PLGA: పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ శకం ముగిసినట్లేనా..?
మావోయిస్టు పార్టీ వ్యూహకర్త, గెరిల్లా ఆపరేషన్లను నిర్వహించడంలో దిట్ట అయిన హిడ్మా మృతితో..పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ భవిష్యత్ ముగిసినట్లే అన్న వాదనలు వినిపిస్తున్నాయి. అప్పటి సీపీఐ-పీపుల్స్‌వార్‌కు గానీ, ఇప్పటి మావోయిస్టు పార్టీకి గానీ గెరిల్లా ఆర్మీ అత్యంత కీలకమైంది. పీపుల్స్‌వార్ గ్రూపులో పీపుల్స్ గెరిల్లా ఆర్మీ(పీజీఏ)గా ఈ విభాగం కొనసాగింది. 1999 డిసెంబరు 2న ఉమ్మడి కరీంనగర్ జిల్లా కొయ్యూర్‌లో జరిగిన ఎన్కౌంటర్లో కేంద్రకమిటీ సభ్యుడు నల్లా ఆదిరెడ్డి ఎలియాస్ శ్యాం, ఏపీ రాష్ట్ర కమిటీ కార్యదర్శి ఎరంర్రెడ్డి సంతోష్‌రెడ్డి ఎలియాస్ మహేశ్, ఉత్తర తెలంగాణ ప్రత్యేక జోనల్ కమిటీ కార్యదర్శి శీలం నరేశ్ ఒకేసారి మృతిచెందడం అప్పట్లో పీపుల్స్‌వార్ పార్టీకి తీవ్ర నష్టం కలిగించింది. ఆ ఆగ్రనేతలకు నివాళిగా వారి ప్రథమ వర్థంతి సందర్భంగా 2000 డిసెంబరు 2న పీజీఏను స్థాపించారు.
2004 సెప్టెంబరు 21న సీపీఐ-పీపుల్స్‌వార్.. మావోయిస్టు కమ్యూనిస్ట్ సెంటర్ ఆఫ్ ఇండియా(ఎంసీసీఐ)తో కలిసి సీపీఐ-మావోయిస్టు పార్టీగా అవతరించిన తర్వాత అది పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ(పీఎల్జీఏ)గా మారింది. అప్పట్లో ఇది 8 బెటాలియన్లు.. 13 ప్లటూన్లతో సుమారు 10-12 వేల సైన్యంతో ఉండేది. అయితే ఆపరేషన్ గ్రీన్‌హంట్, ఆపరేషన్ ప్రహార్, ఆపరేషన్ కగార్‌లతో దశాబ్దంన్నర కాలంగా పరిస్థితి తారుమారైంది. మిగిలిన బెటాలియన్లు క్రమేపీ అస్తిత్వం కోల్పోగా.. హిడ్మా నేతృత్వం వహించిన మొదటి బెటాలియన్ మాత్రమే ఇప్పటివరకు మిలిటరీ ఆపరేషన్లకు వెన్నుదన్నుగా నిలిచింది.
కొంతకాలం క్రితం హిడ్మా డీకేఎస్జడ్సీ బాధ్యతలు తీసుకోవడంతో మొదటి బెటాలియన్‌కు బర్సేదేవా నాయకత్వం వహించారు. ఆ బెటాలియన్‌లోని కాయ్-1కు లెంగు.. కాయ్-2కు కల్లు.. కాయ్-3కి లక్కు నేతృత్వం వహిస్తున్నారు. నాయకత్వం మారినా ఆ బెటాలియన్‌పై హిడ్మా పట్టు కొనసాగింది. తాజాగా అతని ఎన్‌కౌంటర్‌తో ఇక పీఎల్జీఏ కార్యకలాపాలు దాదాపు కనుమరుగైనట్లేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది.






