Piyush Goyal: బెదిరిస్తే డీల్స్ చేసుకోం .. భారత్ ప్రయోజనాలే మాకు ముఖ్యం : పీయూష్ గోయల్
అమెరికాతో వాణిజ్య ఒప్పందం ఆలస్యం అవుతున్న నేపథ్యంలో కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ (Piyush Goyal) కీలక వ్యాఖ్యలు చేశారు. తొందరపడి లేదా బయటి ఒత్తిళ్లకు తలొగ్గి భారత్ ఎలాంటి అంతర్జాతీయ ఒప్పందాలూ చేసుకోదని ఆయన తేల్చిచెప్పారు. జర్మనీలో జరిగిన బెర్లిన్ డైలాగ్ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దేశ దీర్ఘకాలిక ప్రయోజనాలకు ఉపయోగపడే ఒప్పందాలకే తాము ప్రాధాన్యత ఇస్తామని ఆయన స్పష్టంచేశారు. “మేము యూరోపియన్ యూనియన్‌తో, అమెరికాతో చర్చలు జరుపుతున్నాం. డెడ్‌లైన్స్ కోసమో లేదా మా తలపై తుపాకీ పెట్టి బెదిరించారనో ఎలాంటి డీల్స్ చేసుకోం” అంటూ పరోక్షంగా అమెరికాపై గోయల్ (Piyush Goyal) చురకలేశారు. అంతర్జాతీయ భాగస్వాములతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ, దేశ ప్రాధాన్యతల విషయంలో తాము ఏమాత్రం రాజీ పడబోమని ఆయన స్పష్టం చేశారు. బాహ్య ఒత్తిడిలను పట్టించుకోబోమని, స్వయం ప్రాధాన్యతలు, వ్యూహాలే తమకు ముఖ్యమని పేర్కొన్నారు. భారత్ చేసుకునే అన్ని భాగస్వామ్యాలు పరస్పర గౌరవంపైనే నిర్మితమైనవని, తాము ఎవరితో వ్యాపారం చేయాలనే విషయాన్ని ఇతరులు నిర్దేశించలేరని ఆయన (Piyush Goyal) స్పష్టంగా చెప్పారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేయవద్దని భారత్‌పై అమెరికా ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్న తరుణంలో గోయల్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.







