Delhi Blasts: ఉగ్ర డాక్టర్ల చేతుల్లోకి ..‘మదర్ ఆఫ్ సైతాన్’..?
అక్షరం రాని వాడు, అజ్ఞానాంథకారంలో కొట్టుమిట్టాడేవాడు.. భావావేశంలో కొట్టుకుపోతూ, ఉగ్రవాదులుగా మారి.. సొంతదేశంపై దాడికి ప్రయత్నించడం ఇప్పటిదాకా చూస్తూ వస్తున్నాం. వారికి అంటే ఉపాధి ఉండదు.. కుటుంబాన్ని పోషించుకునేందుకు ఏదో దారి వెతుక్కుంటూ.. అందులో మాస్టర్ మైండ్స్ ఉచ్చులో చిక్కి ఉగ్రనాగులుగా మారడం తెలుస్తూ ఉంది. అలాంటి వారే ఎక్కువగా కశ్మీర్ లో ఉగ్రవాద దాడుల్లో పాల్గొని, ఎన్ కౌంటర్లలో హతమవ్వడం అనాదిగా వస్తోంది.వారిని మన భద్రతా దళాలు తమ జాగరూకతతో మట్టుబెడుతున్నాయి కూడా..
ఇలాంటి వారితో ప్రమాదం ఉన్నా.. వాటిని కాస్త అడ్డుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే.. చదువుకుని, సమాజంలో మంచి పొజిషన్ లో ఉండి కూడా.. మతోన్మాద శక్తుల చేతుల్లో పడితే.. అలాంటి వారిని చదువుకున్న మూర్ఖులంటారు. అంతేకాదు.. వీరు చదువు రాని ఉగ్రవాదుల కన్నా అత్యంత ప్రమాదకరం. ఎందుకంటే తాము నేర్చుకున్న విజ్ఞానాన్ని పక్కదారి పట్టించి, దాన్ని సొంత దేశంపైనే దాడికి ఉపయోగిస్తూ వస్తున్నారు. అలాంటి వారే ఇప్పుడు ఎర్రకోట దగ్గర ఉగ్రదాడికి పాల్పడిన వ్యక్తులు. వేసుకుంది తెల్లకోటు.. చేస్తుంది ప్రజలకు ప్రాణదానం. మరి అలాంటి వ్యక్తులు.. అత్యంత కిరాతకంగా పలువురి ప్రాణాలు తీసే మహా విస్ఫోటన పదార్దాన్ని సేకరించడం చూస్తుంటే.. ఏమనిపిస్తుంది..?
అసలు.. వీరికి ఏం తక్కువ..? సమాజంలో మంచి పేరు, సంఘంలో పలుకుబడి.. మంచి సంపాదన మార్గం. విద్యార్థులకు మార్గదర్శకులుగా ఉన్నారు. విద్యార్థులకు విద్యాబుద్దులు చెప్పి, ఎలా ఉండాలి..? ఎలా ఉండకూడదో చెప్పాల్సిన వారు కాస్తా.. ఉగ్రబుద్ధితో దేశంపై దాడులకు దిగితే ఇంకేం చెప్పేది..? అసలు పక్కవారికి సైతం తాము ఉగ్రవాద మైండ్ సెట్ తో ఉన్నట్లు తెలియకుండా ప్రవర్తించిన నీచులు వీరు. వీరిని ఏమని సంభోదించాలన్నది అర్థం కాదు.
రసాయనాల్లో అత్యంత ప్రమాదకమైన ‘మదర్ ఆఫ్ సైతాన్’గా పిలిచే ట్రైఅసిటోన్ ట్రైపెరాక్సైడ్ (TATP) ఆనవాళ్లు ఫోరెన్సిక్ పరీక్షల్లో బయటపడ్డాయి. ఇది పూర్తిగా అస్థిర రసాయన సమ్మేళనమని నిపుణులు చెబుతున్నారు. దీని ప్రభావం ఎంతలా ఉంటుందంటే ఊహకు కూడా అందదు. మరి అలాంటిది ఏదైనా సభ, సమావేశాలు, బహిరంగసభలు జరిగేటప్పుడు పేలిస్తే.. ఊహకు అందని ప్రాణనష్టం సంభవిస్తుంది. దీనికి చదువుకుని మూర్ఖులు, మతోన్మాదుల్లా తయారైన వారు.. ఆద్యం పోస్తే , దాన్ని అడ్డుకోవడం కష్టమన్నది డిఫెన్స్ నిపుణుల మాట.






