లోని పలు పట్టణాల్లో పెద్దఎత్తున పొగ కమ్ముకుంది. హెజ్బొల్లాకు చెందిన 300 టార్గెట్లపై ఇజ్రాయెల్ సైన్యం వైమానికి దాడులు చేసింది. వైమానికి దళానికి చెందిన ఫైటర్ జెట్లు ఈ దాడుల్లో పాల్గొన్నట్లు ఇజ్రాయెల్ రక్షణ శాఖ వెల్లడించింది.
ఖాళీ చేయాలని హెచ్చరికలు
హెజ్బొల్లా మిలిటెంట్ సంస్థ స్థావరాలే లక్ష్యంగా దాడులను మరింత ఉద్ధృతం చేయనున్నట్లు ఇజ్రాయెల్ సోమవారం ఉదయమే ప్రకటించింది. ఈ నేపథ్యంలో దక్షిణ లెబనాన్ ప్రాంతాల్లోని ప్రజలు ఖాళీ చేయాలని ఇజ్రాయెల్ హెచ్చరికలు జారీ చేసింది. హెజ్బొల్లా సంస్థ కొన్ని ఇళ్లను ఆయుధ క్షేత్రాలుగా ఉపయోగించుకుంటుందని తెలిపింది. వాటిని లక్ష్యంగా చేసుకుని మరిన్ని దాడులు చేయనున్నట్లు వెల్లడించింది. ఈ నేపథ్యంలో అక్కడి వారు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని లెబనాన్ ప్రజలకు విజ్ఞప్తి చేసింది.
దీంతో లెబనాన్ సరిహద్దు ప్రాంతాల్లో అలర్ట్ సైరన్లు మోగాయి. 115కు పైగా రాకెట్లను నాలుగు విడతలుగా ఉత్తర ఇజ్రాయెల్‌పై హెజ్బొల్లా ఆదివారం ప్రయోగించింది. గతంలో ఎన్నడూ దాడి చేయని ప్రాంతాలనూ ఈసారి లక్ష్యంగా చేసుకుంది. లెబనాన్ సరిహద్దుకు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న హైఫా నగరాన్నీ హెజ్బొల్లా రాకెట్లు తాకాయి. దీంతో ఉత్తర ఇజ్రాయెల్ వ్యాప్తంగా ఆదివారం పదే పదే సైరన్లు మోగాయి. బాంబు షెల్టర్లలో తలదాచుకొనేందుకు పౌరులు పరుగులు తీశారు. ఇందులో చాలా రాకెట్లను మధ్యలోనే ఐడీఎఫ్ నిరోధించినా కొన్ని ఉత్తర ఇజ్రాయెల్ వ్యాప్తంగా విధ్వంసం సృష్టించాయి.






