Hasina: హసీనాను అప్పగించాలంటున్న బంగ్లాదేశ్.. భారత్ ఏం చేయనుంది..?
మానవత్వాన్ని మరచి తీవ్ర నేరాలకు పాల్పడ్డారన్న కేసులో మాజీ ప్రధాని షేక్ హసీనాకు బంగ్లాదేశ్ లోని ఐసీటీ మరణశిక్ష విధించింది. ఈ క్రమంలోనే ఆమెను తమకు అప్పగించాలని యూనస్ ప్రభుత్వం ..భారత్ ను డిమాండ్ చేస్తోంది. మరి హసీనాను (Sheikh Hasina) భారత్ అప్పగిస్తుందా? లేదా ఆ దేశ అభ్యర్థనను తోసిపుచ్చుతుందా? అన్న విషయం ఆసక్తిగా మారింది. ఈ నేపథ్యంలో అసలు ఇరు దేశాల మధ్య ఒప్పందంలోని నిబంధనలు ఏం చెబుతున్నాయో పరిశీలిద్దాం.
సరిహద్దులో చొరబాట్లు, ఉగ్రవాద సమస్యను ఎదుర్కొనేందుకు భారత్, బంగ్లాదేశ్‌లు 2013లో అప్పగింత ఒప్పందంపై సంతకాలు చేశాయి. దేశం విడిచి పారిపోయిన వారిని అప్పగించేందుకు వీలుగా 2016లో ఇందులో సవరణలు చేశాయి. 1971 విమోచన యుద్ధానికి సంబంధించిన కేసుల పరిష్కారం దృష్ట్యా బంగ్లాదేశ్.. సరిహద్దులో దాక్కున్న యూఎల్ఎఫ్ఏ వేర్పాటువాదులను తిరిగి రప్పించే ఉద్దేశంతో భారత్.. ఈ ఒప్పందం చేసుకున్నాయి. కానీ, ప్రస్తుతం హసీనా కేసు మాత్రం వీటికి భిన్నంగా కనిపిస్తోంది.
అభియోగాలు నమోదు కావడం, నిందితుడిగా ఉండటం లేదా దోషిగా తేలిన సందర్భంలో.. సంబంధిత వ్యక్తుల అప్పగింతకు విజ్ఞప్తి చేయాలని ఒప్పందం స్పష్టంగా చెబుతోంది. హసీనా కేసులో బంగ్లాదేశ్ ఐసీటీ (International Crimes Tribunal) అరెస్టు వారెంట్ జారీ చేసినందున అక్కడి చట్టాల ప్రకారం ఆమెను అప్పగించాలన్న విజ్ఞప్తి విధానపరమైన షరతుకు లోబడే ఉన్నట్లు. అయితే, ఎవరినైనా అప్పగించాలంటే ద్వంద్వ నేర సూత్రం పరిధిలో ఉండాలని ఒప్పందంలోని పలు నిబంధనలు చెబుతున్నాయి. అంటే.. ఆ నేరం అనేది ఇరుదేశాల చట్టాల ప్రకారం శిక్షార్హమైనదిగా ఉండాలి. మానవత్వాన్ని మరచి తీవ్ర నేరాలకు పాల్పడటం అనేది బంగ్లాదేశ్ చట్టాల ప్రకారం శిక్షార్హమైనవి. భారత్ మాత్రం ఇటువంటి వాటిని భిన్న కోణంలో చూస్తుంది. దీంతో హసీనాపై మోపిన అభియోగాలు ఇక్కడి చట్టాల ప్రకారం.. ఆమెను అప్పగించేందుకు చెల్లవని భారత్ వాదించే అవకాశం ఉందని తెలుస్తోంది.
అప్పగింతకు సంబంధించి ఒప్పందంలో కొన్ని మినహాయింపులు కూడా ఉన్నాయి. ఆరోపించిన నేరాల విషయంలో రాజకీయ కోణం ఉందని భావిస్తే ఆ విజ్ఞప్తిని తిరస్కరించే అవకాశం ఉంది. న్యాయం చేసే ఉద్దేశం లేకపోవడం, దురుద్దేశాలతో అప్పగింత విజ్ఞప్తి చేసినట్లు భావించినా.. తిరస్కరించేందుకు వీలుంది. ఇందుకు సంబంధించి నిబంధనలు ఒప్పందంలో స్పష్టంగా ఉన్నాయి.
ప్రస్తుతం యూనస్ ప్రభుత్వానికి హసీనా రాజకీయ విరోధి అయినందున.. ఇవి రాజకీయ ప్రేరేపితమని వాదించేందుకు భారత్‌కు అవకాశం ఉంది. మొత్తంగా ఏ విధంగా చూసినా.. హసీనాను భారత్ అంత తేలికగా అప్పగించే సూచనలు కనిపించడం లేదని విశ్లేషకుల అంచనా. ఇది ద్వైపాక్షిక ఒప్పందం అయినందున ఈ వివాదాలను ఇరుదేశాలే పరిష్కరించుకోవాల్సి ఉంటుంది.






