ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధంలో అరబ్ దేశాలెటువైపు…?
ఓవైపు బలీయమైన ఇజ్రాయెల్.. మరోవైపు పొరుగునే ఉన్న మిత్రదేశం ఇరాన్..పరస్పరం దాడులకు తెగబడుతున్నాయి. ఇజ్రాయెల్ తమపై దాడులు చేస్తోందన్న అక్కసుతో ఏకంగా 180కి పైగా మిస్సైల్స్ తో ఇజ్రాయెల్ పై దాడులు చేసింది ఇరాన్. దీనికి అంతకు అంత ప్రతీకారం తీర్చుకుంటామని.. ఇప్పటికే ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు వార్నింగిచ్చారు. మరి ఈ పరిస్థితుల్లో అరబ్ దేశాలు ఎటువైపు ఉంటాయి. ఇజ్రాయెల్ వైపా..? ఇరాన్ వైపా…? ప్రస్తుత పరిస్థితుల్లో తాము ఎవరిపక్షం వహించమంటున్నాయి అరబ్ దేశాలు.
ఎందుకంటే ఇజ్రాయెల్ కు మద్దతుగా నిలిస్తే దాడులు చేస్తామని ఇప్పటికే ఇరాన్ హెచ్చరికలు పంపింది. అయితే.. గల్ఫ్ దేశాల చమురు నిల్వలపై దాడులు చేస్తామని హెచ్చరికలు చేయలేదు. దీంతో తమపై ఎలాంటి దాడులు ఉండవని సౌదీ సహా అరబ్ దేశాలు భావిస్తున్నాయి. ఈక్రమంలో తాము తటస్థంగా ఉంటామని చెబుతున్నాయి. ఇదే సమయంలో యుద్ధాన్ని మరింత తీవ్రతరం చేయవద్దని.. ఇరాన్ ను గల్ఫ్ కార్పొరేషన్ కౌన్సిల్ సైతం కోరింది. చమురు ఎగుమతుల్లో అగ్రస్థానంలో ఉన్న ఇరాన్, సౌదీ మధ్య విభేదాలు గతేడాది తొలగిపోయాయి.
చైనా మధ్యవర్తిత్వంతో ఇరుదేశాలు ఓ ఒప్పందం సైతం చేసుకున్నాయి. దీనికి తోడు ఇజ్రాయెల్ వైఖరిపై ఇటీవలే సౌదీ అరేబియా విమర్శలు చేసింది. తాము ఎవరిపక్షం వహించమని.. తటస్థంగా ఉంటామంటున్నాయి గల్ఫ్ దేశాలు.






