Hamas: గాజా పాలన నుంచి తప్పుకో.. హమాస్ కు తొలిసారి అరబ్ దేశాల వార్నింగ్..
గాజా (Gaza).. పేరుకు పాలస్తీనా అథారిటీ లేదా పాలస్తీనా సర్కార్ ఆధీనంలో ఉన్న ప్రాంతం. అయితే నిజానికి ఇక్కడ రాజ్యమంతా హమాస్ (Hamas) ఉగ్రవాద సంస్థదే. ఆ సంస్థ చెప్పినట్లు ఇక్కడ అన్నీ జరుగుతాయి. ఎంతలా అంటే ఈప్రాంతంలో ఏకంగా జనావాసాల కింద .. ఆసంస్థ భూగర్భ సొరంగాలు తవ్వేంత. అంతేకాదు.. అక్కడ నుంచి రాకెట్ లాంచర్లు ప్రయోగించేలా ఏర్పాట్లు కూడా చేసుకుందీ సంస్థ. ఓవేళ ఇజ్రాయెల్ దాడులు చేసినా జనావాసాలు ఉంటాయి కాబట్టి.. చచ్చినట్లుగా వెనుదిరుగుతుందని నమ్ముతూ వచ్చింది.
గతంలో ఇజ్రాయెల్ అలాగే చేస్తూ వచ్చింది కూడా. ఎప్పుడు తమదేశంలో దాడులు జరిగినా, ఉగ్రవాదులు చొరబడి ఎటాక్ చేసినా.. వారిని ఏరివేస్తూ వచ్చింది. గాజాపై దాడి చేసి, ఉగ్రవాదులు దాగిన ప్రదేశాన్ని సెర్చ్ చేసి, నిర్మూలించేది. కానీ ఇటీవల జరిగిన ఉగ్రదాడితో.. ఏకంగా హమాస్ పైనే ఇజ్రాయెల్ .యుద్ధం ప్రకటించింది. అంతేకాదు.. గాజాను ఆక్రమించి, హమాస్ నేతలను ఏరివేస్తూ వచ్చింది. ఆఖరుకు ఈ దాడుల్లో వేలాదిమంది గాజావాసులు ప్రాణాలు కోల్పోవడం జరుగుతోంది. ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తూ వచ్చిన అరబ్ దేశాలు… ఇజ్రాయెల్, హమాస్ మధ్య సంధి జరుగుతుందని ఆశించాయి. కానీ ఎక్కడా ఆసూచనలు కనిపించడం లేదు కదా.. దాడులు మరింతగా పెరిగిపోతున్నాయి. దీంతో అవి కూడా ఇక తమ నిశ్శబ్దాన్ని వదిలిపెట్టాయి.
హమాస్ తమ వద్ద ఉన్న ఆయుధాలను పాలస్తీనా అథారిటీకి అప్పగించి గాజా పాలన నుంచి తప్పుకోవాలని అరబ్ దేశాలు తొలిసారిగా సూచించాయి. పాలస్తీనాను స్వతంత్ర దేశంగా గుర్తించేందుకు ఇదే సరైన మార్గమని తేల్చి చెప్పాయి. ఐక్యరాజ్యసమితిలో జరిగిన సదస్సులో అరబ్ దేశాలు, ఈయూతో పాటు 17 దేశాలు పాల్గొని ఇజ్రాయెల్-పాలస్తీనాలను రెండు దేశాలుగా గుర్తించే సూత్రంపై చర్చించాయి. దీనిపై ఫ్రాన్స్, బ్రిటన్, కెనడాతో పాటు ఈయూ, అరబ్ లీగ్ దేశాలు సమావేశమై ఓ తీర్మానం ఆమోదించాయి. 2023 అక్టోబరు 7న ఇజ్రాయెల్‌పై హమాస్ దాడిని కూడా తీర్మానంలో ఖండించారు. హమాస్ చర్యను అరబ్ దేశాలు ఖండించడం కూడా ఇదే తొలిసారి. నాటి హమాస్ దాడిలో 1200 మంది ఇజ్రాయెలీలు చనిపోయారు. ప్రతీకారంగా గాజాపై ఇజ్రాయెల్ దాడుల్లో 60 వేల మందికి పైగా మృతిచెందారు.
సమావేశానికి హాజరుకాని అమెరికా, ఇజ్రాయెల్
ఐక్యరాజ్యసమితిలో జరిగిన ఈ సమావేశానికి అమెరికా, ఇజ్రాయెల్ హాజరుకాలేదు. కాల్పుల విరమణకు అంగీకరించకుంటే పాలస్తీనాను ప్రత్యేక దేశంగా గుర్తిస్తామని బ్రిటన్ ప్రధాని స్టార్మర్ హెచ్చరించడాన్ని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తప్పుబట్టారు. ఉగ్రవాదులపై మెతకవైఖరి తగదన్నారు.






