PM Modi: సంక్రాంతికి కొత్త భవనంలోకి ప్రధాని మోడీ!
భారత పరిపాలన చరిత్రలో సరికొత్త అధ్యాయం మొదలుకాబోతోంది. స్వాతంత్ర్యం వచ్చిన 79 ఏళ్ల తర్వాత, బ్రిటీష్ కాలం నాటి భవనాలను వీడి, నవ భారత నిర్మాణానికి ప్రతీకగా నిలిచే కొత్త కార్యాలయంలోకి ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) అడుగుపెట్టనున్నారు. రేపు (జనవరి 14) మకర సంక్రాంతి పర్వదినాన ఆయన తన కొత్త కార్యాలయం ‘సేవా తీర్థ్’ (Seva Tirth) లో బాధ్యతలు స్వీకరించనున్నారు.
సెంట్రల్ విస్టా రీడెవలప్మెంట్ ప్రాజెక్టులో భాగంగా లార్సెన్ అండ్ టూబ్రో సంస్థ సుమారు రూ. 1,189 కోట్ల వ్యయంతో ఈ కాంప్లెక్స్‌ను నిర్మించింది. ఇందులో సేవా తీర్థ్-1లో ప్రధాని (PM Modi) కార్యాలయం (PMO), సేవా తీర్థ్-2లో క్యాబినెట్ సెక్రటేరియట్, సేవా తీర్థ్-3లో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కార్యాలయం కొలువుదీరనున్నాయి. అత్యాధునిక కమ్యూనికేషన్ వ్యవస్థలు, పర్యావరణ అనుకూల హంగులు, అత్యున్నత స్థాయి భద్రత ఈ భవనం సొంతం.
ఇన్నాళ్లు దేశ అధికార కేంద్రంగా వెలిగిన నార్త్, సౌత్ బ్లాక్‌లు ఇకపై ప్రజల సందర్శనార్థం ‘యుగే యుగీన్ భారత్ సంగ్రహాలయ’ (Yuge Yugeen Bharat Sangrahalaya) మ్యూజియంగా మారనున్నాయి. వలసవాద గుర్తులను చెరిపేస్తూ, పాలనా కేంద్రాలను ప్రజలకు చేరువ చేసే దిశగా ఈ చారిత్రక మార్పు చోటుచేసుకుంటోంది. కొత్త ఆఫీసు సమీపంలోనే ప్రధాని (PM Modi) నివాసం కూడా సిద్ధమవుతోంది.






