Terrorist Doctors: వైట్ కోట్ టెర్రరిజమ్.. !
దేశాన్ని కుదిపేస్తున్న ఫరీదాబాద్ ఉగ్ర కుట్రలో అత్యధిక మంది వైద్యులే ఉన్నారు. వీరు సైన్స్ విజ్ఞానాన్ని పేలుడు పదార్థాల తయారీపై ఎక్కువగా వాడినట్లు తెలుస్తోంది. వేల కిలోల పేలుడు పదార్థాలను పోగుచేసి అమాయక ప్రజల ప్రాణాలను తీసేందుకు యత్నించారు. తమకు ఉన్న జ్ఞానంతో ‘మదర్ ఆఫ్ సైతాన్’గా పిలిచే రసాయన సమ్మేళనాన్ని వాడేందుకు సిద్ధం చేశారు.
‘మదర్ ఆఫ్ సైతాన్’..?
ఢిల్లీలో ఎర్రకోట వద్ద ఐ20 కారును పేల్చేందుకు బాంబర్ డాక్టర్ ఉమర్ నబీ అత్యంత ప్రమాదకర కెమికల్‌ను వాడినట్లు ఫోరెన్సిక్ బృందాలు గుర్తించాయి. మీడియా, భద్రతా వర్గాలు ‘మదర్ ఆఫ్ సైతాన్’గా పిలిచే ట్రైఅసిటోన్ ట్రైపెరాక్సైడ్ (TATP) ఆనవాళ్లు ఫోరెన్సిక్ పరీక్షల్లో బయటపడ్డాయి. ఇది పూర్తిగా అస్థిర రసాయన సమ్మేళనమని నిపుణులు చెబుతున్నారు. దీనిని సాధారణ బాంబులా గుర్తించడం సాధ్యంకాదు. ఉగ్ర డాక్టర్ల బృందం టీఏటీపీని అమ్మోనియం నైట్రైట్తో కలిపి పేలుడు పదార్థాన్ని సిద్ధం చేయగా.. ఫరీదాబాద్‌లో దర్యాప్తు బృందాలు స్వాధీనం చేసుకొన్నాయి. ఐ20 కారులో ఈ మిశ్రమం కారణంగానే భారీ పేలుడు జరిగినట్లు రిపోర్టు అభిప్రాయపడింది. జమ్ముకశ్మీర్‌లో నౌగామ్ పోలీస్ స్టేషన్లో ఇదే రసాయన సమ్మేళనం నుంచి నమూనాలు సేకరిస్తుండగా భారీ పేలుడు జరిగి 9 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు.
గతంలో టీఏటీపీని జులై 2005లో జరిగిన లండన్ బాంబింగ్‌లో వాడారు. అప్పుడు 52 మంది ప్రాణాలు కోల్పోయారు.నవంబర్ 2015 పారిస్ దాడుల్లోనూ దీన్ని వాడారు. ఆత్మాహుతి బాంబర్లు ధరించిన జాకెట్లలో అమర్చారు. మార్చి 2016 బ్రస్సెల్స్‌లో జరిగిన ఆత్మాహుతి దాడిలో టీఏటీపీని వినియోగించారు. మొత్తం 32 మంది చనిపోగా.. 300 మంది గాయపడ్డారు.మే 2017లో జరిగిన మాంచెస్టర్ ఎరీనా పేలుళ్లలో దీనిని ఐఈడీతో కలిపి వినియోగించారు. ఆ దాడిలో 22 మంది చనిపోయారు.
అంతా డాక్టర్లే..
ఈ ముఠాలో డాక్టర్ ఉమర్ నబీ (ఆత్మాహుతి బాంబర్), డాక్టర్ ముజమ్మిల్ షేక్, డాక్టర్ ఆదిల్ అహ్మద్, డాక్టర్ షాహిన్ షహిద్ కీలక పాత్ర పోషించారు. వీరు కాకుండా డాక్టర్ పర్వేజ్ సయ్యద్ అన్సారీ, డాక్టర్ ముజఫర్ అహ్మద్, డాక్టర్ మొహియుద్దీన్ సయ్యద్ అనుమానితుల జాబితాలో ఉన్నారు. దీంతోపాటు అల్ ఫలాహ్ విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ నిసార్ ఉల్ హసన్ కనిపించకుండా పోయారు. గతంలో ఉగ్రకార్యకలాపాలు చేస్తున్నాడని ఇతడిని జమ్ముకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ ఆదేశాల మేరకు ఉద్యోగం నుంచి తొలగించారు.






