Bihar: బీహార్‌లో ఎన్డీయే సునామీ వెనుక “పంచ సూత్ర”!
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో (Bihar Assembly Elections ) నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA) ఘన విజయం సాధించింది. దేశ రాజకీయాల్లో మరోసారి తమ బలాన్ని చాటుకుంది. విపక్ష మహాఘట్బంధన్ ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను సైతం పటాపంచలు చేస్తూ ఎన్డీయే భారీ మెజారిటీ కైవసం చేసుకుంది. అయితే ఎన్డీయే భారీ విజయం వెనుక అనేక కారమాలున్నాయి. కూటమికి దోహదపడిన ఐదు ప్రధాన కారణాలను విశ్లేషిద్దాం.
1. నరేంద్ర మోడీ ఫ్యాక్టర్
ఎన్డీయే విజయంలో అత్యంత కీలకమైన అంశం ప్రధాని నరేంద్ర మోడీ వ్యక్తిగత ఇమేజ్. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వ పథకాలు. రాష్ట్రస్థాయిలో నితీష్ కుమార్ నాయకత్వంపై కొంతమేర ప్రభుత్వ వ్యతిరేకత (Anti-Incumbency) ఉన్నప్పటికీ, మోడీ చరిష్మా దానిని అధిగమించడంలో సహాయపడింది. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన, జన్ ధన్ యోజన, ఉజ్వల యోజన వంటి కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందిన కోట్లాది మంది పేద, గ్రామీణ ఓటర్లు ఎన్డీయేకు స్థిరంగా మద్దతు ఇచ్చారు. బీహార్ ఎన్నికల్లో మోడీ ప్రచారానికి విశేష ఆదరణ లభించింది. ముఖ్యంగా ఆయన చేసిన జంగిల్ రాజ్ ప్రచారం సూపర్ సక్సెస్ అయింది.
2. మహిళా ఓటర్ల మద్దతు
బీహార్ రాజకీయాలను నిశితంగా పరిశీలిస్తే, 2005 నుండి మహిళా ఓటర్లు నితీష్ కుమార్ నాయకత్వానికి బలమైన మద్దతుగా నిలిచారు. ఈ ఎన్నికల్లో కూడా పురుషులతో పోలిస్తే మహిళా ఓటర్ల పోలింగ్ శాతం ఎక్కువగా నమోదైంది. మద్యపాన నిషేధం, సైకిల్ యోజన, పంచాయితీలలో మహిళలకు రిజర్వేషన్లు వంటి నితీష్ కుమార్ ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు మహిళల భద్రత, సాధికారతకు దోహదపడ్డాయి. నితీష్ కుమార్ ‘సుశాసన్ బాబు’ అనే ఇమేజ్ మహిళల్లో విశ్వాసం పెంచింది. శాంతిభద్రతల మెరుగుదల, మహిళలకు సురక్షితమైన వాతావరణం కల్పించడం వంటి అంశాలు వారికి ముఖ్యంగా అనిపించాయి. ఫలితంగా, మహిళా ఓటర్లు సంక్షేమం, భద్రత కోసం ఎన్డీయేకే మొగ్గు చూపారు.
3. సామాజిక సమీకరణాలు
బీహార్ ఎన్నికలంటేనే కుల సమీకరణాలు. కులాలే ఇక్కడ ప్రధాన భూమిక పోషిస్తాయి. మహాఘట్బంధన్ ముస్లిం-యాదవ్ ఓటు బ్యాంకుపై ఆధారపడింది. అయితే ఎన్డీయే కూటమి దానికంటే విస్తృతమైన సామాజిక పునాదికి స్కెచ్ వేసింది. నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ (JDU) తన ప్రధాన ఓటు బ్యాంకు అయిన కుర్మి, కోయిరీ (లవ్-కుష్) వర్గాలను ఆకట్టుకుంది. ఇక బీజేపీ అగ్ర కులాలైన బ్రాహ్మణులు, భూమిహార్లు, రాజ్‌పుత్‌ల నుండి మద్దతు సంపాదించింది. అంతేకాకుండా, అత్యంత వెనుకబడిన తరగతులు (EBC) నితీష్ కుమార్ ప్రభుత్వంతో పొందిన లబ్ధి కారణంగా ఎన్డీయే వైపు మొగ్గు చూపారు. ఈ బహుముఖ వ్యూహం మహాఘట్బంధన్ సమీకరణాలను సమర్థవంతంగా ఎదుర్కొంది.
4. ఆర్జేడీపై జంగల్ రాజ్ ఆందోళన
రాష్ట్రీయ జనతా దళ్ (RJD) నాయకుడు తేజస్వి యాదవ్ యువత నుండి అద్భుతమైన మద్దతు పొందింది. అయినా అతని పార్టీ గతంలో అధికారంలో ఉన్నప్పుడు నెలకొన్న జంగల్ రాజ్ జ్ఞాపకాలు ఇప్పటికీ బీహార్ ఓటర్లను కలవెరపెడుతూనే ఉన్నాయి. ముఖ్యంగా వృద్ధులు, మహిళా ఓటర్లలో ఈ ఆందోళన మరింత అధికంగా ఉంది. ఎన్నికల ప్రచారంలో ఎన్డీయే కూటమి పదేపదే ఆర్జేడీ పాలనలోని శాంతిభద్రతల సమస్యలను, దొంగతనాలను, దోపిడీలను, అవినీతిని ప్రస్తావించింది. తద్వారా ప్రజల్లో ముఖ్యంగా నితీష్ కుమార్ పరిపాలనలో శాంతిభద్రతలు మెరుగయ్యాయని భావించేవారిలో అపనమ్మకాన్ని సృష్టించగలిగింది.
5. విపక్ష కూటమి (INDIA)లో సమన్వయ లోపం
ఎన్డీయే బలానికి మించి, ప్రతిపక్ష మహాఘట్బంధన్ అంతర్గత విభేదాలు, సంస్థాగత లోపాల వల్ల బాగా దెబ్బతింది. కాంగ్రెస్, ఆర్జేడీ, వామపక్షాల మధ్య సీట్ల పంపకం చాలా ఆలస్యమైంది. ఆ తర్వాత కూడా సఖ్యత కుదరలేదు. చాలా చోట్ల స్నేహపూర్వక పోటీ ఏర్పడింది. ఇండియా కూటమి ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ చరిష్మాపైనే ఎక్కువగా ఆధారపడింది. కానీ అది వర్కవుట్ కాలేదు.
మొత్తంగా బీహార్ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి చరిత్ర తిరగరాసింది. మోడీ చరిష్మా, నితీశ్ కుమార్ సంక్షేమ పథకాలు, సామాజిక సమీకరణాలు, మహిళా ఓటర్ల మద్దతు లాంటివి ఆ కూటమి ఘనవిజయానికి కారణమయ్యాయి. విపక్షాలపై నెలకొన్న పాత భయాలు ఎన్డీయేకు కలిసి వచ్చాయి.






