Chandrababu: కూటమి సంక్షేమం, వాగ్దానాలపై విస్తరిస్తున్న ఆందోళనలు..

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి పదిహేనో నెల పూర్తి అయ్యింది. ఈ కాలంలో ప్రభుత్వం మంచి పాలన అందించామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu), ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) సహా మంత్రులు పదేపదే చెబుతున్నారు. అధికారంలో ఉన్న వారు తమ పాలనను సమర్థించుకోవడం సహజమే అయినా, ప్రజల అసలు సమస్యలను పట్టించుకోవడం లేదన్న విమర్శలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా క్షేత్రస్థాయిలో కనిపిస్తున్న పరిస్థితులు దీనికి నిదర్శనం అంటున్నారు రాజకీయ పరిశీలకులు.
కూటమి పరిపాలనలో ఇప్పటికీ కొన్ని వర్గాలు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు స్పష్టంగా బయటపడుతోంది. రైతులు యూరియా కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గిట్టుబాటు ధరలు దొరకక, రోజులు తరబడి ఎరువుల కోసం క్యూలైన్లలో నిలబడుతున్నారు. ఇది వారికి ఆర్థికంగా భారం అవ్వడంతో పాటు నిరాశ కలిగిస్తోంది. ప్రభుత్వ ప్రతిస్పందనపై కూడా రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కొందరు నాయకులు రైతులను బెదిరిస్తున్నారన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి.
మరోవైపు అంగన్వాడీ సిబ్బంది కూడా జీతం పెంపు, పెండింగ్ వేతనాలు, అలవెన్సులు అందక ఆందోళనలు చేస్తున్నారు. ప్రభుత్వం ఈ సమస్యను తేలికగా తీసుకుంటున్నా, ప్రాంతాల వారీగా వారు నిరసనలు కొనసాగిస్తున్నారు. విద్యార్థులు కూడా తమ సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు. ఇప్పటికే మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) నివాసాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించి, పోలీసులు లాఠీచార్జ్ చేసిన ఘటనలు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యాయి.
ఉద్యోగ సంఘాలు కూడా సీరియస్‌గా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నాయి. వారికి రావాల్సిన పిఆర్సి(PRC) బకాయిలు, పెండింగ్ వేతనాలు ఇవ్వకపోవడం, సిపిఎస్ (CPS) రద్దు వాగ్దానం ఇంకా నెరవేర్చకపోవడం వల్ల అసహనం పెరుగుతోంది. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని వారు స్పష్టంగా డిమాండ్ చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటివరకు తమ గోడు పట్టించుకున్నది లేదు అని ఉద్యోగ సంఘాలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి.
సంక్షేమ కార్యక్రమాల విషయంలో కూడా వివాదం ఉంది. అర్హత ఉన్నప్పటికీ, రాజకీయ కారణాల వల్ల కొందరిని లబ్ధి దూరం చేశారని బాధితులు చెబుతున్నారు. వీరి సంఖ్య జిల్లాల వారీగా వేలల్లో ఉండగా, రాష్ట్రవ్యాప్తంగా లక్షల్లో ఉన్నారని సమాచారం. వీరు కలెక్టరేట్ (Collectorate) కార్యాలయాల వద్దకు వెళ్లి సమస్యలు చెప్పుకుంటున్నా, సరైన పరిష్కారం లభించడం లేదు.
ఇలాంటి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం అంతా బాగానే ఉందని చెప్పుకోవడం ఎంతవరకు సమర్థనీయమో అన్న ప్రశ్న లేవుతోంది. ఎన్నికల సమయానికి మాత్రమే ప్రచారం మీద ఆధారపడితే, భవిష్యత్తులో ప్రజల అసంతృప్తి ప్రతికూల ఫలితాలు ఇవ్వొచ్చని పరిశీలకులు సూచిస్తున్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను నిజాయితీగా గుర్తించి, వాటిని పరిష్కరించే ప్రయత్నం చేస్తేనే సుపరిపాలనపై మంచి అభిప్రాయం ఏర్పడుతుంది.