చైనా వలలో మాల్దీవులు…
మాల్దీవులను చేరదీసేందుకు దశాబ్దాల నుంచి చైనా చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. భారత్ కు అత్యంత సమీపంలో ఉండడంతో ఈ ద్వీపదేశంతో చెలిమి చేస్తూ.. భారత్ ను ముత్యాలసరాలు వ్యూహంలో అష్టదిగ్భందనం చేయాలని ప్రయత్నిస్తోంది చైనా. ప్రస్తుత అధ్యక్షుడు ముయిజ్జు… చైనా అనుకూలురుగా పేరుంది. గత ఎన్నికలకు ముందు దేశంలో భారత ప్రాధాన్యం పెరుగుతోందని, తాము అధికారంలోకి వస్తే.. ఆదేశాన్ని దూరంగా ఉంచుతామని విస్తృతంగా ప్రచారం చేశారు ముయిజ్జు . అంతేకాదు.. అధికారంలోకి వచ్చిన వెంటనే భారత బలగాలను ఆదేశానికి తిప్పి పంపుతామని ప్రజలకు హామీ ఇచ్చారు.
అధికారం రావడంతోనే భారత దళాలు మార్చి 15 నాటికి తిరిగి వెనక్కు వెళ్లాలంటూ అల్టిమేటం జారీ చేశారు మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జు. అయితే తాము నెలకొల్పిన టెక్నికల్ సామాగ్రి నిర్వహణకు.. పౌర దుస్తుల్లో సాంకేతిక సిబ్బందిని నియమిస్తామని భారత్ ప్రతిపాదించింది. దీనికి తొలుత అంగీకారం తెలిపిన ముయిజ్జు సర్కార్… తర్వాత అది కూడా వద్దంది. ఇప్పుడు..హైడ్రోగ్రాఫిక్ సర్వేలు నిర్వహించే విషయంలో భారత్తో ఒప్పందాన్ని పునరుద్ధరించబోమని మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జు ప్రకటించారు. సొంతంగానే హైడ్రోగ్రాఫిక్ సర్వేలు చేపట్టేందుకు అవసరమైన యంత్రపరికరాలు, సౌకర్యాలు సమకూర్చుకునేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు.
తమదేశ ప్రత్యేక ఆర్థిక మండలి ప్రాంతం చాలా విశాలంగా ఉన్నప్పటికీ దానిపై నియంత్రణ కోసం మాల్దీవుల జలాల్లో నిరంతర పర్యవేక్షణ వ్యవస్థను ఈనెలలో ఏర్పాటు చేసేందుకు తమ దేశం ప్రయత్నిస్తోందని ముయిజ్జు చెప్పారు. ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకునేందుకు చైనా నుంచి ఉచితంగా సైనిక సాయం పొందడానికి ఇరుదేశాల మధ్య రక్షణ ఒప్పందం కుదిరిన కొన్ని రోజులకే ముయిజ్జు ఈ ప్రకటన చేశారు. ఇందులో భాగంగా బాష్పవాయుగోళాలు, పెప్పర్ స్ప్రే వంటి సాదారణ అస్త్రాలను ఉచితంగా అందించనుంది.






