America : అమెరికా నిర్ణయాన్ని స్వాగతించిన కేంద్రం

భారత్‌కు చెందిన మూడు అణు సంస్థలపై ఆంక్షలు ఎత్తివేస్తూ అమెరికా తీసుకున్న నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం స్వాగతించింది. ఈ చర్య పౌర-అణు రంగంలో సహకారానికి కొత్త మార్గాలను తెరుస్తుందని పేర్కొంది. భాభా అటామిక్ రీసెర్చ్ సెంటర్ (బార్క్), ఇందిరా గాంధీ అటామిక్ రీసెర్చ్ సెంటర్ (ఐజీసీఏఆర్), ఇండియన్ రేర్ ఎర్త్స్ (ఐఆర్‌ఈ)లపై ఆంక్షలు ఎత్తివేస్తున్నట్లు అమెరికా ప్రకటించిన సంగతి తెలిసిందే. భారత్, అమెరికా సంస్థల మధ్య పౌర అణు రంగంలో భాగస్వామ్యానికి ఉన్న అడ్డంకులను తొలగించే దిశగా వాషింగ్టన్ చర్యలు చేపట్టనున్నట్లు అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సులీవాన్ (Jake Sullivan) వారం క్రితం పేర్కొన్నారు. ఆ తర్వాత అమెరికా ఆ మేరకు నిర్ణయం తీసుకుంది. దీనిపై భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణదీప్ జైస్వాల్ హర్షం వ్యక్తం చేశారు.