Legislative Vs Judiciary: చట్టసభలు vs న్యాయస్థానాలు – ఎవరిది పైచేయి?
భారత రాజ్యాంగం శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థల మధ్య అధికారాలను స్పష్టంగా విభజించింది. ఒకరి పరిధిలో మరొకరు జోక్యం చేసుకోకూడదన్నది మౌలిక సూత్రం. దీనినే మనం ‘లక్ష్మణ రేఖ’గా చెప్పుకుంటున్నాం. అయితే, ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో నెలకొన్న పరిణామాలు ఈ రేఖను ప్రశ్నార్థకం చేస్తున్నాయి. ప్రజాస్వామ్య పరిరక్షణ పేరుతో న్యాయస్థానాలు విధించే గడువులను, తమకున్న ‘విచక్షణాధికారం’ పేరుతో చట్టసభల అధిపతులు వ్యవహరిస్తున్న తీరు ఒక అంతులేని రాజ్యాంగ ప్రతిష్టంభనకు దారితీస్తోంది.
ప్రస్తుతం ఈ ఘర్షణకు కేంద్ర బిందువు ‘ఫిరాయింపుల నిరోధక చట్టం’ (Anti-Defection Law) అమలు. తెలంగాణలో బీఆర్ఎస్ టికెట్‌పై గెలిచిన పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరిపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ దాఖలు చేసిన పిటిషన్లపై స్పీకర్ నిర్ణయం తీసుకోకుండా జాప్యం చేస్తున్నారు. స్పీకర్ తీరును ప్రశ్నిస్తూ సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని, నిర్ణీత గడువులోగా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. అయినా, స్పీకర్ గడువు పొడిగింపు కోరడం, పండుగలు, ఇతర కారణాలను చూపడం గమనార్హం.
మరోవైపు, ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉన్నా, ఫలితం ఒక్కటే. వైసీపీ ఎమ్మెల్సీలు తమ పదవులకు రాజీనామా చేసినా, శాసనమండలి ఛైర్మన్ మోషేన్ రాజు వాటిని ఆమోదించకుండా పెండింగ్‌లో ఉంచారు. దీనిపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ 4 వారాల్లో నిర్ణయం తీసుకోవాలని డెడ్ లైన్ విధించింది.
రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ప్రకారం ఫిరాయింపుల విషయంలో నిర్ణయం తీసుకునే సర్వాధికారం స్పీకర్ లేదా చైర్మన్‌దే. ఇక్కడే అసలు సమస్య తలెత్తుతోంది.
1.కాలపరిమితి లేకపోవడం: రాజ్యాంగం స్పీకర్ నిర్ణయానికి కచ్చితమైన కాలపరిమితిని (Time Frame) నిర్దేశించలేదు. దీన్ని ఆసరాగా చేసుకుని, ఆయా పార్టీలకు అనుకూలంగా స్పీకర్లు నిర్ణయాలను సంవత్సరాల తరబడి నాన్చుతున్నారు.
2.రాజకీయ పక్షపాతం: స్పీకర్ పదవి రాజ్యాంగబద్ధమైనదే అయినా, వారు ఏదో ఒక పార్టీకి చెందినవారే. పదవిలో ఉన్నప్పుడు పార్టీకి రాజీనామా చేసే సంప్రదాయం భారత్‌లో లేదు. దీంతో సహజంగానే వారి నిర్ణయాలు అధికార పార్టీకి లబ్ధి చేకూర్చేలా ఉంటున్నాయి.
1992 నాటి ‘కిహోటో హోలోహాన్’ (Kihoto Hollohan) కేసులో సుప్రీంకోర్టు ఒక చారిత్రక తీర్పునిచ్చింది. స్పీకర్ నిర్ణయం తీసుకునే వరకు కోర్టులు జోక్యం చేసుకోకూడదని, నిర్ణయం వెలువడ్డాక మాత్రమే అది న్యాయ సమీక్షకు (Judicial Review) వస్తుందని చెప్పింది. ఇదే ఇప్పుడు స్పీకర్లకు కవచంగా మారింది. నిర్ణయం తీసుకోకుండా తాత్సారం చేయడం ద్వారా న్యాయస్థానాల పరిధిలోకి వెళ్లకుండా వారు తప్పించుకుంటున్నారు. కానీ, మణిపూర్ కేసులో స్పీకర్లు నిర్ణయం తీసుకోవడానికి సహేతుకమైన సమయం అంటే సాధారణంగా 3 నెలలు పాటించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయినా, స్పీకర్లు కోర్టు ఆదేశాలను ఖాతరు చేయడం లేదు. “స్పీకర్‌ను ఆదేశించే అధికారం కోర్టుకు లేదు” అనే వాదనతో రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తున్నారు.
చట్టసభల ప్రొసీడింగ్స్‌లో కోర్టులు జోక్యం చేసుకోకూడదని ఆర్టికల్ 212 చెబుతోంది. కానీ, ఉద్దేశపూర్వకంగా రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ, ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నప్పుడు కోర్టులు మౌనంగా ఉండాలా? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. స్పీకర్ల జాప్యం వల్ల ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఐదేళ్ల పదవీకాలాన్ని, మంత్రి పదవులను అనుభవిస్తున్నారు. ఇది ప్రజా తీర్పును అపహాస్యం చేయడమే. ఒకవేళ కోర్టులు స్పీకర్ అధికారాల్లో అతిగా జోక్యం చేసుకుంటే, భవిష్యత్తులో పార్లమెంటరీ వ్యవస్థకు, న్యాయ వ్యవస్థకు మధ్య ఆధిపత్య పోరు తీవ్రమై వ్యవస్థలు కుప్పకూలే ప్రమాదం ఉంది.
ప్రస్తుత పరిస్థితుల్లో రాజ్యాంగ పరిరక్షణ జరగాలంటే ఆ ‘సన్నని గీత’ను దాటి ఆలోచించక తప్పదు. చట్టసభల అధిపతులు తమ విచక్షణాధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నప్పుడు, న్యాయస్థానాలు కేవలం ప్రేక్షకుల్లా మిగిలిపోకూడదు. దీనికి శాశ్వత పరిష్కారం స్పీకర్ చేతిలో ఉన్న అనర్హత వేటు అధికారాన్ని తొలగించి, ఒక ‘స్వతంత్ర ట్రిబ్యునల్’ (Independent Tribunal)కు అప్పగించడమే అని న్యాయ నిపుణులు సూచిస్తున్నారు. అప్పుడే లక్ష్మణ రేఖకు అర్థం, రాజ్యాంగానికి పరమార్థం దక్కుతాయి.






