Supreme court: తల్లిదండ్రుల బాధ్యతలు పట్టించుకోని పిల్లలకు ఆస్తిపై హక్కు లేదు.. సుప్రీం కోర్ట్ సంచలన నిర్ణయం..

తల్లిదండ్రులు పిల్లల కోసం ఎంతో కష్టపడతారు.. ఎంత సంపాదించినా తమ కోసం ఉపయోగించకుండా కష్టపడి దాచిపెట్టి పిల్లలకు ఆస్తి రూపంలో అందివ్వాలి అని ఆలోచిస్తారు. అయితే కొందరు పిల్లలు తల్లిదండ్రుల నుంచి ఆస్తి (Property) సంక్రమించక ముందు ఒక తీరుగా.. ఆస్తి చేతికి వచ్చాక మరొక తీరుగా ప్రవర్తిస్తుంటారు. సోషల్ మీడియా వేదికగా తల్లిదండ్రులను పిల్లలు హింసిస్తున్న ఎన్నో వీడియోలు కూడా గత కొద్దికాలంగా వైరల్ అవుతున్నాయి. ఇక ఎంతోమంది పిల్లలు ఆస్తులు చేతికి వచ్చిన తరువాత తల్లిదండ్రులను పట్టించుకోకుండా వదిలేస్తున్నారు.
ఈ నేపథ్యంలో తాజాగా సుప్రీం కోర్ట్ (Supreme court) ఈ విషయంపై సంచలనాత్మకమైన తీర్పును ఇచ్చింది. తల్లిదండ్రులు తమ ఆస్తులు గిఫ్ట్ డిడ్ (Gift deed) ద్వారా కొడుకుకు ఇచ్చినప్పటికీ.. వారి బాగోగులు పట్టించుకోని పిల్లలకు ఆస్తులు దక్కవని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇక ఈ తీర్పు పై ఎందరో తమ హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. మధ్యప్రదేశ్ లోని చిత్తాపూర్లో వృద్ధ దంపతులు ఎదుర్కొన్న పరిస్థితులు ఈ తీర్పుకి కారణాలుగా నిలిచాయి.
తల్లిదండ్రులు తమ బిడ్డకు ఆస్తి లో కొంత భాగాన్ని ఇచ్చినప్పటికీ వారి సంరక్షణను ఆ బిడ్డ పట్టించుకోలేదు. అంతేకాదు మిగిలిన భాగాన్ని కూడా ఇవ్వవలసిందిగా వారిని వేధించడం ప్రారంభించాడు. ఈ వేధింపులు తట్టుకోలేని తల్లి సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ ను తనకు న్యాయం చేయమని ప్రార్థించారు. దీంతో గిఫ్ట్ డీడ్‌ను రద్దుచేసి..ఆస్తిపై వృద్ధ దంపతుల హక్కులను పునరుద్ధరించారు
ఇంత జరిగినా తన తప్పు తెలుసుకోకుండా ఆ కొడుకు ఈ తీర్పు పై హైకోర్టులో(High court) సవాలు చేశాడు. అయితే హైకోర్టులోని సింగిల్ బెంచ్ తల్లిదండ్రుల వైపు మొగ్గు చూపినా.. డివిజనల్ బెంచ్ మాత్రం గిఫ్ట్ డీడ్ రద్దు చేయడం కుదరదని తేల్చి చెప్పింది.
దీంతో ఆ వృద్ధ దంపతులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.సుప్రీంకోర్టు, చట్టం ప్రకారం, తల్లిదండ్రుల సంరక్షణపై పట్టించుకోని పిల్లలకు ఇచ్చిన గిఫ్ట్ డీడ్ రద్దు అవుతుందని వెల్లడించింది. ఈ ఆస్తిని తిరిగి వృద్ధ దంపతుల పేరుతో పునరుద్ధరించాలని ఆదేశించింది. ఆస్తి బదలాయింపు వచ్చే నెలాఖరు నాటికి జరగాలని సూచించింది.ఈ తీర్పు, ఆస్తి మాత్రమే కావాలి కానీ తల్లిదండ్రుల బాగోగులను పట్టించుకోము అనే పిల్లలకు సరైన గుణపాఠంగా నిలుస్తుంది.