తొందరపడి ఉంటే భారీ మూల్యం .. ఆర్బీఐ గవర్నర్
ధరల్ని అదుపు చేయడానికి తీసుకునే చర్యల విషయంలో తొందరపడి ఉంటే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చి ఉండేదని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. తాము సమయానుసారంగా స్పందించామంటూ ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు ఆర్బీఐ తీసుకున్న చర్యల్ని సమర్థించారు. ధరలు పెరుగుతున్నప్పటికీ, వడ్డీ రేట్లను పెంచకపోవడం ద్వారా కీలక సమయంలో దేశ ఆర్థిక వ్యవస్థకు దన్నుగా నిలిచామని తెలిపారు. ఫలితంగా దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలకుండా అడ్డుకున్నామన్నారు. ద్రవ్య విధానాన్ని కఠినతరం చేయకుండా రేట్లను తక్కువగా ఉంచడం వల్లే ఇది సాధ్యమైందన్నారు.
ద్రవ్యోల్బణ కట్టడి విషయంలో ఆర్బీఐ లక్ష్యాన్ని చేరుకోలేకపోయిందని తెలిపారు. దీనిపై వివరణ ఇస్తూ ప్రభుత్వానికి నివేదిక సమర్పించేందుకు ఆర్బీఐ ద్రవ్యపరపతి విదాన కమిటీ భేటీ కానుందని తెలిపారు. అయితే నివేదికను బహిర్గతం చేయబోమని తెలిపారు. దీంట్లో ఎలాంటి దాపరికాలు లేవని, అయితే ప్రభుత్వం, కేంద్ర బ్యాంకు మధ్య జరిగే సమాచార బదిలీని బహిర్గతం చేసేందుకు నిబంధనలు అంగీకరించబోవన్నారు. వరుసగా మూడు త్రైమాసికాల పాటు రిటైల్ ద్రవ్యోల్బణం 6 శాతానికి ఎగువన ఉండడానికి గల కారణాలపై నివేదికలో దృష్టి సారిస్తామన్నారు.






