Risin Terrorism: సామూహిక విష ప్రయోగానికి డాక్టర్ల స్కెచ్..?
ఉగ్రవాదం (Terrorism) అంటే మనకు వెంటనే గుర్తొచ్చేవి.. బాంబు పేలుళ్లు, భీకరమైన కాల్పులు, విమానాల హైజాకింగ్‌లు, జనసమూహంలో రక్తపాతం సృష్టించడం.. లాంటివి.! ఇప్పటివరకు మన దేశంలో జమ్మూ కశ్మీర్ మొదలు ఢిల్లీ దాకా, ఆపరేషన్ సిందూర్‌కు దారితీసిన పహల్గాం దాడుల నుంచి తాజాగా ఢిల్లీ ఎర్రకోట (Red Fort) సమీపంలో జరిగిన కారు పేలుడు వరకు అనేక దాడులు చూశాం. వీటన్నింటిలో ఉగ్రవాదులు తమ భయంకరమైన శక్తిని, విధ్వంసాన్ని చూపించారు. అయితే, తాజాగా వెలుగులోకి వచ్చిన ఓ ఉగ్రకుట్ర అత్యంత భయంకరంగా ఉంది. పాయిజన్ టెర్రరిజం అనే సరికొత్త, అత్యంత ప్రమాదకరమైన కోణాన్ని పరిచయం చేసింది. ఈ ఉగ్రదాడికి స్కెచ్ వేసింది డాక్టర్లు కావడం గమనార్హం. ఇందుకోసం వాళ్లు ఎంచుకున్న ఆయుధం ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన సహజ విషం కావడం దేశంలో కలకలం రేపుతోంది.
ఢిల్లీలో కారు పేలుడు తీవ్ర కలకలం రేపింది. అయితే అంతకుముందే ఓ ఉగ్ర కుట్రను పోలీసులు భగ్నం చేశారు. అందులో భాగంగా నలుగురు ఉగ్రవాదులను అరెస్టు చేశారు. వీళ్లలో డాక్టర్ అదీల్ రాథర్, డాక్టర్ ముజమ్మిల్ షకీల్ గనయి, డాక్టర్ అహ్మద్ సయేద్ మొహియుద్దీన్ సహా ఓ మహిళా డాక్టర్ కూడా ఉన్నారు. ప్రాణాలు కాపాడాల్సిన వైద్యులే, వందలాది ప్రాణాలు తీయడానికి సిద్ధపడటం దేశ ప్రజలను దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ ఉగ్రకుట్రకు హైదరాబాద్ కు చెందిన డాక్టర్ అహ్మద్ సయేద్ మొహియుద్దీన్ మాస్టర్ మైండ్ అని తేలింది. ఇతను తన ఇంట్లోనే రహస్యంగా అత్యంత ప్రమాదకరమైన విషాన్ని తయారు చేస్తున్నట్టు గుజరాత్ ఏటీఎస్ పోలీసులు గుర్తించారు. ఆ విషం పేరే ‘రిసిన్’.
మొహియుద్దీన్ ప్లాన్ చాలా భయంకరమైంది. అతను తయారుచేసిన ఈ రిసిన్ విషాన్ని దేశంలోని అత్యంత రద్దీగా ఉండే స్ట్రీట్‌ఫుడ్ మార్కెట్లలోకి పంపి, ఆహారంలో కలిపి వేలాది మంది ప్రాణాలు తీయాలని పన్నాగం పన్నాడు. ఇందుకోసం అతను ఢిల్లీలోని ఆజాద్‌పూర్ మండి, అహ్మదాబాద్‌లోని నరోడా పండ్ల మార్కెట్, లక్నోలోని ఆర్.ఎన్.ఎన్ కార్యాలయ ప్రాంతం వంటి రద్దీ ప్రాంతాలను ఎంపిక చేసుకున్నాడు. ఆరు నెలల ముందుగానే రెక్కీ కూడా నిర్వహించాడు. ఇంటర్నెట్లో ‘రిసిన్’ తయారీ విధానం తెలుసుకుని, ముడిసరుకు కూడా సిద్ధం చేసుకున్నాడు. అయితే, అతని కుట్ర ఫలించకముందే పోలీసులు చాకచక్యంగా అతన్ని పట్టుకున్నారు.
డాక్టర్ మొహియుద్దీన్ కుట్రతో ‘రిసిన్’ అనే విషం గురించి చర్చ మొదలైంది. ఇది ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన సహజ విషం. సాధారణ సైనేడ్ కంటే రిసిన్ 6వేల రెట్లు ఎక్కువ విషపూరితమైనది. దీన్ని బట్టి రిసిన్ తీవ్రత ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. కేవలం ఉప్పు గింజంత పరిమాణంలో ఉన్న రిసిన్ కూడా ఒక మనిషి ప్రాణం తీయగలదు. నిపుణుల అంచనా ప్రకారం, ఒక చెంచా రిసిన్ ఏకంగా లక్ష మందిని చంపగలదు!
రిసిన్ అనేది ఆముదం (Castor) విత్తనాల నుండి లభించే ఒక ప్రొటీన్ ఆధారిత విషం (Toxin Protein). ఈ విత్తనాలను అలంకరణకు లేదా నూనె తీయడానికి కూడా వాడతారు. అయితే వాటిని పొడి చేసి, సెంట్రిఫ్యూజ్ చేసి తీసిన రిసిన్ అత్యంత శుద్ధమైన విషంగా మారుతుంది. రిసిన్ పొడి రూపంలో శ్వాస ద్వారా, ఆహారం ద్వారా లేదా ఇంజెక్షన్ ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తే, అది కణాలలో జరిగే అత్యంత కీలకమైన ప్రొటీన్ సంశ్లేషణ (Protein Synthesis) ప్రక్రియను అడ్డుకుంటుంది. దీనివల్ల శరీరం ప్రొటీన్లను తయారుచేయడం ఆపేస్తుంది. రిసిన్ ప్రభావం మొదలైన 4-6 గంటల్లోనే వాంతులు, అతిసారం, జ్వరం, అవయవాలు విఫలం కావడం మొదలవుతుంది. చివరకు 36 నుంచి 72 గంటల్లో మరణం సంభవిస్తుంది. ఎందుకంటే ఈ భయంకరమైన విషానికి ఇప్పటివరకు ఎలాంటి విరుగుడూ లేదు.
ఈ రిసిన్‌ను మొహియుద్దీన్ స్ప్రే లేదా పౌడర్ రూపంలో గాలిలో వ్యాపింపజేయడానికి లేదా ఆహారంలో కలపడానికి కుట్ర పన్నాడు. చరిత్రలో కూడా రిసిన్ తరహా మర్డర్ స్కెచ్ లు ఉన్నాయి. 1978లో బల్గేరియన్ అసమ్మతివాది జార్జి మార్కోవ్‌ను రిసిన్ ఇంజెక్ట్ చేసి చంపిన సంఘటన ఉంది. డాక్టర్ల ముసుగులో వచ్చిన ఈ ఉగ్రవాదులు.. విషాన్ని ఉపయోగించి సామూహిక మరణాలను సృష్టించాలని ప్రయత్నించడం, ఉగ్రవాదంలో అత్యంత నీచమైన, భయంకరమైన కోణాన్ని తెలియజేస్తోంది.







