China: జనాభా పెరగాలంటే వాటిపై పన్నేయాలా చైనా..?
జనాభా సంక్షోభం కమ్యూనిస్ట్ చైనాను భయపెడుతోంది. దశాబ్దాలుగా జననాల రేటు కనిష్ట స్థాయికి చేరడంతో.. పిల్లల్ని కనండిరా బాబు అంటూ యువతను వేడుకుంటోంది. అయితే ఏక సంతానంలో ఉన్న హాయిని గుర్తించిన చైనీస్ యువత.. ఒక్కరు ముద్దు.. లేకుంటే హాయి అంటోంది. అసలు పెళ్లంటేనే ఆమడదూరం పరుగెడుతోంది. తమ కెరియర్.. వచ్చే వ్యక్తితో తన అనుబంధం ఎలా ఉంటుందో తెలియదు.. అంతేనా.. తమ స్వేచ్ఛను కోల్పోతామన్నది చైనాయువత భయం. ఇంకొకటి పిల్లల్ని కనడం సులభమే.. కానీ వారిని పెంచాలంటే లక్షలకు లక్షలు ఖర్చు పెట్టాలి. అందుకే చైనీస్ యువత పెళ్లి, పిల్లల వైపు ఫోకస్ పెట్టడం లేదు.
జనాభా సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు చైనా ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. మూడు దశాబ్దాలుగా పన్ను మినహాయింపు పొందుతున్న కండోమ్‌లపై 13 శాతం వ్యాట్ విధిస్తున్నట్లు ప్రకటించింది. గత మూడేళ్లుగా దేశంలో జననాల రేటు వరుసగా పడిపోతుండటంతో, ప్రజలను పిల్లలను కనేలా ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. ఒకప్పుడు ‘ఒకే బిడ్డ’ విధానాన్ని కఠినంగా అమలు చేసి, కుటుంబ నియంత్రణను ప్రోత్సహించిన చైనా.. ఇప్పుడు అందుకు పూర్తి విరుద్ధంగా వ్యవహరించడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
1993లో ‘ఒకే బిడ్డ’ విధానం అమల్లో ఉన్నప్పుడు కండోమ్‌లపై పన్నును తొలగించారు. ఇప్పుడు జనాభా తగ్గిపోతుండటంతో ఆ మినహాయింపును ఎత్తివేశారు. ఈ కొత్త పన్ను విధానం 2026 జనవరి 1 నుంచి అమల్లోకి రానుంది. మరోవైపు, పిల్లల సంరక్షణ కేంద్రాలు, వృద్ధాశ్రమాలు, వివాహ సంబంధిత సేవలపై వ్యాట్‌ను రద్దు చేసి, కుటుంబాలను ప్రోత్సహించే ప్రయత్నం చేస్తోంది.
అయితే, ప్రభుత్వ నిర్ణయంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చైనాలో ఒక బిడ్డను 18 ఏళ్ల వరకు పెంచడానికి సగటున 5.38 లక్షల యువాన్లు (సుమారు రూ. 63 లక్షలు) ఖర్చవుతుందని అంచనా. ఇంతటి భారీ వ్యయాన్ని భరించలేకే చాలామంది పిల్లలను కనడానికి ఇష్టపడటం లేదని, కండోమ్‌లపై పన్ను విధించడం వల్ల ప్రయోజనం ఉండదని యువత అభిప్రాయపడుతోంది.
ఈ విధానం వల్ల అవాంఛిత గర్భాలతో పాటు, హెచ్ఐవీ వంటి లైంగిక వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ‘కండోమ్ కొనలేని వారు పిల్లల్ని ఎలా పెంచుతారు?’ అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఈ చర్య కేవలం ప్రచారానికే తప్ప, అసలు సమస్యను పరిష్కరించదని పలువురు విమర్శిస్తున్నారు.






