US-India: భారత్ తో బైడెన్ అలా.. ట్రంప్ ఇలా..?
అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden)..రష్యాకు బద్ద వ్యతిరేకి. ఆయన హయాంలో రష్యాకు వ్యతిరేకంగా అమెరికా చాలా చర్యలు తీసుకుంది. రష్యాను ప్రపంచదేశాల్లో ఒంటరి చేయడానికి అన్నిరకాల ప్రయత్నాలు చేశారు. అంతేకాదు.. పుతిన్ తో చర్చించేందుకు కూడా ఆయన పెద్దగా ఇష్టపడలేదు. ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేందుకు .. క్రెమ్లిన్ తో చర్చలు సరికాదని భావించిన బైడన్.. ఉక్రెయిన్ ను బలపరిచేవారు. . యూరోపియన్ దేశాలను కలుపుకుంటూ.. రష్యాకు వ్యతిరేకంగా ఒత్తిడి పెంచారు కూడా.
మరోవైపు రష్యాను తీవ్రంగా వ్యతిరేకించే బైడన్.. భారత్- రష్యా సంబంధాలు, భారత్ తో తమ బంధాన్ని అడ్డుగా భావించలేదు. ఓ వైపు భారత్, రష్యాతో కలిసి ముందుకెళ్తున్నా… ఆసియాలో చైనాను ఎదుర్కోవడానికి భారత్ చాలా అవసరమని బైడన్ భావించారు. దీంతో ఎవరి ద్వైపాక్షిక బంధం వారిది.. అయితే అవసరమైనప్పుడు కలిసి సాగాలన్నది బైడన్ సర్కార్ భావనగా కనిపిస్తోంది. అంతేకాదు.. ట్రంప్ సర్కార్.. భారత్ పై ఆంక్షలు విధించినప్పుడు కూడా బైడన్ సర్కార్ లో కీలక అధికార యంత్రాంగం బాధ్యతలు నిర్వర్తించిన వారు.. ఇది సరైంది కాదు. భారత్ ను దూరం చేసుకోవద్దని ట్రంప్ యంత్రాంగానికి సూచించారు.
ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. రష్యాకు అత్యంత అనుకూలుడైన వ్యక్తిగా భావించవచ్చు. ఈయన ఎప్పుడు కావాలంటే అప్పుడు నేరుగా రష్యా అధ్యక్షుడు పుతిన్ తో సంభాషిస్తారు. ఓవైపు రష్యాను ఆర్థికపరంగా దెబ్బతీస్తునే.. మరోవైపు శాంతి చర్చలకు ఒప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే అదే సమయంలో భారత్.. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తుందన్న కారణంతో.. ఢిల్లీపై టారిఫ్ బాదుడు బాదారు. దీన్ని చాలావరకూ నేతలు వ్యతిరేకించినా.. ట్రంప్ మాత్రం తాను అనుకున్న విధానంలోనే ముందుకు సాగుతున్నారు.
రష్యా నుంచి చమురు కొంటున్నందుకు భారతదేశాన్ని శిక్షించినప్పటికీ, రష్యా నుంచి హైడ్రోకార్బన్లు, ఖనిజాలను పొందాలని ట్రంప్ కోరుకుంటున్నారు. ట్రంప్ శాంతి దౌత్యంలో రష్యాతో వ్యాపార అవకాశాలను విస్తరించడం, యుక్రెయిన్ నుంచి సహజ వనరులకు యాక్సెస్ పొందడం అనే ఆశయాలు ఉన్నాయి
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగింపులో భారత్ తమవైపు ఉండాలన్నది ట్రంప్ భావనగా తెలుస్తోంది.అయితే భారత్ మాత్రం తన చిరకాల మితృత్వాన్ని కొనసాగిస్తూనే..అమెరికాతో సంబంధాలను బలోపేతం చేసుకునేదిశగా ప్రయత్నాలు చేసింది. ట్రంప్ తో మోడీ అత్యంత మితృత్వాన్ని ప్రదర్శించారు. అయితే స్నేహం..స్నేహమే.. టారిఫ్ టారిఫే అన్నట్లుగా ట్రంప్ ముందుకు సాగారు. దీనికి తోడు మిత్రదేశాలైన యూరోపియన్ దేశాలపైనా.. టారిఫ్ బాదుడు బాదేశారు. దీంతో వారు సైతం .. అమెరికాకు గతంలో ఉన్నంత స్నేహంగా, విధేయులుగా ఉండడం తగ్గించేశారు. ఫలితంగా ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు అమెరికాకు.. గతంలో మాదిరి సానుకూలత కనిపించడం లేదు.






