Kerala: కేరళ నేర్పుతున్న పాఠాలు!
కేరళను (Kerala) గాడ్స్ ఓన్ కంట్రీ అని పిలుచుకుంటూ ఉంటాం. ప్రకృతి అందాలకు, పర్యాటక ప్రదేశాలకు కేరళ ప్రసిద్ధి. అదే సమయంలో కేరళ సమాజికంగా, ఆర్థికంగా, అభివృద్ధిపరంగా అనేక అంశాల్లో మిగిలిన రాష్ట్రాలతో పోల్చితే చాలా ముందుంటుంది. మన దేశంలో సంపూర్ణ అక్షరాస్యత సాధించిన రాష్ట్రం కేరళయే.! ఇప్పుడు పేదరికాన్ని సంపూర్ణంగా నిర్మూలించిన రాష్ట్రంగా నిలిచి చరిత్ర సృష్టించింది. ఈ నేపథ్యంలో సామాజిక, అభివృద్ధి రంగాల్లో కేరళ సాధించిన విజయాలపై సర్వత్రా చర్చ జరుగుతోంది. కేరళ ఏ ఏ అంశాల్లో మిగిలిన వాటికి అందనంత దూరంలో ఉందో తెలుసుకుందాం.
1. సంపూర్ణ అక్షరాస్యత
కేరళ భారతదేశంలో సంపూర్ణ అక్షరాస్యతను (100% Literacy) సాధించిన మొట్టమొదటి రాష్ట్రంగా రికార్డు సృష్టించింది. విద్య, అక్షరాస్యతకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా కేరళ దేశానికి ఆదర్శంగా నిలిచింది. అక్షరాస్యత విషయంలో కేరళ ఎప్పుడూ జాతీయ సగటు కంటే ముందుంటుంది.
2. అత్యంత పేదరిక నిర్మూలన (Elimination of Extreme Poverty)
తాజాగా కేరళ రాష్ట్రం దేశంలో అత్యంత పేదరికాన్ని (Extreme Poverty) పూర్తిగా నిర్మూలించిన మొట్టమొదటి రాష్ట్రంగా నిలిచింది. నవంబర్ 1న కేరళ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. 2021లో ప్రారంభించిన ఈ కార్యక్రమం ద్వారా, రాష్ట్రవ్యాప్తంగా గుర్తించిన 64,006 అత్యంత నిరుపేద కుటుంబాలను లక్ష్యంగా చేసుకుని ప్రత్యేక ప్రణాళికలు అమలు చేశారు. ఆహారం, ఆరోగ్యం, జీవనోపాధి, గృహ నిర్మాణం వంటి నాలుగు ప్రధాన అంశాల ఆధారంగా ఈ కుటుంబాలకు సహాయం అందించారు.
3. డిజిటల్ అక్షరాస్యత (Digital Literacy)
కేరళ వంద శాతం డిజిటల్ అక్షరాస్యతను సాధించిన తొలి రాష్ట్రంగా కూడా గుర్తింపు పొందింది. 14 ఏళ్ల వయస్సు నుండి వందేళ్లు పైబడిన వారు కూడా డిజిటల్ అక్షరాస్యులుగా మారడం ఈ ఘనతలో భాగం.
4. మెరుగైన ఆరోగ్య సూచీలు (Better Health Indicators)
కేరళ బలమైన ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను కలిగి ఉంది. అభివృద్ధి చెందిన దేశాలతో పోల్చదగిన ఆరోగ్య సూచీలలో అద్భుతమైన రికార్డును సొంతం చేసుకుంది. కేరళలో శిశు మరణాల రేటు దేశంలోనే అత్యంత తక్కువగా ఉంది. అంతేకాక ఇక్కడి ప్రజల ఆయుర్దాయం (Life Expectancy) దేశంలోనే అత్యధికంగా ఉంది.
5. సుపరిపాలన – అభివృద్ధి (Good Governance and Development)
వివిధ రంగాలలో కేరళ అనేక అద్భుతాలు సాధించింది. అందుకే ‘కేరళ మోడల్’గా చాలా రాష్ట్రాలు వీటిని ్మలు చేస్తుంటాయి. నీతి ఆయోగ్ విడుదల చేసిన సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సూచీలో కేరళ అగ్రగామి రాష్ట్రాల్లో ఒకటిగా నిలిచింది. పబ్లిక్ అఫైర్స్ సెంటర్ (PAC) నివేదిక ప్రకారం, కేరళ వరుసగా కొన్నేళ్లపాటు ఉత్తమ పాలన అందించే రాష్ట్రంగా గుర్తింపు పొందింది. అవినీతి తక్కువగా ఉన్న రాష్ట్రాలలో కేరళ ఒకటిగా ఉంది.
ఇలా కేరళ అనేక అంశాల్లో మిగిలన రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోంది. అయితే తక్కువ జనసాంద్రత కలిగిఉండడం, అక్షరాస్యులు ఎక్కువగా ఉండడంతో ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు ఇక్కడ సత్ఫలితాలిస్తున్నాయి.







