Army Chief: ఆపరేషన్ సిందూర్-2 కు సిద్ధమేనా..? పాకిస్తాన్ కు భారత ఆర్మీచీఫ్ హెచ్చరిక..?
సిందూర్ -1తో ట్రైలర్ చూపించాం.. 88 గంటల్లోనే కాళ్ల బేరానికి రప్పించాం.. ఇకనైనా బుద్ది తెచ్చుకుని మెసలండి. కాదని ఉగ్రవాద గ్రూపలకు మద్దతు కొనసాగిస్తే.. తీవ్ర పరిణామాలు తప్పవంటూ పాకిస్తాన్ (Pakistan) ను హెచ్చరించారు భారత్ ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది. ఉగ్రవాదులను, వారికి మద్దతిచ్చే వారిని భారత్ ఒకే విధంగా పరిగణిస్తుందని, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు.
పాకిస్థాన్‌తో వ్యవహరించే విషయంలో భారత ప్రభుత్వం కొత్త విధానాలను అనుసరిస్తున్నట్లు తెలిపారు ఆర్మీచీఫ్. ఉగ్ర ముఠాలను ఎగదోయడం మానకపోతే పాకిస్థాన్ అస్థిత్వమే ప్రమాదంలో పడుతుందని హెచ్చరించారు. భారత ప్రభుత్వం ఎప్పుడూ దేశ ప్రజల పురోగతి, శ్రేయస్సుపై దృష్టి పెడుతుందని అన్నారు. తన మార్గంలో ఎవరైనా అడ్డంకులు సృష్టిస్తే, దీటుగా స్పందిస్తుందని స్పష్టం చేశారు.
పాకిస్థాన్ కు ఇప్పటికే ఆపరేషన్ సిందూర్ ద్వారా 88 గంటల ట్రైలర్ చూపించామని, ఇకపై పూర్తి సినిమా చూపించేందుకు సిద్ధంగా ఉన్నామని వ్యాఖ్యానించారు.ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్థాన్‌లో ఉగ్రవాద స్థావరాల ఉనికి గురించి ప్రపంచానికి ఆధారాలను అందించినట్లు తెలిపారు. చర్చలు, ఉగ్రవాదం ఎన్నటికీ కలిసి సాగవని, రక్తం, నీరు కలిసి ప్రవహించబోవని పాకిస్థాన్‌కు మరోసారి గట్టి హెచ్చరికలు జారీ చేశారు. బ్లాక్‌మెయిళ్లకు పాల్పడే పరిస్థితుల్లో భారత్ లేదని, శత్రువులను ఎదుర్కోవడానికి దేశంలోని నేతలంతా ఏకతాటిపై పనిచేస్తున్నారని తెలిపారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్ముకశ్మీర్‌లో పరిస్థితి మెరుగుపడినట్లు చెప్పారు.






