West Asia: పశ్చిమాసియాపై పట్టుబిగిస్తున్న అమెరికా…!
పశ్చిమాసియాలో అమెరికాకు ఉన్న ఏకైక మిత్రదేశం ఇజ్రాయెల్ (Israel). అక్కడి గల్ఫ్ ప్రపంచంపై దశాబ్దాలుగా తన ఆధిపత్యాన్ని ఇజ్రాయెల్ సర్కార్ ద్వారా నిలబెట్టుకుంటూ వస్తోంది. అయితే ఇదొక్కటే చాలదని గుర్తించిన అమెరికా.. గల్ఫ్ లో కూడా మిత్రులను తయారు చేసుకుంటూ వస్తోంది. అందులో కీలకమైంది సౌదీ అరేబియా. గల్ఫ్ దేశాల్లో అత్యంత రిచ్ కంట్రీ అయిన సౌదీ కూడా.. అమెరికాతో కలిసి నడుస్తోంది. దీంతో పాటు సిరియా, సూడాన్ సహా కొన్ని దేశాలను అమెరికా మిత్రదేశాలుగా మార్చుకుంది. అయితే అది చాలదని గుర్తించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. తనదైన మార్క్ చూపిస్తున్నారు.
అమెరికా పశ్చిమాసియాలో ప్రాధాన్యతలను మార్చేస్తోంది. ట్రంప్ 2.0 పాలనలో సిరియా అధ్యక్షుడితో భేటీ, సౌదీకి F-35 యుద్ధ విమానాల అమ్మకం వంటి పరిణామాలు ఆశ్చర్యపరుస్తున్నాయి. అయితే, ఎఫ్-35లకు ఇప్పటి వరకూ కేవలం ఇజ్రాాయెల్కు మాత్రమే అమెరికా అందజేసింది. అలాంటిది అంతంతమాత్రంగానే సంబంధాలున్న సౌదీ అరేబియాకు వాటిని అమ్మడంపై ఇజ్రాయెల్ మౌనం విశ్లేషకులను సైతం ఆశ్చర్యానికి గురి చేసింది. దీనివెనక పెద్ద వ్యూహం ఉందని, సౌదీని ‘అబ్రహం అకార్డ్’ లో చేర్చడానికి ట్రంప్ ప్రయత్నిస్తున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు.
పశ్చిమాసియాలో అమెరికా ప్రాధాన్యత మారుతోంది. ఇందుకు ఇటీవల జరుగుతోన్న పరిణామాలే నిదర్శనం. రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారి పశ్చిమాసియా పర్యటనకు వచ్చిన ట్రంప్.. ఒకప్పుడు అమెరికా ఉగ్రవాదిగా గుర్తించిన సిరియా అధ్యక్షుడు అల్ బషర్‌తో భేటీ అయి అందర్నీ ఆశ్చర్యానికి గురిచేశారు. ఇటీవల అల్ బషర్ అమెరికాలో పర్యటించి, ట్రంప్‌తో చర్చలు జరిపారు. తాజాగా, F-35 యుద్ధ విమానాలను సౌదీ అరేబియాకు అమ్మడానికి ట్రంప్ సిద్ధమయ్యారు. ఇప్పటి వరకూ ఈ ఫైటర్ జెట్లు ఇజ్రాయెల్‌కు మాత్రమే సరఫరా చేసింది. వీటి ద్వారా గగనతలంపై ఇజ్రాయెల్ తిరుగులేని ఆధిపత్యాన్ని సాధించింది. కానీ, వీటిని సౌదీకి కానుకగా ఇవ్వడానికి ముందుకురావడం అంతర్జాతీయంగా తీవ్ర చర్చ మొదలైంది.
ఏడేళ్ల తర్వాత అమెరికా పర్యటనకు సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ వెళ్లనున్నారు. ఆయన పర్యటనకు ముందే F-35 యుద్ధ విమానాల అమ్మకాల ఒప్పందాన్ని ఆమోదిస్తానని ట్రంప్ ప్రకటించారు. వైట్‌హౌస్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ… అమెరికాకు సౌదీ మంచి మిత్రదేశమని కొనియాడారు. స్వయంగా వ్యాపారవేత్త అయిన అమెరికా అధినేత ఈ నిర్ణయాన్ని అంత సులభంగా తీసుకోలేదు. ఇరాన్ అణు కేంద్రాలపై అమెరికా సైన్యం ఈ ఏడాది జరిపిన క్షిపణి దాడులకు సౌదీ అందించిన సహకారాన్ని ట్రంప్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. అంటే, దీని వెనక ఆర్థిక ప్రయోజనాలతో పాటు రాజకీయపరమైన సహాకారం కూడా ఉన్నట్లు స్పష్టమవుతోంది.






