Bihar: బిహార్ ఎన్డీఏదే.. విపక్ష కూటమికి మళ్లీ నిరాశే..!
బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అప్రతిహతంగా దూసుకెళ్తోంది. మెజారిటీ మార్క్‌ను దాటి అత్యధికసీట్లలో లీడింగ్ లో కొనసాగుతోంది.. 243 స్థానాలకు జరుగుతున్న లెక్కింపులో మొదటి నుంచి బీజేపీ, జేడీయూ ఆధిక్యంలో కొనసాగుతున్నాయి.. ఈ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా బీజేపీ నిలిచింది.. ప్రస్తుత ట్రెండ్స్ ప్రకారం.. NDA (బీజేపీ- జేడీయూ) 169 స్థానాల్లో, మహా కూటమి (ఆర్జేడీ-కాంగ్రెస్) 70 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి.. ప్రశాంత్ కిషోర్ పార్టీ జన్ సూరజ్ పార్టీ పెద్దగా ప్రభావం చూపలేదు.. కేవలం 1 స్థానంలో మాత్రమే ఆధిక్యంలో ఉంది.అసదుద్దీన్ ఒవైసీ పార్టీ AIMIM బలరాంపూర్‌లో ఆధిక్యంలో ఉంది.
అన్ని రీజియన్లలోనూ NDA కూటమి హవా నడుస్తోంది.. 70 సీట్ల దిగువకు మహాఘట్బంధన్ పడిపోయింది.. ఈ ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ పార్టీ ప్రభావం చూపించలేదు.. ముస్లింల ప్రాబల్యం ఉన్న సీమాంచల్‌లో కూడా NDA హవా నడుస్తోంది. NDA కూటమికి సీమాంచల్‌లో 25 సీట్లు, MGBకి 12 సీట్లు ఆధిక్యంలో ఉన్నాయి.. సీమాంచల్‌లో మజ్లిస్ కూడా పెద్దగా ప్రభావం చూపించలేదు..
రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) మహాఘటబంధన్ తో పొత్తు పెట్టుకుని 61 స్థానాల్లో పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ కేవలం 10 స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో ఉంది. గత ఎన్నికల్లో గెలిచిన దానికంటే ఎనిమిది స్థానాలు తక్కువ. తేజస్వి యాదవ్ నేతృత్వంలోని ఆర్జేడీ 143 స్థానాలకు గానూ 52 స్థానాల్లో, సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ 20 స్థానాల్లో మూడు స్థానాల్లో, సీపీఐ తొమ్మిది స్థానాల్లో ఒక స్థానంలో ఆధిక్యంలో ఉన్నాయి. 12 స్థానాల్లో పోటీ చేస్తున్న వికాశీల్ ఇన్సాన్ పార్టీ (వీఐపీ) ఒక స్థానంలో మాత్రమే ఆధిక్యంలో ఉంది.
243 మంది సభ్యులున్న బీహార్ అసెంబ్లీకి నవంబర్ 6 – 11 తేదీల్లో రెండు దశల్లో పోలింగ్ జరిగింది. చారిత్రాత్మకంగా 67.13 శాతం ఓటింగ్ నమోదైంది. మొత్తం 7.45 కోట్ల మంది ఓటర్లు 2,616 మంది అభ్యర్థుల విధిని నిర్ణయించడానికి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.






