Bengaluru : బెంగళూరులో యూఎస్ కాన్సులేట్ ప్రారంభం

భారత్‌లో ఇప్పటికే నాలుగు రాష్ట్రాల్లో యూఎస్ కాన్సులేట్‌లను స్థాపించిన అమెరికా, తాజాగా బెంగళూరు (bengaluru) లో ఐదో కార్యాలయాన్ని ప్రారంభించింది. విదేశాంగశాఖ మంత్రి ఎస్.జైశంకర్(Jaishankar), భారత్‌లో యూఎస్ రాయబారి ఎరిక్ గార్సెట్టి(Eric Garcetti), కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్(DK Shivakumar) బెంగళూరు కార్యాలయ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఎరిక్ గార్సెట్టి మాట్లాడుతూ అమెరికాతో అత్యధికంగా విదేశీ వ్యవహారాలు చేపట్టే రెండో అతిపెద్ద దేశం భారత్. అమెరికా వీసాలు అత్యధికంగా భారతీయులకే వస్తున్నాయి. సిలికాన్ సిటీతో పోటీపడుతున్న బెంగళూరులో కాన్సులేట్ కార్యాలయ సేవలు ఎంతో అవసరం అన్నారు. కేంద్రమంత్రి ఎస్.జైశంకర్ మాట్లాడుతూ ఏడాదిలోనే బెంగళూరు ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయం (Passport Office )లో 8.83 లక్షల వీసాలు డెలివరీ ఇవ్వడం, వారానికి 3 విమానాలు శాన్‌ఫ్రాన్సిస్కోకు వెళ్లడం, 700 అమెరికన్ కంపెనీలు, పదివేల మంది అమెరికన్లు ఇక్కడ నివసిస్తుండడం ఈ రాష్ట్ర డిమాండ్ ఏంటో చెబుతాయి. నేను త్వరలోనే చేయబోయే అమెరికా పర్యటనలో వీసా ఆపరేషన్ అంశంపై కీలకంగా చర్చిస్తాను అని హామీ ఇచ్చారు.