NVS Reddy: తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా ఎన్‌వీఎస్ రెడ్డి

తెలంగాణలో పలువురు ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్ మెట్రో రైలు ఎండీగా కొనసాగుతున్న ఎన్‌వీఎస్ రెడ్డి (NVS Reddy) రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (Government Advisor) ( పట్టణ రవాణ శాఖ) గా నియమితులయ్యారు. ఆయన ఆ పదవిలో రెండేళ్లపాటు కొనసాగుతారు. ఎన్‌వీఎస్ రెడ్డి మెట్రో ఎండీగా సుదీర్ఘకాలంగా పనిచేస్తున్నారు. ఆయన ఎండీగా పదవీ కాలం ఈ నెలాఖరుతో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఆయనను అక్కడి నుంచి రిలీవ్ చేసిన ప్రభుత్వం సలహాదారుడిగా నియమించారు. ఎన్‌వీఎస్ రెడ్డి స్థానంలో హెచ్‌ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ (Sarfaraz Ahmed) కు మెట్రో రైలు ఎండీగా పూర్తిస్థాయి అదనపు బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది. రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ సీఎస్ కె.రామకృష్ణారావు (CS K. Ramakrishna Rao) ఉత్తర్వులు జారీ చేశారు.
ఇంటర్మీడియేట్ విద్య సంచాలకుడు కృష్ణ ఆదిత్యకు సాంఘిక సంక్షేమ గురుకులాల కార్యదర్శిగా అదనపు బాధ్యతలు అప్పగించారు. హెచ్‌ఎండీఏ జాయింట్ మెట్రోపాలిటన్ కమిషనర్ కోటా శ్రీవత్సకు హెచ్‌ఎండీఏ కార్యదర్శిగా అదనపు బాధ్యతలు ఇచ్చారు. వీరుకాకుండా ఇతర కేడర్‌లకు చెందిన పలువురు అధికారులకు స్థానచలనం కల్పించారు. సహకార శాఖ జాయింట్ రిజిస్ట్రార్ ఎం.రాజిరెడ్డిని హైదరాబాద్ చీఫ్ రేషనింగ్ అధికారిగా, ఆదిలాబాద్ జడ్సీ సీఈవో జి.జితేందర్ రెడ్డిని టీజీ ఆయిల్‌ఫెడ్ ఎండీగా, కరీంనగర్ హౌసింగ్ పీడీ రాజేశ్వర్‌ను ఆదిలాబాద్ అదనపు కలెక్టర్‌గా, స్పెషల్ గ్రేడ్ మున్సిపల్ కమిషనర్‌లు ఆర్.ఉపేందర్ రెడ్డి, టి.వెంకన్నను హెచ్‌ఎండీఏ మెట్రోపాలిటన్ జాయింట్ కమిషనర్‌లుగా నియమించారు.