Sharad Pawar: అది బాధాకరం: అమిత్ షా కామెంట్స్‌పై స్పందించిన శరద్ పవార్

కేంద్ర హోంమంత్రి అమిత్ షా తనపై చేసిన విమర్శలపై ఎన్సీపీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ (Sharad Pawar) స్పందించారు. ప్రస్తుతం రాజకీయ నాయకుల మధ్య మంచి సంభాషణలే కరువయ్యాయని పవార్ అభిప్రాయపడ్డారు. ఒకప్పుడు నాయకుల మధ్య సరైన భావవ్యక్తీకరణ ఉండేదని, కానీ ప్రస్తుతం అది లేకపోవడం బాధాకరమని పవార్ అన్నారు. కేంద్ర హోంమంత్రి పదవికి గౌరవం, హుందాతనం అవసరమన్న ఆయన.. ఆ గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత అమిత్ షాకు ఉందని సూచించారు.
“గతంలో హోంమంత్రులుగా సర్దార్ వల్లభాయ్ పటేల్, యశ్వంతరావు చవాన్, శంకర్ రావు చవాన్ వంటి గొప్ప నాయకులు పనిచేశారు. గుజరాత్ నుండి కూడా చాలామంది అత్యుత్తమ నాయకులు వచ్చారు. ఇప్పుడు అలాంటి వారు రాజకీయాల్లో కరువయ్యారు. షిర్డీలో అమిత్ షా చేసిన ప్రసంగం అర్థరహితం. ఆయన 1978లో నా రాజకీయ జీవితం గురించి మాట్లాడారు, ఆ టైంలో ఆయన ఎక్కడ ఉన్నారో కూడా నాకు తెలియదు. 1978లో నేను మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండగా, మా ప్రోగ్రెసివ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ ప్రభుత్వం సుపరిపాలన అందించింది. ఆ సమయంలో ఆర్ఎస్ఎస్ నాయకులు ప్రమోద్ మహాజన్, వసంత్ రావు భగవత్ కూడా ఎంతో సహకరించేవారు.
అప్పటి నాయకుల మధ్య ఆత్మీయత, సామరస్యపూర్వక వాతావరణం ఉండేది. కానీ ఇప్పటి రాజకీయ నేతల మధ్య అది కనిపించకపోవడం బాధాకరం” అని శరద్ పవార్ (Sharad Pawar) పేర్కొన్నారు. కాగా, అమిత్ షా తన ప్రసంగంలో 1978లో శరద్ పవార్.. వెన్నుపోటు రాజకీయాలకు పాల్పడ్డారని ఆరోపించారు. అలాగే శరద్ పవార్ (Sharad Pawar), ఉద్ధవ్ థాకరే వారసత్వ రాజకీయాలను మహారాష్ట్ర ప్రజలు తిరస్కరించారని, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈ రాజకీయాలను 20 అడుగుల లోతులో పాతిపెట్టారని ఘాటు వ్యాఖ్యలు చేశారు.