రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ఆపేదిశగా భారత్ చర్యలు…
భారత ప్రధాని మోడీ పేరు.. అంతర్జాతీయంగా మరోసారి మార్మోగిపోతోంది. దీనికి కారణం.. ప్రపంచం కోరుకుంటున్నది మోడీ సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు. రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం ఆపేందుకు భారత్ మధ్యవర్తిత్వానికి సిద్ధంగా ఉంది. ఇప్పటికే పుతిన్, జెలెన్ స్కీ తో మోడీ విడివిడిగా చర్చించారు కూడా. ఇద్దరూ శాంతికి సిద్ధమంటున్నారు.అయితే ఈ సంధి ప్రయత్నాల్లో మోడీ ఎలాంటి మంత్రమేస్తారో అని అంతర్జాతీయ దేశాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి.
ఇటీవలే ఉక్రెయిన్ వెళ్లి జెలెన్ స్కీతో మంతనాలు జరిపిన భారత ప్రధాని మోడీ.. ఇప్పుడు జెెలెన్ స్కీని భారత్ రావాలని ఆహ్వానించారు. దీన్ని జెలెన్ స్కీ మన్నించారు కూడా. దీంతో ఈ ఏడాది చివరిలో జెలెన్ స్కీ ఇండియాలో పర్యటించనున్నట్లు ఆదేశ రాయభారి తెలిపారు. మోడీకి పుతిన్ నమ్మదగిన నేస్తం.. ఉక్రెయిన్ అధ్యక్షుడితోనూ చేయిచేయి కలిపి నడిచే సాన్నిహిత్యం ఉంది. దీంతో ఈ ఇద్దరు నేతల్ని శాంతి దిశగా మోడీ నడిపిస్తారని.. నడిపించాలని ప్రఫంచం కోరుకుంటోంది. మరోవైపు ఈ పరిణామాల్ని అంతర్జాతీయ సమాజం నిశితంగా గమనిస్తోంది.
మరీ ముఖ్యంగా నాటో కూటమి, ఈయూ దేశాలు.. చాలా ఆసక్తిగా గమనిస్తున్నాయి. రణక్షేత్రంలో హోరాహోరీగా తలపడిన ఇద్దరు నేతల మధ్య చర్చలు ప్రారంభించడం అంటే మాటలు కాదు. మరి ఈ భగీరథ ప్రయత్నాన్ని మోడీ ఎలా సమర్థవంతంగా నిర్వహిస్తారో అని అందరూ ఆశగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు మోడీ.. మాత్రం ఎలాంటి చడీ చప్పుడూ లేకుండా తన పని తాను చేసుకుంటూ పోతున్నారు. ఈ యుద్ధం ముగియాలని రష్యన్లు కోరుకుంటున్నారు.
రష్యా ఆర్థికవ్యవస్థను ఈ యుద్దం చిన్నాభిన్నం చేసింది. తమ వారు అంతు తెలియని రణక్షేత్రంలో అడుగుపెట్టి ప్రాణాలు కోల్పోతున్నారు. దీనివల్ల సాధించేదేంటో ఎవరికీ అర్థం కావడం లేదు. దీంతో తమకీ కడుపుకోత వద్దని రష్యా తల్లులు దేవుడిని వేడుకుంటున్నారు. మరోవైపు ఎప్పుడు ఏ రష్యన్ క్షిపణి మీద పడి ప్రాణాలు పోతాయో అన్న భయం ఉక్రెయిన్లలో ఉంది. సైన్యం వీరోచితంగా పోరాడుతున్నప్పటికీ.. ఇప్పటికే వేలాదిప్రాణాలు మట్టిలో కలిశాయి. దీంతో ఈ యుద్ధం ఆగిపోవాలని శాంతి నెలకొనాలని ఉక్రెయిన్లు దేవుని ప్రార్థిస్తున్నారు.






