Maha Kumbh Mela: 7500 కోట్ల వ్యయం.. కుంభమేళాకు వైరస్ ముప్పు!

ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాట్లు చేస్తున్న మహా కుంభమేళా ఇప్పుడు ఓ అంతుచిక్కని ముప్పును ఎదుర్కొంటోంది. ఈ నెల 13న మకర సంక్రాంతిని పురస్కరించుకుని ప్రారంభించబోతున్న కుంభమేళా కోసం 7500 కోట్ల రూపాయల వ్యయం చేశారు. రాత్రింబవళ్లు వేలాది కార్మికులు, వందలాది అధికారులు కష్టపడుతూ, అన్ని ఏర్పాట్లను సజావుగా నిర్వహించారు. కానీ, ఇప్పుడు ఆ భారీ వ్యయానికి ముప్పుగా చైనా నుంచి వచ్చిన “హ్యూమన్ మెటా న్యుమో వైరస్” (HMPV) సమస్యగా మారింది.
ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న ఈ కుంభమేళాను యోగి ఆదిత్యనాథ్ (Yogi Adhithyanath) నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. దేశవ్యాప్తంగా ఉన్న భక్తులే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులను ఆకర్షించి ఈ కుంభమేళాను విజయవంతం చేయాలని నిర్ణయించింది. ఆ దిశగా పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేయడమే కాకుండా, భద్రత, పారిశుద్ధ్యం, తరచూ వచ్చే భక్తుల సౌకర్యాల మీద దృష్టి పెట్టింది.
అయితే ఈ ఏర్పాట్ల మధ్యనే హెచ్ఎంపీవీ (HMPV) అనే వైరస్ దేశంలో ప్రవేశించింది. బెంగళూరు సహా మరికొన్ని రాష్ట్రాల్లో ఈ కేసులు నమోదు అయ్యాయి. ఇది తలుపుతట్టడం ప్రభుత్వం కోసం పెద్ద సమస్యగా మారింది. ఈ వైరస్‌తో ప్రాణాపాయం పెద్దగా లేకున్నా, తుమ్ములు, దగ్గు, ఒళ్లు నొప్పులు, గొంతు నొప్పి, జ్వరం వంటి లక్షణాలతో ఇబ్బంది పెడుతోంది. పలు చోట్ల ఈ లక్షణాలు కలిగిన వారి సంఖ్య పెరుగుతోంది. HMPV కూడా అంటువ్యాధి కావడంతో సెకన్ల వేగంతో వ్యాపిస్తోంది.
ఇలాంటి పరిస్థితుల్లో మహా కుంభమేళాపై ఈ వైరస్ ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే మహా కుంభమేళాకు భక్తుల తాకిడి భారీగా ఉంటుందని అంచనా వేస్తున్న నేపథ్యంలో, వైరస్ వ్యాప్తి విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్ర ఆందోళనకు గురయ్యాయి. ఇదే పరిస్థితి కొనసాగితే భక్తుల అనుమతిపై ఆంక్షలు విధించే అవకాశం ఉంటుంది. కానీ ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల ఇప్పటి వరకూ చేసిన భారీ ఖర్చు వృథా అవుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
గతంలో కరోనాతో వచ్చిన పరిస్థితులు మళ్లీ ఇప్పుడు హెచ్ఎంపీవీ (HMPV) రూపంలో కనిపిస్తున్నాయి. మహా కుంభమేళా వాయిదా వేయడం అసాధ్యమైనా, భక్తులపై పరిమితులు విధించాల్సి వస్తే పరిస్థితులు మరింత సంక్లిష్టంగా మారుతాయి. ఈ వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో, మహా కుంభమేళా సజావుగా సాగుతుందా అన్నది వేచి చూడాల్సి ఉంది.