Budget Session: ఆదివారమే కేంద్ర బడ్జెట్.. పార్లమెంట్ సమావేశాల షెడ్యూల్ విడుదల!
దేశ ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు (Budget Session) ముహూర్తం ఖరారైంది. ఈ నెల 28 నుంచి ప్రారంభం కానున్న ఈ సమావేశాలు ఏప్రిల్ 2 వరకు కొనసాగుతాయని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు అధికారికంగా ప్రకటించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదంతో ఈ షెడ్యూల్ను విడుదల చేశారు. జనవరి 28న ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగంతో సమావేశాలు మొదలవుతాయి.
ఈసారి బడ్జెట్ సమావేశాల్లో ఒక ఆసక్తికరమైన అంశం చోటుచేసుకుంది. సాధారణంగా సెలవు దినమైన ఆదివారం నాడు పార్లమెంట్ (Budget Session) నడవదు. కానీ ఈసారి ఫిబ్రవరి 1వ తేదీ ఆదివారం వచ్చినప్పటికీ, అదే రోజున కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నట్లు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా స్పష్టం చేశారు. నిర్మలా సీతారామన్ వరుసగా ఎనిమిదోసారి బడ్జెట్ ప్రవేశపెడుతూ రికార్డు సృష్టించనున్నారు.
బడ్జెట్ సమావేశాలు (Budget Session) రెండు విడతలుగా జరుగుతాయి. తొలి విడత జనవరి 28 నుంచి ఫిబ్రవరి 13 వరకు, విరామం తర్వాత రెండో విడత మార్చి 9 నుంచి ఏప్రిల్ 2 వరకు సాగుతాయి. సభలో ప్రజా సమస్యలపై అర్థవంతమైన చర్చ జరగాలని, ఇందుకు ప్రతిపక్షాలు సహకరించాలని ప్రభుత్వం కోరింది.






