I.N.D.I.A. : ఇండియా కూటమిలో కుంపట్లు.. మనుగడ సాధ్యమేనా..?

దేశంలో అప్రతిహత విజయాలతో దూసుకుపోతోంది భారతీయ జనతా పార్టీ (BJP) . 2014లో అధికారంలోకి వచ్చిన మోదీ (Modi) వరుసగా మూడోసారి నెగ్గి తమకు తిరుగులేదని చాటిచెప్పారు. పదేళ్లు పరిపాలన పూర్తి చేసుకున్న బీజేపీ 2024 ఎన్నికల్లో ఓడిపోతుందని.. ప్రభుత్వ వ్యతిరేకత ఖాయమని చాలా మంది అంచనా వేశారు. అయితే వాళ్ల అంచనాలన్నీ తలకిందులు చేస్తూ బీజేపీ మరోసారి అధికారాన్ని కైవసం చేసుకుంది. బీజేపీని ఎలాగైనా ఓడించాలని పట్టుదలతో ప్రయత్నించిన కాంగ్రెస్ (Congress) నేతృత్వంలోని ఇండియా కూటమి (INDIA Alliance) మరోసారి విఫలమైంది. ఓటముల నుంచి గుణపాఠాలు నేర్చుకోకుండా అంతర్గత కుమ్ములాటలతో ఆ కూటమి సతమతమవుతోంది.
కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియన్ నేషనల్ డెవలప్మెంటల్ ఇంక్లూజివ్ అలయెన్స్ – ఇండియా కూటమిలో మొత్తం 37 పార్టీలు భాగస్వాములుగా ఉన్నాయి. ఇందులో కాంగ్రెస్, సీపీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ, సమాజ్ వాదీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే, శివసేన (ఉద్ధవ్ ఠాక్రే), ఎన్సీపీ (శరద్ పవార్), ఆర్జేడీ, జేఎంఎం, నేషనల్ కాన్ఫరెన్స్, సీపీఐ ప్రధానమైనవి. మిగిలినవన్నీ చిన్నా చితకా పార్టీలే. ఈ కూటమి ప్రస్తుతం 10 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. మిగిలిన 21 రాష్ట్రాల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే (NDA) పాలిస్తోంది. తాజా లోక్ సభ ఎన్నికల్లో ఇండియా కూటమికి 238 సీట్లు వచ్చాయి. ఒక విధంగా చెప్పాలంటే అధికారానికి కాస్త దూరంలో నిలిచిపోయింది.
ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ చాలా వరకూ సీట్లు త్యాగం చేసింది. చిన్న పార్టీలైనా రాష్ట్రాల్లో ఆయా పార్టీలకు పట్టు ఉంటే సీట్లను వాళ్లకే వదిలేసింది. దీంతో మొత్తంగా కూటమి 238 స్థానాలు నెగ్గింది. బీజేపీకి గట్టి పోటీ ఇచ్చింది. ఒక విధంగా చెప్పాలంటే బీజేపీ పరిస్థితి చావు తప్పి కన్ను లొట్టబోయినట్లయింది. అయితే లోక్ సభ ఎన్నికల ఫలితాల తర్వాత జరిగిన రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా కూటమి మళ్లీ మొదటికొచ్చింది. ఝార్ఖండ్, జమ్ము కాశ్మీర్ లాంటి చిన్న రాష్ట్రాలు మినహా మహారాష్ట్ర, హర్యానా లాంటి రాష్ట్రాలను గెలవలేకపోయింది. పైగా మహారాష్ట్రలో దారుణంగా ఓడిపోయింది.
కూటమిలో విభేదాలే ఓటమికి కారణాలనే టాక్ నడుస్తోంది. పైగా కూటమికి కాంగ్రెస్ నేతృత్వం వహించడంపై మిగిలిన పార్టీలు అసంతృప్తితో ఉన్నాయి. టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ (Mamatha Benerjee) ఈవిషయాన్ని బహిరంగంగానే చెప్పేసింది. అవసరమనుకుంటే తాను నేతృత్వం వహించేందుకు సిద్ధమని మమత ప్రకటించారు. మరోవైపు పార్లమెంటులో అదానీకి వ్యతిరేకంగా ఇండియా కూటమి పోరాడుతోంది. అయితే ఇందులో టీఎంసీ (TMC), సమాజ్ వాదీ పార్టీ (SP) పాల్గొనట్లేదు. దీన్ని బట్టి కాంగ్రెస్ వైఖరి పట్ల ఈ రెండు ప్రధాన పార్టీలు హ్యాపీగా లేవని అర్థమవుతోంది. పశ్చిమ బెంగాల్, ఉత్తర ప్రదేశ్ ఎన్నికలు ఈ రెండు పార్టీలకు అత్యంత కీలకం. అప్పటికి ఇండియా కూటమిలో ఈ పార్టీలు ఉంటాయా.. ఉండవా.. అనేది అనుమానంగా ఉంది. మిగిలిన పార్టీలు కూడా కూటమిలో కొనసాగేందుకు అంత ఆసక్తిగా లేవని సమాచారం. బీజేపీని ఎదుర్కొనేందుకు రాహుల్ గాంధీకి అంత సత్తా లేదనే భావనలో పలు కూటమి పార్టీలు ఉన్నట్టు తెలుస్తోంది.