Gaza: గాజా వాసులకు పునరావాసం కల్పించలేం.. ట్రంప్ ప్రతిపాదనకు అరబ్ దేశాల తిరస్కరణ
ఇజ్రాయెల్ (Israel) భీకర దాడులతో గాజా తీవ్రంగా దెబ్బతింది. పౌర జీవనం అస్తవ్యస్తంగా మారింది. ఆ ప్రాంతమంతా శిథిలాలతో నిండిపోయింది. ఈ క్రమంలోనే నిరాశ్రయులుగా మారిన పాలస్తీనీయులకు (Palestinians) ఆశ్రయం కల్పించాలంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) చేసిన ప్రతిపాదనలను అరబ్ దేశాలు (Arab nations) తిరస్కరించాయి.
‘‘పాలస్తీనీయులకు పునరావాసం కల్పించడానికి చేసే ప్రణాళికను మేం అంగీకరించలేం. ఎందుకంటే.. అలా చేసినట్లయితే ఆయా ప్రాంతాల్లోని స్థిరత్వాన్ని ఇది దెబ్బతీసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు కొనసాగుతున్న సంఘర్షణ విస్తరించే ప్రమాదమూ లేకపోలేదు. తద్వారా ప్రజలకు శాంతియుతంగా జీవించడం కష్టంగా మారుతుంది’’ అని ఈజిప్టు, జోర్డాన్, సౌదీ అరేబియా, యూఏఈ, ఖతార్, పాలస్తీనా అథారిటీ, అరబ్ లీగ్‌లు సంయుక్తంగా ప్రకటన చేశాయి.
‘‘ఇజ్రాయెల్ దాడులతో గాజా శిథిలాల కుప్పగా మారి.. ప్రతీది నాశనమైంది. ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. అందువల్ల వారికి ఆశ్రయం కల్పించేందుకు అరబ్ దేశాలతో కలిసి వేరే ప్రాంతంలో ఇళ్ల నిర్మాణాలు చేపట్టాలని భావిస్తున్నా. అక్కడ వారంతా ప్రశాంతంగా జీవించగలరు. ఈ పునరావాసం తాత్కాలిక కాలానికే పరిమితం కావచ్చు.. లేదా దీర్ఘకాలం కొనసాగొచ్చు’’ అని ట్రంప్ ఇటీవల వ్యాఖ్యానించారు.
ఈ నేపథ్యంలోనే తాజాగా స్పందించిన అరబ్ దేశాలు ఆయన ప్రతిపాదనను తిరస్కరించాయి. ఇప్పుడు అమెరికా ముందడుగేసి, పక్కా చర్యలు తీసుకోవాల్సి ఉంది. పెద్దన్న ముందుకొచ్చి పనులు చేపడితే.. ఆ తర్వాత మిగిలిన దేశాలు సహకరించే అవకాశముంటుంది. లేదంటే ఈ ప్రతిపాదన ఆదిలోనే ఆగిపోయే ప్రమాదముందని చెప్పొచ్చు.






