Sankranthi: ఢిల్లీ యూనివర్సిటీలో ఘనంగా సంక్రాంతి సంబురాలు
ఢిల్లీ యూనివర్సిటీలో సంక్రాంతి సంబురాలు (Sankranthi celebrations,) అంబరాన్నంటాయి. ఢిల్లీ యూనివర్సిటీ తెలుగు స్టూడెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విశ్వవిద్యాలయంలో ముందస్తు సంక్రాంతి వేడుకలు ఘనంగా జరిగాయి. భోగి మంటలు, పిండి వంటలు, గంగిరెద్దుల ఆట, సాంస్కృతిక కార్యక్రమాలతో ఢిల్లీ వర్సిటీ (Delhi University)లో తెలుగుదనం ఉట్టిపడింది. కేంద్ర మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు (Rammohan Naidu,), తెలంగాణ ఎంపీ ఈటల రాజేందర్ (Etela Rajender) ఈ వేడుకల్లో పాల్గొన్నారు. తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను చాటిచెప్పేలా వేడుకలు నిర్వహించడం అభినందనీయమని రామ్మోహన్ నాయుడు అన్నారు. వేడుకలు నిర్వహించిన విద్యార్థులను అభినందించారు. ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడుతూ తెలుగు పండుగలకు శాస్త్రీయత, ప్రత్యేక చరిత్ర ఉన్నదన్నారు. బతుకమ్మ, బోనాలు మహిళల గౌరవానికి నిదర్శనమని తెలిపారు. తెలుగు సంస్కృతి భారతీయ సంప్రదాయాలకు అద్దం పడుతుందని అన్నారు.






