Pakistan: చైనా రుణ ఉచ్చులో పాక్ విలవిల..!
చైనా డ్రాగన్ పాలసీ ఉచ్చులో చిక్కి పొరుగుదేశాలు విలవిలలాడుతున్నాయి. ఇప్పటికే శ్రీలంక, లావోస్, జాంబియా, మాల్దీవులు లాంటి దేశాలు అవసరానికి మించి అప్పులు చేసి, వడ్డీలు కట్టలేక ఎలా బయటపడాలో తెలియక సతమతమవుతున్నాయి. దీంతో కొన్ని దేశాలు చైనా మాయలో పడకుండా నేర్పుగా తప్పుకుంటున్నాయి. కానీ దాయాది పాకిస్తాన్ మాత్రం.. చైనా తీపిమాటలకు పడిపోయి, రుణ ఉచ్చులో చిక్కుకుంది.ఆ అప్పుడు ఇప్పుడు పాక్ కు గుదిబండలా మారాయి.
చైనా-పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్ (CPEC) పేరుతో చేపట్టిన ప్రాజెక్టుల కారణంగా ఇస్లామాబాద్‌పై ఏకంగా 30 బిలియన్ డాలర్ల రుణ భారం పడింది. ఇప్పటికే దివాలా అంచున ఉన్న పాక్ ఆర్థిక వ్యవస్థకు ఈ అప్పులు పెనుభారంగా పరణమించాయి.
చైనా తన ప్రతిష్ఠాత్మక ‘బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్’ (BRI) కింద పలు పేద, మధ్య ఆదాయ దేశాలకు మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల పేరుతో భారీగా రుణాలు ఇస్తుంది. అయితే, ఈ ప్రాజెక్టుల నుంచి ఆశించిన స్థాయిలో రాబడి రాకపోవడం, కరెన్సీ విలువ పడిపోవడం వంటి కారణాలతో ఆ దేశాలు అప్పులు తిరిగి చెల్లించలేక తీవ్ర ఒత్తిడికి గురవుతున్నాయి. శ్రీలంక, లావోస్, జాంబియా, మాల్దీవులు వంటి దేశాలు ఇప్పటికే చైనా ‘రుణ ఉచ్చు దౌత్యనీతి’ (Debt-Trap Diplomacy) కారణంగా తీవ్రంగా నష్టపోయాయి. ఈ దేశాల పరిస్థితిని కళ్లారా చూసినప్పటికీ, పాకిస్థాన్ మాత్రం రోడ్లు, రైల్వేల వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం సీపెక్ ప్రాజెక్టులను ఆశ్రయించింది. ఫలితంగా ఇప్పుడు ఆర్థికంగా చితికిపోయింది.
ప్రస్తుతం పాకిస్థాన్ తీవ్రమైన విదేశీ చెల్లింపుల సంక్షోభం, పడిపోతున్న విదేశీ మారక నిల్వలు, బలహీనమైన వృద్ధి రేటు, అధిక ద్రవ్యోల్బణం వంటి సమస్యలతో సతమతమవుతోంది. ఈ గండం నుంచి గట్టెక్కేందుకు అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) నుంచి 7 బిలియన్ డాలర్ల బెయిలవుట్ ప్యాకేజీ కోసం ప్రయత్నిస్తోంది. దీనికి చైనా, సౌదీ అరేబియా, యూఏఈ వంటి దేశాలు ఆర్థిక హామీలు ఇచ్చి తాత్కాలికంగా పాక్‌ను దివాలా తీయకుండా ఆదుకున్నాయి. అయినప్పటికీ, పాక్ విదేశీ అప్పుల్లో సింహభాగం సీపెక్ ప్రాజెక్టులకు సంబంధించిన చైనా సంస్థలవే కావడం గమనార్హం.
ఏమిటీ రుణ ఉచ్చు దౌత్యనీతి?
కొన్ని దేశాలకు ఉద్దేశపూర్వకంగా వాటి సామర్థ్యానికి మించి రుణాలు ఇచ్చి, అవి తిరిగి చెల్లించలేని స్థితికి చేరుకున్నప్పుడు ఆ దేశాల నుంచి వ్యూహాత్మక ప్రయోజనాలు పొందడాన్నే ‘రుణ ఉచ్చు దౌత్యనీతి’గా విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. దీనికి శ్రీలంకలోని హంబన్‌తోట పోర్టు ఉదంతం ప్రత్యక్ష ఉదాహరణ. వాణిజ్యపరంగా ఏమాత్రం లాభదాయకం కాని ఈ పోర్టు నిర్మాణం కోసం చైనా నుంచి భారీగా అప్పులు తీసుకున్న శ్రీలంక, వాటిని తీర్చలేకపోయింది. దీంతో ఆ పోర్టును 99 ఏళ్ల పాటు చైనా సంస్థకు లీజుకు ఇవ్వాల్సి వచ్చింది. దీనివల్ల శ్రీలంక ఒక కీలకమైన జాతీయ ఆస్తిపై సార్వభౌమాధికారాన్ని కోల్పోయింది.
ఇదే తరహాలో మాల్దీవులు, లావోస్, జాంబియా వంటి దేశాలు కూడా చైనా ప్రాజెక్టుల వల్ల ఆర్థికంగా చితికిపోయాయి. ఇప్పుడు ఆ జాబితాలో పాకిస్థాన్ కూడా చేరింది. దేశంలో నెలకొన్న రాజకీయ అస్థిరత, మందగించిన వృద్ధి రేటు, అంతర్జాతీయంగా ముడిసరుకుల ధరల పెరుగుదల వంటి అంశాలు పాకిస్థాన్ సంక్షోభాన్ని మరింత జఠిలం చేస్తున్నాయి. అభివృద్ధి పేరుతో చైనా వేసిన వలలో చిక్కుకున్న పాకిస్థాన్, ఇప్పుడు దాని నుంచి ఎలా బయటపడుతుందోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది.






