సర్వేలను నమ్మొచ్చా..? వాటిలో వాస్తవమెంత..?

సార్వత్రిక ఎన్నికల ఫలితాలకోసం దేశం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోంది. అయితే 7 దశల పోలింగ్ 1వ తేదీతో ముగియడంతో అదే రోజు సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి సర్వే సంస్థలు భారీగా సర్వేలు చేసినట్లు వెల్లడైంది. పలు సంస్థలు తమ అంచనాలను విడుదల చేశాయి. దీంతో దేశంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనే దానిపై ఒక క్లారిటీ వచ్చేసింది. ఆంధ్రప్రదేశ్ సహా పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కూడా ఎలా ఉండబోతున్నాయనే దానిపై ఒక అంచనాకు వచ్చారు జనం. అయితే తమకు అనుకూలంగా సర్వేలు రాని పార్టీలు వీటిని ట్రాష్ అని కొట్టి పారేస్తున్నాయి.
ఈవీఎంలలో ప్రజలు ఎవరికి ఓటేశారనేది అవి ఓపెన్ చేసి లెక్కగడితే తప్ప చెప్పడం కష్టం. కానీ సర్వే సంస్థలు మాత్రం ఫలానా పార్టీకి గెలుపు అవకాశాలున్నాయని అంచనా వేస్తుంటాయి. శాస్త్రీయంగా ఇలాంటి సర్వేలు చేసినప్పుడు జనాల నాడిని పట్టుకోవడం సులభమే. కానీ ఇప్పుడు సర్వేలు చేస్తున్న సంస్థల శాస్త్రీయత ఎంత అనే దానిపై అనేక అనుమానాలున్నాయి. సర్వే సంస్థలు రాజకీయ పార్టీలకు సేవలందిస్తుంటాయి. ఆయా పార్టీలు ఇచ్చే ఫండింగ్ పైనే ఎక్కువగా ఆధారపడుతూ ఉంటాయి. అలాంటప్పుడు ఆ సర్వే సంస్థలు ఇచ్చే అంచనాలను ఎలా నమ్మాలి అనే ప్రశ్నలు కూడా ఉన్నాయి.
సర్వే సంస్థలు ఏవీ ఈవీఎంలలోకి తొంగి చేసి చెప్పలేవు. తాము అనుకున్న కొన్ని ప్రమాణాలను ప్రజల దగ్గరకు తీసుకెళ్లి వాళ్లు ఇచ్చే సమాధానాల ఆధారంగా అక్కడి పరిస్థితులను అంచనా వేస్తుంటాయి. వాటినే సర్వేల రూపంలో వెల్లడిస్తూ ఉంటాయి. అయితే ఇప్పుడున్న సర్వే సంస్థల్లో మెజారిటీ ఆర్గనైజేషన్స్ కు క్షేత్రస్థాయి యంత్రాంగం లేదు. ఒక ఇంట్లోనో, ఆఫీసులోనో కూర్చుని న్యూస్ పేపర్లు, లోకల్ గా ఉన్న తమ పరిచయస్తులకు ఫోన్లు చేసి తెప్పించుకున్న సమాచారం ఆధారంగా సర్వేలను విడుదల చేసేస్తున్నాయి. అంతేకాక ఏదైనా పార్టీ తమకు ఫండింగ్ చేసి ఉంటే వాటికి అనుగుణంగా ఫలితాలను ప్రకటించేస్తున్నాయి.
గతంలో పలు సర్వే సంస్థలు తమ అంచనాలు తప్పవడంతో విశ్వసనీయతను కోల్పోయాయి. లగడపాటి రాజగోపాల్ ఆంధ్రా ఆక్టోపస్ గా పేరొందారు. కచ్చితమైన ఫలితాలతో అందరినీ ఆకట్టుకున్నారు. అయితే 2019 ఎన్నికల్లో ఆయన అంచనాలు ఫెయిల్ అయ్యాయి. దీంతో ఆయన సర్వేల నుంచి తప్పుకున్నారు. అలాగే రాష్ట్రంలోనే కాక దేశవ్యాప్తంగా పలు సంస్థలు కూడా ప్రజల నాడిని పట్టుకోవడంలో ఎన్నో సార్లు విఫలమయ్యాయి. కాబట్టి సర్వే సంస్థల ఎగ్జిట్ పోల్స్ ను పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు.