Bangladesh: హసీనాకు భారత్ అండ.. మిత్రురాలిని కాపాడుతున్న మోడీ..!
షేక్ హసీనాను ఎలాగైనా శిక్షించి తీరాలని మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని బంగ్లాదేశ్ లోని తాత్కాలిక సర్కార్ శతవిధాలుగా ప్రయత్నిస్తోంది. ఆమె మానవత్వం మరిచి ఘోరాలు, నేరాలు చేసిందని.. ఆమె శిక్షార్హురాలంటూ ఐసీటీ స్పష్టం చేసింది. అంతే కాదు.. ఆమెకు డెత్ సెంటెన్స్ విధించింది. కోర్టు శిక్ష విధించింది కాబట్టి.. ఆమెను అప్పగించాల్సిందేనని బంగ్లాదేశ్ వాదిస్తోంది. అయితే దీనికి భారత్ అంగీకరించే పరిస్థితి లేదన్నది నిపుణుల మాట . ఎందుకంటే ఇప్పటికే బంగ్లాదేశ్ పరిణామాలను న్యూఢిల్లీ నిశితంగా పరిశీలిస్తోంది.
వాస్తవానికి బంగబంధుగా పిలుచుకునే ముజిబుర్ రెహ్మాన్ కాలం నుంచి భారత్, బంగ్లాదేశ్ మధ్య మంచి సంబంధాలున్నాయి. అసలు తూర్పుపాకిస్తాన్ గా పిలుచుకునే బంగ్లాదేశ్ .. స్వతంత్ర దేశంగా మారడం వెనక భారత్ హస్తముంది.ఆ దేశాన్ని స్వేచ్ఛాయుతం చేయాలన్న ముజిబుర్ విజ్ఞప్తితో.. ఇందిర గాంధీ, భారత సైన్యాన్ని బంగ్లాదేశ్ లోకి పంపింది. అప్పటికే అక్కడకు చొచ్చుకొస్తున్న పాకిస్తాన్ సేనలను తిప్పికొట్టి మరీ ఘన విజయాన్ని సాధించింది. దీంతో నాటి ప్రధాని ముజిబుర్ రెహ్మాన్.. భారత్ సేవలను స్మరించుకున్నారు. అప్పటి నుంచి ఆదేశంతో ఢిల్లీకి సన్నిహిత సంబంధాలున్నాయి.
ఆ బంగబంధు కుమార్తె షేక్ హసీనా… ఆమె ఆది నుంచి భారత్ తో మంచి సంబంధాలు కొనసాగించారు. భారత్ కు వ్యతిరేకంగా బంగ్లా గడ్డను ఉగ్రవాదులు వినియోగించుకోకుండా చూశారు. అంతేనా.. భారత్ తో పలు కీలక ఒప్పందాలు చేసుకోవడం ద్వారా బంగ్లాదేశ్ అభివృద్ధిలో తన వంతు పాత్ర పోషించారు.మరోవైపు మయన్మార్ నుంచి ఉగ్రవాదులు భారత్ లో చొరబడకుండా తనవంతు సాయం చేశారు. ముజిబుర్ రెహ్మాన్ కుటుంబంలో పలువురిని ఉగ్రవాదులు హత్య చేసినప్పుడు.. ఆమెను నాటి ఇందిర సర్కార్….ఢిల్లీలోని రహస్య ప్రదేశంలో ఉంచి సంరక్షించింది. తర్వాత పరిస్థితులు చక్కబడిన తర్వాత ఆమె తన దేశానికి తరలివెళ్లారు.
ఇక ప్రత్యర్థి పార్టీకి చెందిన ఖలీదా జియా.. మొదటి నుంచి పాకిస్తాన్ తో సన్నిహిత సంబంధాలు నెరపుతూ వచ్చారు. ఇప్పుడు ఉన్న యూనస్ సర్కార్ అయితే.. పాకిస్తాన్ కు సాగిలపడి నడచుకుంటోంది. ఈసమయంలో హసీనాను అప్పగించినట్లైదే.. భారత్ కు ఉన్న ఒకే ఒక్క అవకాశం మూసుకుపోతుంది. దీంతో ఇక .. బంగ్లా దేశ్ మరో పాకిస్తాన్ అయి కూర్చుంటుంది. ఇప్పటికే పాకిస్తాన్ తో నానా తంటాలు పడుతున్న భారత్.. పొరుగున మరో పాకిస్తాన్ పురుడు పోసుకునే అవకాశాన్నిస్తుందా.. అసలు మోడీ లాంటి శక్తిమంతమైన నేత.. ఇలాంటి వాటికి అవకాశాలిస్తారా అన్నది అనుమానమే. అందుకే ఇండియా.. హసీనాకు ఆశ్రయమివ్వడమే కాదు.. కాపాడుతూ వస్తోంది కూడా .






