Islamabad: పహల్గాం ఎఫెక్ట్.. గ్రీన్ పాకిస్తాన్ కథ ముగిసింది..

పహల్గాంపై ఉగ్రదాడికి తగిన శిక్ష తప్పదంటూ ప్రధాని మోడీ హెచ్చరికలతో పాకిస్తాన్ వణుకుతోంది.పాక్ జీవనాడి సింధూ(Sindhu river) జలాలను నిలిపివేస్తామని హెచ్చరించడంతో.. ఆ జలాలపై ఆధారపడిన లక్షలాదిమంది రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడు అక్కడి జనం ఓట్లపై ఆధారపడిన పార్టీల్లోనూ వణుకు ప్రారంభమైంది. దీంతో ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలో అర్థం కాక పాకిస్తాన్ సతమతమవుతోంది. ఈ పరిస్థితుల్లో పాకిస్తాన్ చేపడుతున్న గ్రీన్ పాకిస్తాన్ ప్రాజెక్టు కాస్తా అటకెక్కింది.
దాదాపు రెండేళ్ల క్రితం పాకిస్థాన్ ఆర్మీచీఫ్ ఆసీమ్ మునీర్, పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌లు చోలిస్థాన్(cholistan) ఎడారిలో ‘గ్రీన్ పాకిస్థాన్ ఇనీషియేటీవ్’ (GPI) ప్రాజెక్టును ఆర్భాటంగా ప్రారంభించారు. దీనికి సుమారు 3.3 బిలియన్ డాలర్ల బడ్జెట్‌ను సిద్ధం చేశారు. చోలిస్థాన్ కెనాల్ ప్రాజెక్టు చేపట్టి.. సింధూ ప్రవాహ నీటిని ఎడారిలోకి మళ్లించేలా ఆరు కాల్వలు నిర్మించాలన్నది లక్ష్యం. దీంతో దాదాపు 12 లక్షల ఎకరాల సాగుభూమిని అందుబాటులోకి తీసుకురావాలని ఆశించారు. ముఖ్యంగా దక్షిణ పంజాబ్ (పాక్‌లోని) అదనపు భూమిని కూడా సాగు చేయాలని భావించారు.
అంతర్జాతీయ చెల్లింపులు చేయడానికి డబ్బుల్లేకుండా ఇబ్బందులు పడుతున్న సమయంలో.. పాకిస్థాన్ 9 బిలియన్ డాలర్ల ఆహారాన్ని దిగుమతి చేసుకోవాల్సి వచ్చింది. జీపీఐను పూర్తి చేయగలిగితే ఈ చెల్లింపుల భారం తగ్గిపోతుందన్నది దాని ఆలోచన. ఈ ప్రాజెక్టును కూడా సైన్యానికి చెందిన ‘గ్రీన్ పాకిస్థాన్ కార్పొరేట్ ఇనీషియేటీవ్’ అనే సంస్థకు కట్టబెట్టారు. ఈ ప్రాజెక్టును ఫిబ్రవరిలో ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్, పంజాబ్ సీఎం మరియం నవాజ్ ఆర్భాటంగా ప్రారంభించారు. ఈ ప్రాజెక్టును ప్రకటించగానే.. పాకిస్థాన్‌లో సింధూ రాష్ట్రంలో అలజడి రేగింది. ప్రజలు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేపట్టారు. డిసెంబర్ 18వ తేదీన సింధ్ తరాఖీ పసంద్ పార్టీ భారీ సమ్మెను నిర్వహించింది. భౌగోళికంగా సింధూ జలాలు తొలుత పంజాబ్‌లోకి ప్రవేశించి.. ఆ తర్వాత సింధ్ ప్రాంతానికి చేరతాయి. ఈక్రమంలో పంజాబ్‌లోనే అత్యధికంగా నీళ్లు వాడేసుకొని.. దిగువకు అసలు వదలడం లేదన్నది వారి ఫిర్యాదు.
వాస్తవానికి సింధ్ రాష్ట్రంలో 1871 నుంచి వరుసగా కరవు రావడంతో అక్కడి ప్రజలు నీటి విషయంలో ఆందోళనలో ఉన్నారు. 1999-2002 వరకు ఏకధాటిగా ఇక్కడ కరవు నెలకొంది. 14లక్షల మంది ప్రజలు, 56 లక్షల పశువులు, 1.2 కోట్ల ఎకరాలపై ఇది దుష్ప్రభావం చూపింది. ఈనేపథ్యంలో వీరికి సింధూ జలాలు అత్యంత కీలకం.
1970 వరకు ఈ రాష్ట్రానికి సింధూ జలాల్లో 70శాతం యాజమాన్య హక్కు ఉండేది. కానీ, 1991లో దానిని 40శాతానికి కుదించేసి.. పంజాబ్‌కు పంచారు. 1999-2023 వరకు సింధ్ 40శాతం కొరత ఎదుర్కోగా.. పంజాబ్ కేవలం 15శాతం మాత్రమే చవిచూసింది. నీటి పంపిణీలో తమకు అన్యాయం జరిగిందని సింధ్ ఇరిగేషన్ చీఫ్ ఇంజినీర్ జారిఫ్ ఖెరో వాపోయారు. ఇక 2024 ఏప్రిల్-మే మధ్య రాష్ట్రానికి 4.645 మిలియన్ ఎకర్ ఫీట్ నీటిని కేటాయించగా.. కేవలం 3.560 మిలియన్ ఎకర్ ఫీట్ నీటిని మాత్రమే వాడుకోగలిగింది. దీనిలో కూడా 23 శాతం అందలేదు.
ప్రస్తుతం సింధ్‌లో 82 లక్షల ఎకరాలు మాత్రమే సాగుచేస్తుండగా.. ఇంకా 1.8 కోట్ల ఎకరాలకు నీరు సరిపోవడం లేదు. అదే పంజాబ్‌లో 3 కోట్ల ఎకరాలు సాగులో ఉన్నాయి. ఇక చోలిస్థాన్ కెనాల్ ప్రాజెక్టు వస్తే.. సింధ్ గొంతు ఎండటం ఖాయం. దీనివల్ల మరో 1.2 కోట్ల ఎకరాలు తీవ్రంగా దెబ్బతింటాయి. పాక్ పంజాబ్‌లో మాత్రం 12 లక్షల ఎకరాలు అదనంగా సాగులోకి వస్తాయి.
ఇప్పటికే ఇమ్రాన్ ఖాన్‌ను జైల్లో వేయడంతో దేశవ్యాప్తంగా ఓ వర్గం పాక్ పాలకులపై గుర్రుగా ఉంది. దీనికితోడు బలోచిస్థాన్, ఖైబర్ ప్రావిన్స్‌లో వేర్పాటువాదులు చెలరేగిపోతున్నారు. ఇదే సమయంలో భారత్ సింధు జలాల ఒప్పందంను పక్కనపెట్టినట్లు ప్రకటించింది. దీంతో సింధ్ రాష్ట్రంలో మరింత ఆందోళనలు మొదలయ్యాయి. భారత్ నీరు ఇవ్వక.. వచ్చే జలాలను పంజాబ్‌కు రానీయకపోతే తమ పరిస్థితి ఏమిటన్నది వారి ప్రధాన ఆందోళన. భారత్ నిర్ణయం షరీఫ్‌ల పీఎంఎల్ ఎన్, భుట్టోల పీపీపీ పార్టీల మధ్య వివాదాలకు కూడా కారణమవుతోంది. దీంతో ఇరువురు నేతలు కలిసి చోలిస్థాన్ ప్రాజెక్టును రద్దు చేయాలని నిర్ణయించారు. ఫలితంగా గ్రీన్ పాకిస్థాన్ కథ ముగిసింది.