Bellary Politics: బళ్లారిలో గాలి వర్సెస్ నారా..! ఎవరిది పైచేయి?
కర్ణాటకలోని బళ్లారి గడ్డ మరోసారి ఫ్యాక్షన్ రాజకీయాలతో భగ్గుమంది. ఒకప్పుడు గనుల తవ్వకాలతో, మైనింగ్ లారీల దుమ్ముతో సతమతమైన ఈ ప్రాంతం, ఇప్పుడు తుపాకీ మోతలతో దద్దరిల్లుతోంది. రెండ్రోజుల క్రితం బళ్లారిలో జరిగిన కాల్పుల ఘటన కేవలం ఒక శాంతిభద్రతల సమస్య కాదు.. అది దశాబ్దాలుగా అక్కడ పాతుకుపోయిన పాత సామ్రాజ్యానికీ, దూసుకొస్తున్న కొత్త అధికార శక్తికి మధ్య జరుగుతున్న ఆధిపత్య యుద్ధం. స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డి, ఒకప్పటి కర్ణాటక రాజకీయ “కింగ్ మేకర్” గాలి జనార్ధన్ రెడ్డి మధ్య రగులుతున్న ఈ వైరం ఇప్పుడు పరాకాష్టకు చేరింది.
బళ్లారిలో రెండ్రోజుల క్రితం జరిగిన కాల్పుల ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తనను హత్య చేయడానికే ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డి కాల్పులు జరిపారంటూ స్వయంగా గాలి జనార్ధన్ రెడ్డి ఆరోపించడం ఈ వివాదానికి ఆజ్యం పోసింది. ఒకప్పుడు బళ్లారిలో “గాలి” అంటేనే శాసనం.. ఆయన కనుసన్నల్లోనే యంత్రాంగం నడిచేది. కానీ, ఇప్పుడు అదే గాలి జనార్ధన్ రెడ్డి తన ప్రాణాలకు ముప్పు ఉందని ఆరోపించడం బళ్లారిలో మారుతున్న రాజకీయ ముఖచిత్రానికి నిదర్శనం. ఈ కాల్పుల వెనుక వ్యక్తిగత కక్షల కంటే, బళ్లారిపై పట్టు సాధించాలనే రాజకీయ ఆకాంక్షే బలంగా కనిపిస్తోంది.
బళ్లారిలో గాలి జనార్ధన్ రెడ్డి ప్రభావాన్ని పూర్తిగా తుడిచిపెట్టడమే లక్ష్యంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డి పావులు కదుపుతున్నారనేది బహిరంగ రహస్యం. గత కొంతకాలంగా భరత్ రెడ్డి వ్యవహార శైలి అత్యంత దూకుడుగా ఉంది. “బళ్లారి కోటను బద్దలు కొట్టే మొనగాడు వచ్చాడు.. గాలికి సరైన మొగుడు భరత్ రెడ్డే” అంటూ ఆయన వర్గీయులు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. గాలి జనార్ధన్ రెడ్డికి ఉన్న ఆర్థిక, అంగబలం గురించి తెలిసి కూడా, భరత్ రెడ్డి ఏమాత్రం వెనక్కి తగ్గకపోగా, నేరుగా ఢీకొట్టేందుకే సిద్ధపడ్డారు. గాలి అనుచర వర్గాన్ని తనవైపు తిప్పుకోవడం లేదా వారిని నిస్తేజం చేయడం ద్వారా జనార్ధన్ రెడ్డిని ఒంటరిని చేసే వ్యూహాన్ని భరత్ రెడ్డి అమలు చేస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
గాలి జనార్ధన్ రెడ్డి ఒకప్పుడు కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వాన్ని నిలబెట్టిన ఘనుడు. ఆయన మాటకు బళ్లారిలో ఎదురే ఉండేది కాదు. కానీ, జైలు జీవితం, మారిన రాజకీయ సమీకరణాలు, సొంత పార్టీ (KRPP) ప్రయోగం, తిరిగి బీజేపీ గూటికి చేరడం వంటి పరిణామాలతో ఆయన పట్టు కొంత సడలింది. సరిగ్గా ఈ ఆకాశాన్ని ఆక్రమించడానికి నారా భరత్ రెడ్డి వ్యూహాత్మకంగా అడుగులు వేశారు. యువకుడు కావడం, అధికార కాంగ్రెస్ పార్టీ అండదండలు ఉండటం భరత్ రెడ్డికి కలిసివస్తున్న అంశాలు. బళ్లారిలో గాలి జనార్ధన్ రెడ్డి సోలో పెర్ఫార్మెన్స్ కు చెక్ పెట్టి, అక్కడ తనదైన ముద్ర వేయాలని భరత్ రెడ్డి చూస్తున్నారు. తాజా కాల్పుల ఘటన ఈ ఆధిపత్య పోరు ఎంత తీవ్ర స్థాయికి చేరిందో తెలియజేస్తోంది.
ఈ ఘటనతో బళ్లారి మరోసారి భయం గుప్పిట నిలిచింది. గాలి జనార్ధన్ రెడ్డి తనపై హత్యాయత్నం జరిగిందని చెబుతుండగా, భరత్ రెడ్డి వర్గం దీన్ని రాజకీయ డ్రామాగా కొట్టిపారేస్తోంది. అయితే, అంతర్గతంగా మాత్రం ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది. ఒకవైపు తన కోల్పోయిన వైభవాన్ని తిరిగి పొందాలని గాలి జనార్ధన్ రెడ్డి శతవిధాలా ప్రయత్నిస్తుంటే.. గాలి శకాన్ని ముగించి బళ్లారికి కొత్త బాస్ గా అవతరించాలని నారా భరత్ రెడ్డి చూస్తున్నారు.
ఈ కాల్పుల ఘటనతో బళ్లారి రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నప్పటికీ, ఇది ఇక్కడితో ఆగేలా కనిపించడం లేదు. రానున్న రోజుల్లో ఈ వర్గ పోరు మరింత ముదిరి, బళ్లారి శాంతిభద్రతలకు సవాలుగా మారే ప్రమాదం లేకపోలేదు. గాలి జనార్ధన్ రెడ్డి తన అనుభవాన్ని, వ్యూహాలను ఉపయోగిస్తారా? లేక యువకిశోరం నారా భరత్ రెడ్డి దూకుడు ముందు తలొగ్గుతారా? అనేది రాబోయే కాలమే నిర్ణయిస్తుంది. ఏది ఏమైనా, బళ్లారిలో ఇప్పుడు తుపాకీ మోతలతో రాజకీయం కొత్త రంగు పులుముకుంది.






