ట్రంప్ వర్సెస్ నిక్కీ హేలీ…
అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వంకోసం గ్రాండ్ ఓల్డ్ పార్టీ అయిన రిపబ్లికన్ పార్టీలో రేసు కొనసాగుతోంది. అయితే రేసులో ఒకొక్కరిగా అభ్యర్థులు… తమ అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకుంటున్నారు. తొలుత మైక్ పెన్స్, తర్వాత వివేక్ రామస్వామి, ఇప్పుడు డిశాంటిస్.. వరుసగా వెనక్కు వెళ్తున్నారు. అంతేకాదు.. తమ ప్రత్యర్థి ట్రంప్ నకు పూర్తిస్థాయి మద్దతు పలుకుతున్నారు. ఈపరిణామాలు పార్టీపై ట్రంప్ పట్టును నిరూపిస్తున్నాయి. ట్రంప్ కూడా తనకు మద్దతుగా నిలుస్తున్నందుకు వారిని అభినందిస్తున్నారు. వారితో కలిసి పని చేయడానికి ఎదురుచూస్తున్నట్లు ట్రంప్ చెబుతున్నారు. రాన్ డిసాంటిస్.. NHలో ఆరుపాయింట్లు పడిపోయారు. దీనికి తోడు ట్రంప్‌ను ఓడించేందుకు రాజకీయంగా తనకు అవకాశాలు లేవని గ్రహించారు డిసాంటిస్, దీంతో తాను అధ్యక్ష అభ్యర్థిత్వం నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు డిసాంటిస్.
అయితే ట్రంప్‌కు ప్రధాన ప్రత్యర్థిగా హేలీ రేసులో మిగిలారు. దీనికి తోడు నెమ్మనెమ్మదిగా హేలీ రాజకీయ గ్రాఫ్ పెరుగుతూ వస్తోంది. ఇప్పుడు ఆమె ట్రంప్‌కంటే కేవలం పదిపాయింట్లు మాత్రమే వెనకబడి ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఎందుకంటే.. ఇప్పటివరకూ మిగిలిన అభ్యర్థులకు మద్దతుగా నిలిచిన పార్టీలోని సభ్యులు… ఇప్పుడు ట్రంప్, హేలీ వర్గాలుగా విడుపోయారు. దీనికి తోడు ఇద్దరు నేతలు.. తమ ప్రత్యర్థులను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ ముందుకెళ్తున్నారు. అయితే ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే మరోసారి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా ట్రంప్‌నకు మంచి అవకాశాలున్నట్లు పార్టీవర్గాలు చెబుతున్నాయి.
ట్రంప్‌కు పార్టీలోని అతివాద, శ్వేతజాతీయుల మద్దతు ఎక్కువగా ఉంటోంది. దాంతో అతను వారి సంక్షేమంపైనే ఫోకస్ పెడుతున్నారు. ముఖ్యంగా మెక్సికో సరిహద్దుల దగ్గర గోడ నిర్మాణం, వలసవచ్చేవారిపై ఆంక్షలు కఠినం చేయడం సహా విదేశాంగ విధానంలోనూ తనదైన మార్క్ చూపిస్తానంటున్నారు ట్రంప్. అయితే హేలికి… ఆ పరిస్థితి లేదంటున్నారు. అంతేకాదు… తాను అధ్యక్షుడిగా ఎన్నికైతే.. బైడెన్ చర్యలతో దిగజారిన అమెరికా ప్రతిష్టను నిలబెడతామంటున్నారు. తాను అధ్యక్షుడిగా ఉండి ఉన్నట్లైతే.. రష్యా ఎట్టిపరిస్థితుల్లోనూ ఉక్రెయిన్‌పై దాడి చేసేది కాదంటున్నారు. ఇక చైనా దూకుడుకు కూడా తాను మాత్రమే అడ్డుకట్ట వేయగలనంటున్నారు ట్రంప్.ఇక నిక్కీ హేలీ..ట్రంప్‌కు మానసిక స్థిరత్వంలేని వ్యక్తిగా అభివర్ణిస్తున్నారు. ఆయనమాటలు, వాచాలత అధ్యక్ష పదవికి అంగీకార యోగ్యం కాదంటున్నారు. అయితే.. విదేశాంగ విధానంలో మాత్రం ట్రంప్‌తో హేలీ ఏకీభవిస్తున్నారు.






