US: పాక్, చైనాలకు అమెరికా షాక్.. బలోచ్ లిబరేషన్ ఆర్మీపై ఆంక్షలు వీటో చేసిన అగ్రరాజ్యం..!
పాకిస్తాన్ కు అగ్రరాజ్యం షాకిచ్చింది. ఓవైపు మిత్రదేశంగా ఉంటూనే.. మరోవైపు బలోచ్ లిబరేషన్ ఆర్మీవిషయంలో మాత్రం విభేదించింది. బలోచ్ లిబరేషన్ ఆర్మీని(BLA) ఉగ్రసంస్థగా గుర్తించాలని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో పాక్, చైనా చేసిన ప్రతిపాదనను అమెరికా (US) అడ్డుకుంది. బలోచ్ లిబరేషన్ ఆర్మీని ఉగ్రసంస్థగా గుర్తించడానికి ఆధారాలు అసంపూర్ణంగా ఉన్నాయంటూ భద్రతా మండలిలో ఈ ప్రతిపాదనను యూఎస్, యూకే, ఫ్రాన్స్ అడ్డుకున్నాయి. అయితే బలోచ్ లిబరేషన్ ఆర్మీ (BLA)ని విదేశీ ఉగ్రవాద సంస్థగా (FTO) గుర్తిస్తూ అగ్రరాజ్యం ఇటీవల కీలక ప్రకటన చేసింది. దీనికి విరుద్ధంగా ఐక్యరాజ్యసమితిలో పాక్, చైనా (Pakistan-China) ప్రతిపాదనను అడ్డుకుంది అమెరికా.
బలోచ్ లిబరేషన్ ఆర్మీ (BLA) దాని అనుబంధ మజీద్ బ్రిగేడ్లను ఉగ్రసంస్థలుగా ప్రకటించాలని యూఎన్ భద్రతామండలిలో చైనా, పాక్ ఉమ్మడి బిడ్‌ను సమర్పించాయి. పాక్ (Pakistan) రాయబారి అసిమ్ ఇఫ్తికార్ అహ్మద్ మాట్లాడుతూ.. ఐఎస్ఐఎల్-కె, అల్‌ఖైదా, తెహ్రిక్-ఇ-తాలిబన్ పాకిస్థాన్, బలోచ్ దాని అనుబంధ మజీద్ బ్రిగేడ్ వంటి ఉగ్రవాద సంస్థలు అఫ్గాన్ కేంద్రంగా పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. అక్కడ దాదాపు 60కి పైగా ఉగ్రవాద శిబిరాలు సీమాంతర దాడులకు పాల్పడుతున్నాయన్నారు. వారి ఉగ్ర కార్యకలాపాలను అడ్డుకోవడానికి ఈ జాబితాపై తగిన నిర్ణయం తీసుకోవాలని భద్రతా మండలిని కోరారు.
ఇటీవల కాలంలో బలోచ్ లిబరేషన్ ఆర్మీ (BLA)కి చెందిన మజీద్ బ్రిగేడ్ పాక్‌లోని పలు ప్రాంతాల్లో దాడులకు పాల్పడింది. పలు ఆత్మాహుతి దాడులను సైతం నిర్వహించింది. 2024లో కరాచీ ఎయిర్పోర్ట్, గ్వాదర్ పోర్టు అథారిటీపై బీఎల్ఏ దాడులు చేపట్టింది. ఇక ఈ ఏడాది మార్చిలో జాఫర్ ఎక్స్‌ప్రెస్‌ను హైజాక్ చేసింది. క్వెట్టా నుంచి పెషావర్‌కు వెళ్తున్న రైలును హైజాక్ చేసిన ఘటనలో 31 మంది పౌరులు, పాక్ సైనికులు చనిపోయారు. ఈ ఘటనలో 300 మంది ప్యాసింజర్లను బలోచ్ ఆర్మీ బందీలుగా ఉంచుకుంది. పాక్ ప్రత్యేక ఆపరేషన్ చేపట్టి వారిని విడిపించింది.
బలోచిస్థాన్ ప్రాంతాన్ని ప్రత్యేక దేశంగా ఏర్పాటుచేయడం కోసం బలోచ్ లిబరేషన్ ఆర్మీ ఏర్పడింది. పాక్‌లోని అత్యధిక ఖనిజ నిల్వలు ఉన్న ప్రావిన్స్‌గా బలోచిస్థాన్ (Balochistan)ను పేర్కొంటారు. ఇక్కడ చమురు, బొగ్గు, బంగారం, రాగి, సహజ వాయువు తదితర వనరులు పుష్కలంగా ఉన్నాయి. దీంతో ప్రత్యేక దేశం కోసం బలోచ్ ప్రజలు దశాబ్దాలుగా పోరాడుతున్నారు.






